సాహితీ వనం - వర ప్రసాద్...

సాహితీ వనం - వర ప్రసాద్...

స్వాయంభువమనువు చరిత్రమును విన్నతర్వాత, తర్వాతి మనువు ఎవరు? అతని కథ ఏమిటో వివరించండి పుణ్యాత్ములారా! అని జైమిని మహర్షి అడిగాడు. పక్షులు వివరించడం ప్రారంభించాయి, అల్లసానివారి అల్లికకు అనుగుణముగా, ఈ విధముగా...


వరణా ద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం

బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయ రుఙ్మండలీ

హరిణంబై యరుణాస్పదం బనఁగ నార్యావర్త దేశంబునన్

బురమొప్పున్ మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్


‘వరణా’నదీ తీరంలో, ఆర్యావర్తము అని పిలువబడే ప్రాంతములో, ఆకాశాన్ని అంటుకునేట్లున్న భవన గోపురములను కలిగినది (వప్రస్థలీ చుంబితాంబరమై) తన పాలరాతి భవనముల తెల్లని కాంతులతో చంద్రుడి లోని జింకను కూడా తెల్లగా మెరిపించేది (సౌధసుధాప్రభాధవళిత ప్రాలేయ రుఙ్మండలీహరిణంబై) భూదేవి కంఠములో తళ తళలాడే హారములాంటి పట్టణము, అరుణాస్పదము అనే పట్టణము ఒకటి ఉండేది. వరణ – అసి అనే రెండు నదుల మధ్యన ఉన్న పవిత్ర ప్రాచీన నగరము వారణాసి (కాశి). అరుణాస్పదము అనే పట్టణం వరణ నదీ తీరములో ఉంది, అంటే దాదాపు కాశీలో సగము అనేంత పవిత్రత ఉన్న పట్టణము అన్నమాట! అక్కడ విశాలాక్షీ వరుడు, ఇక్కడ విప్రవరుడు ఉన్నారు, అది మరొక తేడా! యిద్దరూ మన్మధుని జయించినవారే, అదీ రహస్యము. నాలుగు వర్ణాలవారూ ఉన్నారు ఆ అరుణాస్పదం అనే పట్టణములో.

ఆ పురిఁ బాయ కుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా

షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ

క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా

ధ్యాపనతత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూ విలాసుఁ డై


ఎన్నడూ ఆ పట్టణాన్ని వదిలి ఎక్కడికీ వెళ్ళకుండా, వివిధ పవిత్ర ధార్మిక దీక్షలను, క్రతువులను క్రమము తప్పకుండా ఆచరించేవాడు, నిరంతర విద్యాదానశీలి, బ్రహ్మదేవుని కులానికే అంటే బ్రాహ్మణజాతికే ఆభరణము వంటివాడు, విద్వత్తులో, పాండిత్యములో అపర ఆదిశేషునివంటివాడు, అందములో మన్మధునివంటివాడు, చంద్రునివంటివాడు, మాటలలో వర్ణించడానికి అలవికాని అందగాడు, ప్రవరుడు అనే వాడుండేవాడు! ఎన్నడూ ఆ పట్టణాన్ని వదిలివెళ్ళనివాడు అనడంలో విరుపు ఉంది, ఎన్నడూ వెళ్ళని వాడు, వెళ్ళాలనే కోరిక తీరనివాడు కనుకనే ఈ కథకు బీజం పడింది అని ముందు ముందు తెలుస్తుంది కనుక!

Vanam Venkata Varaprasadarao

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!