మన గిరీశం.:---

మన గిరీశం.:---

.

నువ్వు "టెల్గూ" వాడివి కావూ ? " అయినవారికి ఆకుల్లో , కానివారికి కంచాల్లో" అన్న అచ్చ "టెల్గూ" సామెతను గౌరవించవూ ? ఆ నానుడికి ఆర్ధమేమిటిట !.. 

విసిరిపారేసే విస్తర్లలో అయినవారికి, కడిగి దాచుకొనే కంచాల్లో కానివారికి వడ్డించాలనే కదా ! 

మరి ఆ సామెతకు పట్టం కట్టాలన్న "సత్సంకల్పం"తోనే కదూ , మీ "కొత్త మేస్టార్లు"న్నూ .. స్కూళ్లల్లో నుంచి మనదైన తెలుగును ఆవలకు నెట్టి , మనది కాని ఇంగ్లీషును అందలమెక్కిస్తుంట !. 

జాగ్రఫీ, గీగర్ఫీ, ఆల్జీబ్రా , ఇంగ్లీషుతోపాటు తెలుగులోనూ నా వద్ద శిష్యరికం చేసిన నీకు ఇంత చిన్న విషయం అర్ధం కాకపోవడమేమిటోయ్ ! 


అసలు నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్. అటువంటిది ఎడ్యుకేషన్ లో నా దగ్గర తర్ఫీదైన నువ్వు ఇలా మాట్లాడటమేమిటి! 

"సున్నా" గొప్పదనాన్ని గుర్తించకుండా ఎంతసేపూ ఒకట్లు , పదులూ అంటూ నువ్వు అంకెల్నే పట్టుకుని వేలాడింది చాలక , నా సావాసం చేయడం చేతనే నిన్ను మీ కొత్త మేస్టార్లు పక్కన పెట్టారని అభాండం వేస్తావ్ ? 


"ది ఎలెవన్ కాజెస్ టు అడోర్ ది జీరో" విషయమై నేనిచ్చిన లెక్చర్లు వంటబట్టించుకుని జీనియస్సులైపోయిన వాళ్ళెందరో ఉన్నారే! అలాంటిది , నా ప్రియ శిష్యుడివైయుండిన్నీ నువ్వేమిటోయ్..వాటిని ఒట్టి కంఠశోషగా మిగిల్చివేసినావ్ ! 


పైపెచ్చు - తెలుగులో ఫస్ట్ మార్క్ స్కోరు చేసిన నిన్ను కాదని, ఇంగ్లీషులో "సున్నా" మార్కు వచ్చిన వారినే మీ మేస్టార్లు నెత్తినెక్కించుకుంటున్నారని ముఖం వేలాడవేస్తావ్ ! 


"వుయ్ లవ్ టెల్గూ" అంటూ తెలుగు మీద తమకున్న ప్రేమాభిమానాలను, గౌరవ ఆదరాలను ఇంగ్లీషులో వారు అంత గొప్పగా చాటుకున్న తరవాత కూడా వారిపై ఇలా నిందలు మోపడం.. మైడియర్ వెంకటేశం.. నిజంగా బార్బేరియస్ ! 

అసలు "సున్నా" మజా నీకు ఇంకా బోధపడకపోవడం చూస్తుంటే హాశ్చర్యమేస్తోంది !! . 

"సున్నా" విలువను కనిపెట్టిందే మనమైనప్పుడు - దాన్ని అందలం ఎక్కించాల్సిన బాధ్యత మనది కాదా ? 

ఆ మాటకొస్తే కొలువు తీరిన మీ కొత్త మేస్టార్లకే కాదు, ... యావన్మందికీ సున్నాయే పూజనీయం. అందుకు సవాలక్ష రుజువుల్ని చూపించి "నిజమేస్మీ!" అని నీ చేతనే ఒప్పిస్తాను చూడు. 


మందికి మంచి చేసే తెలివితేటలు, పనికొచ్చే ఆలోచనలు గట్రావంటి " అవలక్షణాలు" ఏవీ లేకుండా బుఱ్ఱంతా ఖాళీగా ఉన్న నాయకుల్నే మనం భుజాలపై మోస్తున్నామా , లేదా ? 


"నీతిమంతులెవరయ్యా" అంటూ పరీక్షిస్తే పోటాపోటీగా ఫస్ట్ క్లాసులో "సున్నా" మార్కుల్నే సంపాదించుకునే నేతాశ్రీలనే ఎన్నికల్లో గెలిపిస్తున్నాంకామా ? 


"నిజాయితీపరులెవరహో .. రారండో.. నిగ్గుదేలుస్తాం" అని పోటీపెడితే - 

పొలోమంటూ ముందుకురికి "సున్నా" మార్కుల్నే తెచ్చుకున్న ప్రజ్ఞాధురీణులకు తప్ప మరొహరికి మనం పదవుల్ని కట్టబెడుతున్నాంటోయ్ ?! 


గూండాయిజాన్ని చెలాయించకుండా ఉండటంలో "జీరో" మార్కులను సాధించిన ప్రతిభాశాలుల్నే కాదూ మనం తలపైకి ఎక్కించుకుంటున్నది ? 


అంతెందుకు.. కథ - కమామిషు , కళ - కాకరకాయ, సంగీతం -సాహిత్యం - సహజత్వం ఎట్సెట్రా చాదస్తాల జోలికిపోకుండా , అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ " సున్నా" విలువలతో తీసిన సిన్మాలనే మనం సూపర్ హిట్ చేయడం లేదూ ? 


ఇలా సున్నాలెన్నియో మిన్నులనందుకుంటుంటే - తెలుగు భాషను ఇంగ్లీషులో విపరీతంగా ప్రేమిస్తున్నట్లు ఢంకా బజాయించి మరీ చాటిన మీ కొత్త మేస్టార్లు .... ఇంగ్లీషులో " సున్నా " మార్కు తెచ్చుకున్నవారిని ముద్దు చేయడంపై నీకు కడుపుడుకెందుకంట ? 

ఆ మాటకొస్తే - "మిన్ను" అనగా పంచభూతాల్లో ఒకటైన ఆకాశం అంటే ఏమి ? శూన్యం. అనగా ఏమీలేదన్న మాట. అలాగని గణితశాస్త్రం చెబుతుంది .. కానీ - అసలు సిసలు " ఛాత్రంలో మన్ను - మిన్ను అన్నాడు కాడా? మన్ను ఉన్నప్పుడు మిన్ను ఉండదా ? " అని మా అగ్రహారంలోని వీరేశం ఏనాడో సిధ్ధాంతం చేశాడు. అందువల్ల - మన్ను వంటిదే మిన్ను కూడా !. 


"స్కై ఈజ్ ది లిమిట్ " అన్నది ఇంగ్లీషువాడి ఉవాచ. దాన్ని తర్జుమా చేస్తే " ఆకాశమే హద్దు !" ..ఆవునా .... అంటే - "సున్నాను సాధించడమే గొప్పరా చవలాయా" అన్నదే దాని అర్ధం. ఇంగ్లీషు సూక్తిని తెలుగులోకి ఇలా ఫిరాయింపజేయడంతోపాటు దాని " అంతరార్ధాన్నీ" గ్రహించి చిత్తశుధ్ధితో ఆచరణలో పెట్టడం " వుయ్ లవ్ టెల్గూ " అని ఉద్ఘాటిస్తున్న కొత్త మేస్టార్ల కర్తవ్యం కాదూ ! 


ఇంగ్లీషువాడైనా సరే , తన లాభం చూసుకోకుండా , ఎప్పుడైనా , ఎక్కడైనా , ఎవరికైనా ఇటువంటి "హితబోధ" చేసిన దాఖలాలు కలికానికైనా కనబడతాయా ? శూన్యం అంటే సున్నా కాబట్టి ఏమీ లేదని సరిపెట్టుకోవడానికి - మా ఊరి మునసబు చెప్పినట్టు - తెల్లోడేమన్నా ఎఱ్ఱోడా! 

అందుకే వాడు "సున్నా" ను కనిపెట్టిన మనకేకాక భూప్రపంచంలోని అందరికీ సున్నాలు చుట్టగలిగాడు. అందుకు కారణం వాడు సున్నా మహిమను గ్రహించడమే. ఇప్పుడు కొలువు తీరిన మీ కొత్త మేస్టార్లూ ఆ పరంపరలోని వారే. కాబట్టే వారు - ఎన్నికలప్పుడు " ఆకాశమే హద్దు" గా తాము చేసిన వాగ్దానాలే కాదు, మాతృభాషను అమలు చేయడంలోనూ "సున్నా" సాధనకే కంకణబద్ధులయ్యారు. ఆ నిజాన్ని తెలుసుకోలేక నువ్వు వారిని తప్పుపట్టడం - పామరత్వంలో పడి కొట్టుకుపోవడం కాక మరేమిటోయ్ ? 


ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. సెలవల్లో మీ ఊరొచ్చి నీ చేత పాఠాలు వల్లె వేయించడానికి నేను చెప్పిన పుస్తకాల జాబితాలోని " రాజ్యలక్ష్మీ మేడ్ డిఫికల్ట్ " బుక్ లో నుంచి వచ్చే ప్రశ్నలకు "సున్నా" మార్కులు తెచ్చుకుంటివా .. నువ్వూ విద్యాశాఖ మంత్రివైపోవచ్చు.. ఏమంటావ్ ? 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!