🌹మన సాహితీ ప్రముఖులు (10)🌹 🙏శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.🙏

🌹మన సాహితీ ప్రముఖులు (10)🌹


🙏శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.🙏


👉 నా అక్షరాలు కన్నీటి జడులలో తడిపే దయాపారావతాలు


నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు


నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు..


అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, 

భావ కవులలో అభ్యుదయ కవీ, 

అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు

దేవరకొండ బాలగంగాధర తిలక్ . 

ఇతను కవి, కథకుడు, నాటక కర్త.


సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు

అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు

చరిత్ర రక్త జలధికి స్నేహ సేతువును నిర్మిస్తున్నాను రండి..


అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్ .


పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామంలో 1921 ఆగష్టు 1 న తిలక్ జన్మించాడు.


తిలక్ ఎంత సుకుమారుడో అతని కవిత అంత నిశితమైనది . భాష ఎంత మెత్తనిదో, భావాలు అంత పదునైనవి. సంఘ వంచితుల పట్ల ఎంత కారుణ్యమో, సంఘ దురన్యాయాలపట్ల అంత క్రోధం. తిలక్‌కు తెలుగు, ఇంగ్లీషులలో చక్కని పాండిత్యం ఉంది. ప్రాచీనాధునిక పాశ్చాత్య సాహిత్యంలో చాలా భాగం అతనికి కరతలామలకం. అయినా, తెలుగు వచనం గాని, పద్యంగాని ఎంతోబాగా వ్రాసేవాడు. సుతిమెత్తని వృత్త కవితతో ప్రారంభించినా, ఆధునిక జీవితాన్ని అభివర్ణించడానికి వృత్త పరిధి చాలక వచన గేయాన్ని ఎన్నుకున్నాడు. అది అతని చేతిలో ఒకానొక ప్రత్యేకతను, నైశిత్యాన్ని సంతరించుకుంది, సౌందర్యాన్ని సేకరించుకుంది.


మన కళ్ళ ఎదుట ప్రతి నిత్యం జరిగిపోతున్న జీవిత నాటకాన్ని ప్రతిబింబించడానికి ఆయన కవితను, కథలను, నాటికా ప్రక్రియను సమానంగా ఉపయోగించుకున్నాడు. మనకు రోడ్ల మీద తారసిల్లే వ్యక్తులు- బిచ్చగాళ్ళు, అనాథలు, అశాంతులు, దగాపడ్డ తమ్ముళ్ళు, పడుపుగత్తెలు, చీకటిబజారు చక్రవర్తులు ఇంకా ఎందరెందరినో ఆయన పాత్రలుగా తీసుకుని అసలు వేషాలలో మన ముందు నిలబెట్టాడు.


మొదట దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభావంతోనూ, తరువాత శ్రీశ్రీ ప్రభావంతోనూ, కవిత్వం వ్రాసినా, వచన కవితా ప్రక్రియను తన అసమాన ప్రతిభాసంపదతో ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్లిన ప్రముఖుడు. వచన కవితలకు అప్పజెప్పే లక్షణాన్ని తెచ్చినవాడు తిలక్. భావకవిత్వంలోని భావ సౌకుమార్యం, భాషా మార్దవం, అభ్యుదయ కవిత్వలక్షణాలతో కలసి వెలసిన తిలక్ కవిత్వం, అభ్యుదయ, భావ కవిత్వాల కలనేత.


తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా ఉండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన 1966 జూలై 1 న అనారోగ్యంతో రాలిపోయాడు.


🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!