వరాహవతారం..

వరాహవతారం..

.

స్వాయంభువ మనువు పుట్టిన తరువాత తండ్రి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి, “నేనేమి చేస్తే నీకు తృప్తి కలుగుతుందో చెప్పు. అది చేసి నిన్ను పూజించుకుంటాను” అన్నాడు. “గుణవంతులైన సంతానాన్ని కని, ధర్మ పాలకుడుగా భూమండలాన్ని పరిపాలించు” అని బ్రహ్మ అన్నాడు. “నేను భూలోకంలో నివసించడానికి యిప్పుడు భూదేవి సముద్రంలో మునిగిపోయి ఉన్నాదే? మరేలా?” అని తిరిగి బ్రహ్మని వేడుకున్నాడు.

download (1)

“మొదటి ప్రళయకాల జలమంతా తాగి భూమిని స్ధాపించెను. ఆ తరువాత అక్కడ నివసించడానికి సమస్త జీవరాసులని సృష్టించెను. కాని యిప్పుడు ఆ భూమి సముద్రంలో మునిగి పాతాళానికి అంటుకున్నది. దానిని పైకెత్తడం నా తరం కాదు. నన్నూ, నిన్నూ, అందరిని చూసే ఆ నారాయణుడే ఆ పనికి సమర్ధుడు” అని నారాయణస్తోత్రం చేయ మొదలు పెట్టాడు. అప్పుడు ఆకాశంలో ఒక వేలెడు మాత్రం దేహం గల వరాహం పుట్టి మరోక్షణంలో యేనుగంత పెద్దదై దేవలోకంలోని వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. దాని తేజస్సు చూసి, తప్పకుండా యిది నారాయణమూర్తి అవతారమే అని గ్రహించి వారందరూ ఆ వరాహమూర్తిని స్తోత్రం చేయ మొదలు పెట్టారు. అప్పుడు ఆ వరాహం సముద్రంలో ప్రవేశించి తన తెల్లని కోరలతో పాతాళాని కంటుకున్న భూమిని యెత్త మొదలు పెట్టింది.

వైకుంఠానికి వెళ్తున్న హిరణ్యాక్షుడికి తోవలో నారదుడు కనపడి, వాడెక్కడికి వెళ్తున్నాడో కనుక్కుని, “అక్కడికి వెళ్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఆ విష్ణువు పాతాళ లోకంలో ఉన్నాడు” అనగానే హిరణ్యాక్షుడు పాతాళానికి మళ్లేడు. హిరణ్యాక్షుడు పాతాళం చేరగానే అక్కడ భూమిని యెత్తుతున్న వరాహమూర్తిని చూసాడు.


” నీ మాయాబలంతో మావారి నందరిని చంపేవు కదూ? నిన్ను చూసుకునే మునులందరూ గొప్పలుపోతున్నారు కదూ? ఇదిగో నా గదతో నిన్ను చంపేస్తా. దాంతో నువ్వు, నీ రక్షణలో ఉన్న వారందరూ చస్తారు” అని వరాహం మీద విరుచుకుపడ్డాడు. వరాహమూర్తి అప్పుడు గడగడవణకిపోతున్న భూదేవిని సముద్రం పైకి తెస్తుండగా, హిరణ్యాక్షుడు వెంటబడి,”ఔరౌరా, పిరికివాడిలా పరుగు తీస్తున్నావా?” అని హేళన చేస్తుంటే, కోపంతో వాడి మాటలని సహించలేక, భూదేవిని నీటిపైన ఉంచి, దాని మీద తన ఆధారశక్తిని ఉంచి, దేవతలందరూ ఆ వింత చూసి చప్పట్లు కొడ్తూంటే, ” నిన్ను చంపడానికే నేను వరాహన్నయాను. శక్తి ఉంటే నన్ను జయించు” అని చెప్పితే, హిరణ్యాక్షుడు ఉక్రోషం చెంది, తన గదతో వారిని కొట్టబోయాడు. దానిని తేలికగా తప్పించుకుని హరి తనూ గద పట్టుకుని ఒక్కటి వేయబోయాడు. దానిని హిరణ్యాక్షుడు తప్పించుకుని తను ఓ దెబ్బ వేయబోయాడు. అలా గదలతో వారిద్దరూ చాలా సేపు పోరాడుకున్నారు.


బ్రహ్మ అక్కడకు వచ్చి, “నా వరాలతో విర్రవీగి అనేక దుష్టకార్యాలు చేసాడు. వీడితో యుద్ధం పాముతో ఆడుకున్నట్లే అపాయకరం. రాక్షసుడు కాబట్టి రాత్రి దాకా ఆ యుద్ధం పొడిగిస్తే వాడు మరీ బలవంతుడు అవుతాడు. అందుచేత నీ మాయాబలం ఉపయోగించి త్వరగా వాడి పని కానిచ్చేయి. ఆలస్య మవుతున్న కొద్దీ వీడు మాయలు పన్ని మితిమీరిపోతాడు. ఇప్పుడు మధ్యాహ్నమయింది. వాడి తండ్రి అయిన కశ్యపు డెప్పుడో చెప్పాడు, నీ చేత చస్తాడని. దానికి యిదే సమయం” అని విష్ణువుని వేడుకున్నాడు.


హరి తన గద విసరగా దానిని హిరణ్యాక్షుడు తప్పించుకుని నిరాయుధుడైన హరిని యేమి చేయకూడదని ఆగిపోయాడు. హిరణ్యాక్షుడి ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ, హరి అప్పుడు తన చక్రాన్ని తలుచుకున్నాడు. వెంటనే అది చేతికి వచ్చింది. దేవతలందరూ పైన నుంచి,”చంపేయి,చంపేయి” అని అరవడం మొదలుపెట్టారు. వారి గోల వినగానే హిరణ్యాక్షుడు మండిపడుతూ, తన గదని హరి మీదకి గట్టిగా విసిరాడు. దానిని యెడమ పాదంతో తన్ని కిందపడేసి, హరి, “ఊ తీసుకో” అని హిరణ్యాక్షుని ఉసికొల్పాడు. మళ్ళీ దాంతో కొట్టబోతే దానిని హరి యిట్టే దూరంగా తన్ని పడేసాడు. వాడప్పుడు త్రిశూల మొకటి విసిరాడు. అది వస్తుంటే హరి వదిలిన చక్రం దానిని ముక్కలు ముక్కలు చేసేసింది.


హిరణ్యాక్షుడప్పుడు మీద పడి పడికిలిపోట్లు పొడవడం ఆరంభించాడు. అవేమీ హరిని బాధపెట్టటం లేదని చూసి హిరణ్యాక్షుడు మాయమైపోయాడు.


మాయాబలంతో ఉరుములు పిడుగుల వర్షం కురిపిస్తూ విజృంభిస్తుంటే హరి చక్రాయుధం వేసాడు. దెబ్బకి తిరిగి వచ్చి రాక్షసుడు ముష్టియుద్ధం ఆరంభించాడు. అప్పుడు వరాహ స్వామి తన చేత్తో ఒక్క లెంపకాయ యిచ్చాడు. ఆ దెబ్బకి గాలి వానకి విరిగి కూలిన మానులాగ కింద పడి హిరణ్యాక్షుడు ప్రాణాలు విడిచాడు.


దేవతలు వరాహస్వామిని స్తోత్రం చేస్తూ, పుష్పవర్షం కురిపిస్తుండగా, స్వామి అంతర్ధానమయ్యాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!