పోతన పద్యాల గురించి కరుణశ్రీగారి పద్యములు ...

పోతన పద్యాల గురించి కరుణశ్రీగారి పద్యములు ...


అచ్చపు జుంటితేనియల, నైందవబింబ సుధారసాల, గో

ర్వెచ్చని పాలమీగడల, విచ్చిన కన్నెగులాబి మొగ్గలన్

మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధ శైలి నీ

వెచ్చట నేర్చినావు సుకవీ! సుకుమారకళా కళానిధీ!


పోతన కవితామాధుర్యాన్ని కొన్ని వస్తువులతో పోలుస్తున్నారిక్కడ. స్వఛ్చమైన జుంటితేనె, చంద్రబింబంనుండి స్రవించే అమృతరసము, గోర్వెచ్చని పాలమీగడ, అప్పుడే విచ్చుకున్న గులాబి మొగ్గలు - వీటికి అసూయ కలిగించేలా ఉంటుందట పోతన కవిత్వం. ఏదో రకంగా తాను చవిచూసిన మాధుర్యాన్ని మాటల్లో చెప్పాలన్న తాపత్రయమే కాని, నిజానికి ఆ మాధుర్యం అనుభవైకవేద్యమే కాని ఉపమానాలకి అందుతుందా! అంతటి మధుర మంజుల మోహన ముగ్ధ శైలి ఎక్కడినుండి వచ్చిందో, అని ఆశ్చర్యపోతున్నారు కూడా. అలా ఆశ్చర్యపడి ఊరుకో లేదు...


ముద్దులుగార భాగవతమున్ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము మహాకవిశేఖర! మధ్యమధ్య అ

ట్లద్దక వట్టి గంటమున నట్టిటు గీచిన తాటియాకులో

పద్దెములందు నీ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!


అని దానికొక అందమైన ఊహనికూడా జోడించారు. ఆ మాధుర్యం వెనక కారణం పంచదార అని కరుణశ్రీగారి ఊహ. అంటే అంత తియ్యగా ఉంటుంది అతని రచన అని! కరుణశ్రీ స్వయంగా ఒక కవి కాబట్టి కవితాత్మకమైన అలాంటి కల్పన చేసారు. ఒక వ్యక్తిలో కనిపించే అసాధారణ విశిష్టత గురించి ఏవో కల్పనలు చెయ్యడం మానవ సహజం కాబోలు. ముఖ్యంగా మన భారతీయులకి అది బాగా అలవాటనుకుంటాను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!