తెనాలి రామకృష్ణ కవి రచించిన “పాండురంగ మాహాత్మ్యం” నుండి ఒక పద్యం.

By Ramana Balantrapu

తెనాలి రామకృష్ణ కవి రచించిన “పాండురంగ మాహాత్మ్యం” నుండి ఒక పద్యం. 

మహా భక్తుడైన పుండరీకునికి బాలకృష్ణుడు సాక్షాత్కరించాడు. భక్తుడు భగవంతుని పొగుడుతున్నాడు. 


పొదలు నీ పొక్కిటి పువ్వు కాన్పున గదా !

పెను మాయ పిల్లల బెట్టుటెల్ల

బొడము నీ మొదలి యూర్పుల నేర్పులన కదా!

చదువు సంధ్యలు గల్గి జగము మనుట

కెరలు నీ యడుగు దామరల తేనియ గదా !

పాపంపు బెనురొంపి పలుచ నగుట

పొసగు నీ తెలిచూపు పస గదా ! ఇది రాత్రి

ఇది పవలను మేర లెఱుగబడుట

భవన ఘటనకు మొదలి కంబమును బోలె

భువనములకెల్ల నీ వాదిభూతి వగుచు

నిట్టనిలుచున్కిచే గాదె నెట్టుకొనియె 

గెంటు గుంటును లేక లక్ష్మీకళత్ర!

లక్ష్మీదేవి భార్యగా (కళత్రము) కలిగిన ఓ పరమాత్మా! అందమైన (పొదలు) నీ నాభి పద్మంలో (పొక్కిలి అంటే నాభి, బొడ్డు; పొక్కిటిపువ్వు=నాభిపద్మం) జన్మించిన బ్రహ్మదేవునివల్లనే కదా పెనుమాయ - ఈ లోకాలూ, జీవరాశులూ అనే పిల్లల్ని పెట్టింది.

పొడము అంటే జన్మించు. నీ తొలి నిట్టూర్పులలో జన్మించిన వేదముల నేర్పులవల్లనే కదా ప్రపంచానికి చదువు సంధ్యలు అబ్బింది. వేదాలను పరమాత్ముని నిఃశ్వాసాలుగా వర్ణించడం జరింది. వేదాలే చదువులు. అవే సంధ్యావందన మంత్రాదికం. అంచేత చమత్కారంగా వేదాలను చదువు సంధ్యలు అన్నాడు కవి. 

కెరలు అంటే అతిశయించు. అందం అతిశయించే నీ పాదపద్మాలనుంచి స్రవిస్తున్న తేనెవల్లనే కదా పాపము అనే రొంపి పలుచనై కడిగివేయబడుతోంది. గంగానది పాపహారిణి. అది విష్ణుపాదాలనుంచి పుట్టింది అంటారు. విష్ణుపాదోద్భవ. ఆ నదిని స్ఫురింపజేస్తోంది తేనియ అనే పదం. 

స్వామీ! నీ తేట తెల్లమైన దృష్టి (తెలిచూపు) ప్రభావం వల్లనే కదా - ఇది రాత్రి, ఇది పగలు అనే విభాగం (మేరలు) ఏర్పడుతోంది. సూర్యచంద్రులు శ్రీమన్నారాయణుని రెండు నేత్రాలు అని పురాణవర్ణన. 

గృహనిర్మాణానికి మూలస్తంభంలాగా (మొదలి కంభమువోలె) ఈ భువనాలకన్నీటికీ నువ్వే ఆదికారణానివి (ఆది భూతివి). అలా నువ్వు నిట్టనిలువుగా నిలబడ్డావు కాబట్టే ఈ భువనాలు అన్నీ త్రోపుడులు లేకుండా (గెంటు) కుంటువోకుండా కాలం నెట్టుకువస్తున్నాయి. ఇవి స్థిరంగా ఇన్ని వేల యుగాలు నిలవడానికి నువ్వే ఆదికారణం కదా!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!