విజయ విలాసము (చేమకూర వేంకటకవి): (విశ్లేషణ.. శ్రీ Satyanarayana Piska గారు .)

విజయ విలాసము (చేమకూర వేంకటకవి):

(విశ్లేషణ.. శ్రీ Satyanarayana Piska గారు .)

.

కపటయతి రూపములో ద్వారకకు వచ్చిన తమ మేనత్తకుమారుడైన అర్జునునితో చెల్లెలు సుభద్ర వివాహమును జరిపించినాడు శ్రీకృష్ణుడు. అయితే, అగ్రజుడు బలరామునికి ఈ విషయం తెలియనీయకుండా జాగ్రత్త పడినాడు. నవ వధూవరులను ఇంద్రప్రస్థపురమునకు సాగనంపినాడు. రాజభటుల వలన తమ్ముని నిర్వాకం తెలుసుకున్న అన్నగారు హలాయుధుడు ఆగ్రహోదగ్రుడైనాడు. ఆయనను శాంతింపజేయుటకు శౌరి ప్రయత్నిస్తున్న సందర్భములోని ఒక పద్యం.

"ఆ పురమర్దనుం డయిన నాతని కడ్డము దాకి నిల్వగా

నోపడు, మత్స్యయంత్రము మహోద్ధతి నేసి స్వయంవరంబునన్

ద్రౌపదిఁ గైకొనన్ జెనకు రాజకుమారుల పా టెఱుంగమే?

మూపులు మూడగున్ రిపు చమూపులఁ గన్నపు డా కిరీటికిన్!"

అర్థములు: పురమర్దనుడు = త్రిపురములను దహించివేసిన పరమేశ్వరుడు; అడ్డము దాకి = ఎదిరించి; నిల్వగానోపడు = నిలబడలేడు; మహోద్ధతిన్ = మిక్కిలి పరాక్రమముతో; ఏసి = ఛేదించి; గైకొనన్ = చేపట్టినపుడు; చెనకు = ఎదిరించిన; పాటు = గతి; మూపులు = భుజములు; రిపుచమూపులన్ = శత్రుసేనాసమూహములను; కన్నపుడు = చూసినప్పుడు; కిరీటికిన్ = విజయునికి.

భావము: "అన్నయ్యా! శాంతించండి. మన అర్జునుడు సామాన్యుడు కాడు. పూర్వము త్రిపురములను కాల్చివేసిన ఫాలాక్షుడు సైతం అతనిని ఎదుర్కొని నిలబడలేడు. నాడు పాంచాలనగరములో ద్రౌపదీస్వయంవర సందర్భంగా పార్థుడు ఎంత లాఘవముతో మత్స్యయంత్రమును భేదించినాడో మనం చూసినాము కదా! ఆరోజున ద్రౌపదిని వెంటబెట్టుకు వెళ్తున్న కిరీటిని వారించుటకు యత్నించిన రాకుమారుల దుర్దశను మీరు మరచినారా?!..... శత్రుసేనలను తిలకించినప్పుడు విజయుని శౌర్యము మరింతగా విజృంభిస్తుంది సోదరా!" అంటున్నాడు మాధవుడు.

చేమకూరకవి చమత్కారముల పెన్నిధి. అందరికీ 2 భుజములే ఉంటాయి. కాని, ఫల్గుణునికి అరివీరులను ఎదుర్కొనేటప్పుడు మూపులు మూడౌతాయట! అనగా 3 భుజములు. అతని భుజబలం మరింత పెరుగుతుంది అని అర్థం. అసలే అతడు సవ్యసాచి. అనగా, 2 చేతులతో సమానవేగముతో బాణప్రయోగం చేయగల దిట్ట. దానికితోడు మరొక భుజశక్తి కూడా కలిస్తే, ఇంక అతడిని జయించుటకు ఎవరికి సాధ్యం?1..... అంతటి వీరశిఖామణి మన సోదరికి భర్తగా లభించినందుకు మనం సంతోషించాలని అన్నగారికి సూచిస్తున్నాడు గోవిందుడు!

వేంకటకవి తన శబ్దప్రయోగనైపుణిని మరోమారు ప్రదర్శించాడు, "మూపులు, చమూపులు" అంటూ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!