సంపదలో మరుపులు ఆపదలో అరుపులు....

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు........

దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు

దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు

అని దాశరధి గారు ధైర్యం తెచ్చుకుంటే

దేవుడికేం హాయిగా ఉన్నాడు

ఈ మానవుడే బాధలు పడుతున్నాడు

అంటూ శ్రీ శ్రీ గారు బాధపడతారు

దేవుడ్ని గురించిన నిరంతర చింతన సృష్ట్యాది నుండీ జరుగుతూనే ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దేవుణ్ణి గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. పాలకడలిపై శేషతల్పం మీద పడుకున్నావా దేవా అని ఒక భక్తుడు దేవుడి సౌఖ్యాన్ని చూచి పులకరించిపోతాడు. అఖిల జగతిని సృష్టి జేసి, ఆడి పాడి అంతలోనే ఈ బొమ్మలాట ఆపుతావు నటన సూత్రధారీ అని ఒక కవి చమత్కరిస్తాడు. అసలు దేవుడనే వాడు ఉన్నాడా అని మనిషికి సందేహం కలిగితే, మనుషులనే వారున్నారా అని దేవుడికే అనుమానం వచ్చిందని ఒక సందేహాల స్వామి సెలవిస్తాడు. పండితులంతా దేవుణ్ణి గురించి పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తుంటే జాన పదులు గూడా దేవుడి మీద పరిశోధనలు చేసి పద్యాలల్లారు.

పళ్ళు ఊడిన ముసలోళ్ళు మాత్రం దంతాలు పటపటా కొరుకుతున్నారు.

సి. నారాయణ రెడ్డి కూడా అట్లాంటి దేవుడి నీడలో వేదన మరచి పొమ్మంటాడు. అయితే ఆరుద్ర, ఆత్రేయ లాంటి వాళ్ళకు దేవుడు ఒక్కడే అనే భావం నచ్చలేదో ఏమో ముక్కోటి దేవతలు ఒక్క చోట కట్ట గట్టుకున్నారనీ, మనుషుల బాధలు మురిసి చూస్తుంటారనీ, ముందు జన్మల బంధాలు మూడేసి పెడుతుంటారని చెప్పారు.

దేవుడు కానరాకపోయినా ఆయనతో మనిషికి అవసరాలు కలుగుతూనే ఉన్నాయి. ఆ దేవుడెవరు ఆయన నామధేయమేమిటో అనే విషయంలో తలకాయలు కుదరక తలా ఒక దారి అయినప్పటికీ అందరూ ఆయనకు దాసోహం అంటూనే ఉన్నారు. దేవుడి గురించి ఎవర్ని అడిగినా ఏదో ఒకటి చెప్పగలిగే స్థితిలో ఉంటారు. అయితే దేవుడి నామం జపిస్తూనే దయ్యపు పట్టులోకి పోతుంటారు. ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కొన్ని నియమ నిష్టలకు లోబడి ఉండాలి. ఈ నియామాలను చేధించుకుని స్వేచ్ఛగా బరితెగించి జీవించమని ప్రబోధించేదే దయ్యం. అందువల్లనే సమాజంలో దేవుడి స్థానంలో దయ్యాన్ని కూచోబెట్టి పూజించే వాళ్ళే అధికంగా ఉంటారు. “ ప్రజలే నా దేవుళ్ళు “ అనేది ముఖ్యమంత్రి గారి ముఖ్యమయిన కొటేషన్ గా కొనసాగుతున్నది. అలాంటి (చిల్లర) దేవుళ్ళు తన వెంట ఉన్నంత కాలం అసలు దేవుడైనా తనను పదవి నుండి దించలేడని ఆయన అన్నాడు.

సంపదలో మరుపులు ఆపదలో అరుపులు అన్నట్లుగా సుఖంగా ఉన్న రోజుల్లో గుర్తురాని దేవుడు కష్టాల్లో కావలసి వస్తాడు. అసలు నన్నడిగితే కష్టాలనేవి ఉండబట్టే దేవుడు మనకు అవసరమవుతున్నాడనిపిస్తున్నది. ఈ నరకం అనేది మరణానంతరం పాపుల కోసం వేచి ఉన్న ఒక అగ్నిగుండం, దాంట్లో పడకుండా తప్పుకోవటానికే ఈ మనుషులంతా దేవుడిని ఆశ్రయిస్తున్నారు. అది పొందటానికి కావలసిందల్లా – బుద్ధిమంతుడైన చిన్న పిల్లాడిలా ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవటమే. ఎదురు తిరిగిన వాళ్ళ పరిస్థితి ముల్లు కర్రకు ఎదురు తన్నే వాళ్ళ పరిస్థితి లాగానే ఉంటుంది. ప్రజాస్వామ్య ప్రపంచంలో ప్రజలు నాయకుల్ని పదవులెక్కించగలరు గాని వారి ప్రాణాలను శాశ్వతంగా వారి బొందల్లోనే ఉంచగలరా ? ” ఆ దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడు” అనేటంత ధీమా అవివేకపూరితమయినదే!

.

.(By. Nrahamthulla)

Comments

  1. ఆపద మొక్కులు సంపద మరుపులు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!