కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము! . (శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)


కిన్నెరసాని పాటలు కిన్నెర దుఃఖము!
.
(శ్రీ విశ్వనాథ సత్యనారయణ.)
.
హా యని కిన్నెర యేడ్చెన్‌
తన మనోహరుడు శిలయైనా డని
తా నేమో యీ వాగైనా నని
హా యని కిన్నెర యేడ్చెన్‌
ఊగులాడు కెరటాల నాపుకొన
సాగులాడు తరగల్లు నిల్పుకొన
ప్రాకిపోవు తనగుణము చంపుకొన
చాలక చాలక చాలక చాలక
హా యని
తన తొందరయును తన పతి ప్రేమయు
తాను చేసినా తెలివితక్కువయు
తన పతి చూపిన త్యాగగౌరవము
తలచుకు తలచుకు బోరున బోరున
హా యని
ఏడుపు నిప్పుక లెగసి చిమ్ముకొని
ఏటి నీరముల నెండగట్టుకొని
చేటు తప్పిపోయేటిరీతిగా
బాట యేల కనరాదని రాదని
హా యని
చుక్కనైతె యీ బెడద తప్పునే
మొక్కనైతే యీ వగపు తప్పునే
అక్కట నా చెలువునిదెస చేసిన
యిక్కలుషము నే దాటు టెట్టులని
హా యని
కడలి లోకముల నేలేరాజట
కడలి ధర్మములు నిలిపే దొరయట
కడు పతివ్రతల కవయ నెంచుటలు
కడలికి తగునా తగునా యిట్లని
హా యని
అతడు మంచివాడే యగునేమో
సతి వాగై ప్రవహించిన దం చన
అతనికోసమే అయిన దటంచును
మతి తలపోయుట తప్పెట్లగు నని
హా యని
ఏడ్చి ఏడ్చి జలమెల్ల నెర్రనయి
ఏడ్చి ఏడ్చి తనువెల్ల నల్లనయి
ఏడ్చి ఏడ్చి నురుసుల్లు తెల్లనయి
ఏడ్చి ఏడ్చి నడకల్లు వేగమయి
హా యని
బొట్టు బొట్టు కొక వేయియెదలుగా
తరగ తరగ కొక వేయినోళ్ళుగా
బడలి నీరమే యేడుపుమయమై
కడలిమ్రోత లెక్కుడు భయమిడగా
హా యని
గాలిపొరలలో కదలాడినవో
అడవిచెట్లలో అణగారినవో
వెలుగు దారులను విచ్చిచొచ్చినవో
కిన్నెర ఏడుపు సన్నని యెలుగులు
హా యని
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు
విన్న యడవిలో చిన్ని పులుగుగమి
కిన్నెరతో పాటుగ గొంతులలో సన
సన్నని యేడ్పులు జాలు వార్చగా
హా యని
శిలయైన పతిం దెలచిన గాలులు
మెల మెల్లగ తన తరగల నూగగ
చలచల్లన ప్రాణమ్ములు తేరగ
తలచిన కొలంది దుఃఖము పొంగగ
హా యని
క్రొత్తవాగు పరతెంచి వచ్చె నని
క్రొత్తతోగు పరతెంచి వచ్చె నని
క్రొత్త క్రొత్త యాబాలనీరములు
క్రోలగ వచ్చిన పులులు దిగుల్వడ
హా యని
ఎక్క డెక్కడీ మృగములు వచ్చెను
ఎక్క డెక్కడీ పులుగులు వచ్చెను
ఎక్క డెక్కడీ గాలులు వచ్చెను
కిన్నెర నోదార్చుటకై పాపము
హా యని
కిన్నెర యేడుపు చూచి పులుగులూ
కిన్నెర దుఃఖము చూచి మృగములూ
కిన్నెర యేడుపు చూచి గాలులూ
ఓదార్చగలే కవియు నేడ్చెనూ
హా యని
చూడవచ్చినా లేడి కిన్నెరా
గాడివారినా యెడదలోపలా
వాడి వాడి లేజివురు వత్తలై
బేడిస కన్నుల నీరము వెట్టగ
హా యని
ఒడ్డునందు కుందేటికూన లవి
చిన్ని చెవులు తెగ నిక్కపొడుచుకొని
ముందుకాళు లింపొంద నెత్తి యో
దార్చలేక తెల్లతెల్ల వోవగా
హా యని
గూళ్ళలోన తమ పిల్లల వదలెను
మేతకొరకు పోవాలని మానెను
అడవి పులుగులూ లల్లల్ల చేరుకుని
అడవివాగు నోదార్చవచ్చెనూ
హా యని
పికిలి పిట్టలూ అడవి పిచ్చికలు
నీటి పులుగులూ నేలపులుగులూ
తెగగుమికట్టిన తెలుగు పిట్టలం
దొకటి యేడ్చి మఱియొకటి యేడ్వదా
హా యని
కిన్నెర యేడుపు సన్నని యెలుగులు
మిన్ను మన్ను నడి యెడము నెడమునా
చిన్ని వెలుగులో పిన్న గాలిలో
సన్న సన్నగా జాలువారగా
హా యని
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు
పిన్నగాలి కెరటాల చొచ్చునూ
ఎన్నడొ వెనుకటి బ్రతుకున మిక్కిలి
విన్నవాటివలె విరవిరబోవును
హా యని
చిన్ని కిన్నెరా సన్నని యెలుగులు
చిన్ని చెట్ల క్రొంజివురు లంటునూ
ఎన్న నందనము గున్న మావులం
దున్న తుమ్మెదలరొదవలె మొరయును
హా యని
పడతి కిన్నెరా ప్రన్నని యెలుగులు
అడవి పచ్చికలయందున ప్రాకును
అడవి పావురా యెడబాటగ్గికి
గుడగుడ గొంతున కూసిన యట్లగు
హా యని
అల్ల నల్ల కిన్నెర యేడుపులవి
వెల్లివిరిసి గోదావరి కెరటము
లల్లలాడు నా నడిమిసందులో
మెల్లగ దూరెను మొదలిడు పోలిక
హా యని
అల్ల నల్ల కిన్నెర యేడుపు లవి
మెల్ల మెల్ల గోదావరి గర్భము
వెల్లిలోన చొరబారి మొత్తుకొని
గొల్లుమనుచు మొరపెట్టుకొన్నయవి
హా యని
గోదావరి యీవార్త విన్నదీ
గోదావరినది గుండె కరగినది
గోదావరినది జాలి పొందినది
గోదావరి కన్నీరు కార్చినది
హా యని
గోదావరినది పొంగి వచ్చినది
గోదావరి తా నభయ మిచ్చినది
గోదావరి కెరటాలు చాచినది
గోదావరి రమ్మన్నది కిన్నెర
హా యాని
కిన్నెర యెదలో పొంగిపోయినది
కిన్నెర యెదలో తాండవించినది
కిన్నెర మఱి కన్నీరు కార్చినది
కిన్నెర తనకత చెప్పుకున్నదీ
హా యని
కిన్నెర తన కెరటాలు తగ్గినది
కిన్నెర తన యూగిసల నాపినది
కిన్నెర గోదావరి కెరటాలకు
చిన్ని యలలు తా నంది యిచ్చినది
హా యని.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!