🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏


🙏 శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము 🙏


🤲


జగత్ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమమ్ |


స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః || 10 |


🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲


విష్ణు సహస్రనామాలలో మొదటి నామం విశ్వం -


వివరణ:

🤲

౧. విశ్వము - జగము - గోచరాగోచరాత్మకమైన అనంత విశ్వము నారాయణుడే.

మొదటి నామం విశ్వం.

ప్రతివ్యక్తికీ మొదట గోచరించేది విశ్వమే. తొలుత కనబడే ఈవిశ్వమే విష్ణుని రూపమని గ్రహించాలని ఈ ప్రథమ నామం బోధిస్తోంది.

౨. విశ్వమునకు కారణమైనవాడు, కార్యమైనవాడు - అని మరొక అర్థం. పరబ్రహ్మకు భిన్నమైనది ఏదీలేదు. అందుకే విశ్వమే నారాయణుడు.

"బ్రహ్మైవేదం విశ్వమిదం వరిష్ఠం: (ముండకోపనిషత్తు).

"పురుష ఏవేదం విశ్వం" (ముండకోపనిషత్తు).

"అంతర్బహిశ్చ తత్సర్వంవ్యాప్యనారాయణ స్థితః" లోపలా బయటా అంతటా వ్యాపించి నారాయణుడున్నాడు - అని నారాయాణ సూక్తం.

౩. ’విశతి’ - అంటే ’ప్రవేశించెను’ అని అర్థం. నారాయణుడు దేనియందు ప్రవేశించి ఉన్నాడో అది ’విశ్వం’.

కనుక ’విశ్వ” అన్నమాటే”నారాయుడు ఇందులో ఉన్నాడు’అని ఎరుకపరుస్తోంది.

"తత్ సృష్ట్యా తదేవాను ప్రావిశత్" దీనిని సృష్టించి తానే దీనియందు ప్రవేశించాడు" అని తైత్తిరీయ ఉపనిషద్వాక్యం.

"మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ" అని శ్రీకృష్ణ పరమాత్మ "నాకంటె భిన్నమైనది ఏ ఒక్కటీ లేదు" అన్నాడు. కనుక విశ్వమంతా భగవంతుడే.

ఈ ఒక్కనామాన్ని తెలిస్తే చాలు. భగవానుడు ఎక్కడోలేడు. కనిపించేదంతా ఆయనే. కనిపించని అనంతమూ ఆయనే - అనే స్పృహ కలుగుతుంది.

’ఈశావాస్య మిదం సర్వం’ - ఇదంతా ఆ ఈశ్వరునిచే నిండినది.

౪. "విశ్వం అనంత వాచకం" అని మహాభారత వచనం. అంతుపట్టనివాడు.

"విశ్వమశేషం కృత్స్నం సమస్తం నిఖిలాఖిలాని నిశ్శేషమ్!

సమగ్రం సకలం పూర్ణమ ఖండం స్యాదనూనకే!!" అని ’అమరం’.

'వాసుదేవస్సర్వమితి సమహాత్మా సుదుర్లభః’ - అంతా ’వాసుదేవుడే’ అనే జ్ఞానం కలిగినవాడు (బ్రహ్మజ్ఞాని) మహోన్నతుడు - సుదుర్లభుడు. ఆ గొప్పజ్ఞానమే పరమావధి. ఆ జ్ఞానాన్ని స్ఫురింపజేసే నామం ’విశ్వం’.

'అంతా’, ’పూర్ణత్వం’ ’అఖండం’ అయిన పరబ్రహ్మమే విశ్వం.

’హరినీ మయమే అంతాను

అరసి నిన్ను శరణనినాను’ అని అన్నమాచార్య పలుకు.

"హరి మయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంశయింపబని లేదు

హరి మయముగాని వస్తువు

పరమాణువులేదు...’అని పోతనగారి భాగవత వాక్యం.

౫. జగములో తాను ప్రవేశించడమే కాదు - చివరకు జగము కూడా తనలోనే ప్రవేశిస్తున్నది. "యత్ప్రయన్త్యభి సంవిశన్తి" అని వేదవచనం ఎవరిలో ఈ జగము ప్రవేశిస్తున్నదో అతడు ’విశ్వం’

విశ్నాద్విశ్వమిత్యాహుః లోకానాం కాశి సత్తమ!

లోకాంశ్చ విశ్వమేవేతి ప్రవదంతి నరాధిప!!

సమస్త ప్రాణులలోనూ ప్రవేశించి ఉండడం చేత భగవంతుని ’విశ్వం’ అని వ్యవహిరించుతున్నాం.

ఈ శబ్దం నపుంసకలింగ శబ్దం. అంటే ఇది నిర్గుణ పరబ్రహ్మ వాచకం. ఓంకారంతో మంత్రం ప్రారంభమైనట్లే, ఈ ’విశ్వం’ నామంతో విష్ణునామ మంత్రాలు ప్రారంభమయ్యాయి. పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్రి - ఇలా వైదిక దేవతా మంత్రాలన్నీ ’ఓమ్’తో ప్రారంభమౌతాయి. మంత్రాలు మారుతున్నా ’ఓం’కారం మారదు. మారనిది ’ఓమ్’ మారినవి ’మంత్రాలు’. పైగా మంత్రంలో ఒక స్పష్టమైన అర్థం కనిపిస్తుంది. ఉదా!! నమశ్శివాయ - శివునకు నమస్కారం. నమో నారాయణాయ - నారాయణునకు నమస్కారం. కానీ ’ఓం’ కారానికి ఇలాంటి స్పష్టమైన అర్థం లేదు.

సర్వమూలమైన నిర్గుణతత్త్వం ’ఓం’కారం. ఆ ప్రణవంలోని శక్తియే పంచాక్షరిగా, అష్టాక్షరిగా, వివిధ మంత్రాలుగా వచ్చినదని గ్రహించడానికే - నిర్గుణతత్త్వమే వివిధ నామరూపాలతో సగుణమైందని తెలుసుకోడానికి ఈ విధంగా మంత్రాలను జపిస్తాం. ప్రణవమే అన్ని మంత్రాలకు సమన్వయం.

అలాగే ’విశ్వం’ సర్వమయమైన పరతత్త్వానికి సంకేతం. అదే తరుగాత నామాలలో విస్తరించింది. వృక్షానికి మూలం వలె వెయ్యి నామాలకు మూలనామమిది ్.

౬. ’విశ్వం’ అనే మాట - ’ర్వము’నూ బోధించే ’ఓం’కారమే. అందుకే ఈ నామానికి "ఓంకారం’ అని అర్థం.

’ఓమితి బ్రహ్మా. ఓమితీదం సర్వమ్’ - యజుర్వేద ఆరణ్యకం.

’ఓంకార ఏ వేదం సర్వమ్’ - ఛాన్ద్యోగ్యం.

’సర్వవ్యాపిన మోంకారం’

’ఓమిత్యేతదక్షర మిదగ్ సర్వం’ - ఈ శ్రుతి వాక్యాలు ’సర్వము’ ఓంకారమేనని చెబుతున్నాయి. ప్రణవమే ప్రథమాక్షరం. ’ఓమిత్యేకాక్షరం’ అని వేదం చెప్పినది. ఆ మాటనే "గిరామస్మ్యేకాక్షరమ్" "ప్రణవస్సర్వవేదేషౌ" అని గీతాచార్యుడు "పలుకులలో ఏకాక్షరమైన ప్రణవాన్ని నేను" అని ఉద్ఘాటించాడు.

"విశ్వశబ్దేన ఓంకారోభిధీయతే

వాచ్యాచక యోరత్యన్తభేదాభావాత్

విశ్వమిత్యోంకార ఏవ బ్రహ్మేత్యర్థం"

అని ఆదిశంకరుల వచనం. "విశ్వశబ్దం ద్వారా ఓంకారం చెప్పబడుతున్నది". 

ఈనామమే సుజ్ఞానం: విశ్వమును భగవద్రూపంగా దర్శించడమే జ్ఞానము. అది కలిగినవాడు భక్తుడు. ఈ జ్ఞానభక్తుడు ’ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుడు’ అనీ ’సర్వమున్నతని దివ్యకళామయమ’ని నిత్యం పరబ్రహ్మ యందే నిష్ఠుడై ఉంటాడు.

విశ్వమంతా నారాయణుడే కనుక ఆ నిష్ఠ కలిగిన వానికి భిన్నదృష్టి ఉండదు. -శత్రు మిత్ర భావాలుండవు. సర్వభూతముల ఎడ ప్రేమ ఉంటుంది.

"ద్రష్టవ్మాత్మవద్విష్ణుర్మతోయం విశ్వరూపధృక్" (విష్ణుపురాణం)

’నారాయణుడు విశ్వరూపుడు కనుక అందరినీ తనవలెనె చూడాలి’ అని పరమభాగవతుడైన ప్రహ్లాదుని వచనం ఇది భావత ధర్మం. భాగవత హృదయం. యోగముల సారం. ఈ జ్ఞానమంతా ఒక్క ’విశ్వం’ అనే నామంలో దాగిఉంది.

మొత్తంగా - నారాయణుడెవరు? అనే ప్రశ్నకు’విశ్వం’ అని సమాధానం. మన కంటికి కనిపించేదీ, కనిపించనిదీ అంతుపట్టని ఏ జగత్తు ఉందో అందులో ’ప్రవేశించి ఉన్న చైతన్యము’ దీనికి ’కారణము’ కూడా. మరి ఎలా ప్రవేశించాడు స్వామి?


విష్ణువై ప్రవేశించాడు.


 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

  1. nice article.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel.

    ReplyDelete
  2. nice devotional article
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!