కృష్ణం వందే జగద్గురుం -

కృష్ణం వందే జగద్గురుం -

ద్వాపరయుగంలో శ్రీ మహావిష్ణువు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మించాడు. భగవానుడి ఆదేశం ప్రకారం వసుడుదేవుడు ఆతనిని రేపల్లెలోని యశోదా నందుల ఇంట వదలి వారికీ పుట్టిన యోగామాయను తీసుకొని రాగా, కంసుడు చేతికి ఇవ్వగా తనను చంపబోయే తన శత్రువు వేరొకచోట పెరుతున్నాడని చెప్పి అంతర్ధాన మవుతుంది.

రేపల్లెలో గోకులానికి పెద్ద అయిన నందుని ఇంట చాలా కాలానికి కొడుకు పుట్టంవల్ల, రేపల్లె అంతా సంబరాలు జరుపుకొన్నారు. అష్టమి నాడు పుట్టడంవల్ల ఆరోజు "గోకులాష్టమిగా " కూడా పేరుగాంచింది.

వసుదేవుని పెద్ద భార్య రోహిణి దేవి, మిగిలిన కొంతమంది యాదవులు కూడా నందుని ఇంట రేపల్లెలోనే తలదాచుకున్నారు. బలరాముడు ఆమె బిడ్డ. యాదవుల గురువు వసుదేవుని పిల్లద్దర్కి బలరామకృష్ణలని నామకరణం కావించాడు .

అందరు సంబరాలలో మునిగితేలుతుండగా వూయలలో వున్నా బాలకృష్ణుని తదేక దీక్షతో చూస్తున్నాడు. ఎనిమిది, తొమ్మిది సం.లు వయసువున్న గోపబాలకుడు, చిన్నయ్య అతనిపేరు. యశోదతో అంటున్నాడు “మరేమో అత్తమ్మ కిట్టయ్య నన్ను చూసి నవ్వుతున్నాడు, చేతులూపుతూ నన్ను ఎత్తుకోమంటున్నాడు. నేను ఎత్తుకోనా " అని ఆశగా అడిగాడు . "అమ్మో నువ్వు చిన్నపిల్లాడివి, అప్పుడేకాదు కిట్టయ్యకి బుడిబుడి అడుగులు వచ్చిన తరువాత నువ్వే వాడిని నడిపించుదువు గాని" అని అంది . " వో అలాగే యశోదమత్తమ్మా! రోజు నేనే కిట్టయ్యని ఇలా వూయల లోంచే ఆడిస్తాను" అంటూ అమాయకంగా చెప్పి "మాకిట్టయ్యని నేనే ఆడిస్తానోచ్" అంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయాడు. వాడి అమాయకత్వానికి యశోద,రోహిణి ఇద్దరూ కూడా ఆనందంగా మురిసిపోయారు .

బలరామకృష్ణ లిద్దరూ దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చారు.

అక్కడ కంసుడికి "నిన్ను చంపేవాడు వేరోకొచోట పెరుతున్నాడు"అన్న యోగమాయ మాటలు జ్ఞప్తికి వచ్చి వెంటనే తన అనుచర్లు అయిన కొంతమంది రాక్షసులను పిలిచి అన్ని చోట్ల గాలించి క్రిష్ణుడిని వధించమని ఆదేశించి పంపాడు. పూతన, ధేనుకాసరుడు ,శకాటాసురుడు మొ.వారు అన్ని చోట్ల వెదకి రేపల్లె వైపు వచ్చారు.

ఇంక ఇక్కడనుంచీ బాలకృష్ణుని లీలలు మొదలయ్యాయి.

ఒకపక్క రాక్షస సంహారం చేస్తూ, చిలిపికృష్ణుడు చేసిన లీలలు అన్ని ఇన్ని కావు . ఊరులో వున్నఅందరి ఇళ్ళల్లో దూరి పాలు వెన్న,మీగడ ఆరగించేవాడు .ఈ అల్లారింతటకి నాయకుడు క్రిష్ణుడు. అతనిని భుజాల మీద ఎక్కించి మోసుకెళ్ళడం ఆ అమయాకపు గోపబాలకుడి పని. అసలు ఆ కిట్టమ్మ రూపం చూస్తునే మురిసిపోయేవాడు. చేతవెన్నముద్ద పెట్టి, చెంగల్వ పూదండ చుట్టి , బంగారుమొలతాడు పట్టుదట్టి, నెమిలి ఈకలతో తలమీదపించం పెట్టి, దృష్టి పడకుండా చేతికి తాయత్తులు అత్తమ్మ తెచ్చినవి కట్టి, ఆ కాలి గజ్జెలుతో ఘల్లు ఘల్లు మని నడుస్తూంటే ఆ ముద్దు మోహనరూపం ఎంతచూసినా తనివితీరేది కాదు. రాత్రి నిద్రలో కూడా కిట్టమ్మ నామస్మరణమే .

కాళియమర్ధనం కోసం మడుగులోకి దూకినప్పుడు అందరికంటే ముందు తనే భయపడి యశోదకి చెపుతాడు."కిట్టయ్యా ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు చేస్తావు భయం వెయ్యదా" అని చిన్నయ్య అడిగాడు. అప్పుడు కృష్ణుడు కొంటెగా "నేను అలా చెయ్యకపోతే అమ్మ నన్ను దండిచదు .అమ్మ చేతి తిట్లు వెన్న కన్నా బావుంటాయి కదా అందుకోసం" అని చిలిపిగా నవ్వాడు.

ఇలా కృష్ణలీలలన్నింటిలోను చిన్నయ్య ఎంతో తాద్యాత్మం చెందుతూ ఆ మురళీ గానం వింటూ పరవశంచెందేవాడు.

కంస సంహారం జరిగింతరువాత రాచనగరు మధురలో తన కన్నతల్లి తండ్రులను కలసుకుంటాడు శ్రీ కృష్ణుడు. అప్పుడు యశోద నందులకు తనను గురుంచి బెంగపడ వద్దని, తనని ఎప్పుడూ యశోద తనయుడుగానే లోకమంతా గుర్తిస్తారని వోదారుస్తాడు . రేపల్లె నుంచి వచ్చిన గోపబాలకులు కిట్టయ్య లేకుండా తాము రేపల్లె వెళ్ళం అంటారు. వారికి సమాధానంగా శ్రీ కృష్ణుడు " ఇప్పుడు మీరు అందరు వెళ్ళండి. ఇక్కడ నా భాద్యతలు నేరవేర్చాక మన రేపల్లె వస్తాను " అని చెప్తాడు.

"ఇదేమిటి కిట్టయ్యా నువ్వులేని జీవితం జీవితమే కాదు .నేను ఇప్పుడే నీ ఎదురుగా ప్రాణ త్యాగం చేస్తాను" అని చిన్నయ్య అంటాడు .

అప్పుడు కృష్ణుడు ఒకసారి అతనికి పూర్వజన్మలో అతను కోరిన కోరిక జ్ఞాపకం చేస్తాడు " నీకోసం నేను సామాన్యుడిగా గోకులంలో పుట్టాను. నీతో ఆడాను, పాడాను. నీకోరిక తీర్చాను. భక్తుడి కోరిక తీర్చడం మే నా పని అదేచేసాను.

నేను లేనిలోటును, నన్ను తన ప్రాణం కంటే మిన్నగా చూసుకొన్న నంద యశోదలకు నా బాల్య క్రీడలు గుర్తుచేస్తూ సదా వాళ్ళని చూసుకోవటం ఇప్పడు నువ్వు చెయ్యవలసిన కార్యం . అప్పుడు నువ్వుకూడా వారితో పాటే నన్ను తలచుకుంటూ, నన్ను మీ మనోనేత్రాలతో చూస్తూనే వుంటావు" అని చెప్పగా చిన్నయ్య ఆనందంతో ఉద్వేగభరితుడై "తప్పక చేస్తాను కిట్టమ్మా! తప్పు తప్పు ! శ్రీకృష్ణా! ఇప్పడు నీవు రాచవారి అబ్బాయివి కదా" అనగానే, శ్రీ కృష్ణుడు "ఎప్పటకి నేను నీ కిట్టమ్మనే మిత్రమా" అని నిండుగా కౌగిలించుకుంటాడు.

ఆ ఆలింగనంతో తన జన్మ ధన్యమైందంటూ చేతులు జోడిస్తాడు చిన్నయ్య !!

నీవే తల్లివి దండ్రివి

నీవే నా తోడునీడ నీవే సఖుడౌ

నీవే గురుడవు దైవము

నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!