నమ్మకమే భక్తికి మూలం

నమ్మకమే భక్తికి మూలం


(దేవరహస్యం)


ఒకసారి నారద మహర్షి భూలోక సంచారం చేస్తుండగా ఇద్దరు మహా శివభక్తులను గమనించారు. అందులో ఒకరు పరమనిష్ఠాగరిష్ఠుడైన అర్చక స్వామి- నిత్యం శివపంచాక్షరి జపిస్తూ భక్తితత్వం ఉట్టిపడేలా వ్యవహరించే వాడు, మహా భక్తునిగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గాంచినవాడు. మరొకరు అతి సామాన్య కుటుంబీకుడు. వృత్తిరీత్యా గానుగ ఆడించి నూనె అమ్ముకొనే వ్యాపారి. ఆయన కూడ సదా శివపంచాక్షరి జపిస్తూ, తన వృత్తి ధర్మాన్ని నిర్వహించుకునేవాడు. ఈ ఇద్దరిలో ఎవరు మంచి భక్తులనే అనుమానం నారద మహర్షికి కలిగింది. కైలాసం వెళ్లినప్పుడు పరమశివునితో ఈ విషయం ప్రస్తావించారు. ఆ ఇద్దరిలో ఎవరికి కైలాస ప్రవేశార్హత ఉందో, ఎవరు ముందుగా శివసాన్నిధ్యం పొందగలరో సెలవియ్యమన్నారు. పరమశివుడు చిరునవ్వుతో నారదుని చెవిలో ఏదో రహస్యం చెప్పాడు.


మహర్షి భూలోకం వెళ్లినప్పుడు ముందుగా అర్చక స్వామిని కలిశా రు. ‘ ఓ నమఃశ్శివాయ’ అంటూ మహర్షికి నమస్కరించి తగు విధంగా సపర్యలు గావించాడు. ‘‘ఏమిటి మహర్షి విశేషం? పరమేశ్వరుడు ఏమి చేస్తున్నాడు? తమరు ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నామని చెప్పారుగా!’’ అని అడిగాడు. అందుకు మహర్షి క్షణం ఆగి ‘‘నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పమంటావా? పైగా ఈ విషయం దైవ రహస్యం అవుతుంది’’ అన్నారు. అంతలో అర్చకుడు ‘‘మీరు అబద్ధం చెప్పడమేమిటి స్వామీ! ఈ మాట ఎవరితో చెప్పనని మాట ఇస్తున్నాను’’ అన్నాడు. మహర్షి చిన్నగా ‘‘కారణమేమిటో తెలియదు గానీ, నేను వెళ్లేసరికి ఆయన ఒక సూదిని తీసుకొని, దాని బెజ్జం గుండా నందీశ్వరుని తోక ఎక్కించి, దానిని అటూ ఇటూ లాగుతూ చిన్నపిల్లాడిలా క్రీడిస్తున్నారు’’ అన్నారు అందుకు అర్చకుడు పకపకా నవ్వుతూ ‘‘మహర్షీ! నిజం చెబుతానని, పైగా దైవరహస్యమని మాట యిచ్చి ఇంతటి అబద్ధం చెబుతున్నారేమిటి? మీరు చెప్పిన విషయం నన్నెలా నమ్మమన్నారు?’’ అంటూ ఎదురుప్రశ్న వేశాడు. ‘‘నాయనా! ఉన్న విషయం చెప్పాను. నమ్మటం నమ్మకపోవటం నీయిష్టం’’ అంటూ మహర్షి వెళ్లిపోయారు.


ఆ తర్వాత మహర్షి రెండవ భక్తుని యింటికి వెళ్లారు. యాధృచ్ఛికంగా ఆయన కూడా అర్చకస్వాములు అడిగిన విషయాన్నే అడిగాడు. మహర్షి కూడా అదే సమాధానం చెప్పారు. అందుకాభక్తుడు ఎట్టి సందేహం వెలిబుచ్చలేదు. పైగా ఆనందభరితుడై భక్తిపారవశ్యంలో మునిగిపోయాడు. కొన్ని క్షణాల పిమ్మట తేరుకొని ‘‘మహర్షీ! పరమశివునకు సాధ్యం కానిదంటూ ఏముంది? ఆయన ఏమైనా చేయగలడు. సూది బెజ్జం నుంచి తోకను మాత్రమే కాదు పూర్తిగా నందీశ్వరుని కూడా లాగగలడు’’ అంటూ తన్మయుడైనాడు. మహర్షికి విషయం అర్థమై, సందేహం తీరిపోయింది. తన సందేహ నివృత్తి కోసం కైలాసనాథుని చెంతకు వెళ్లవలసిన అవసరం లేదనుకుంటూ.. నారాయణ మంత్రం జపిస్తూ తన మార్గాన తాను వెళ్లిపోయారు. భక్తికి అన్యన్యమైన నమ్మిక పరాకాష్ఠ అవుతుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!