హనుమంతునితో, రావణుని ఆగ్రహభాషణము.

కొలువుకూటమునకుబందీగా తీసుకురాబడిన హనుమంతునితో, రావణుని ఆగ్రహభాషణము.

"ఎవ్వడవోరి? నీకుఁ బ్రభు వెవ్వడు చెప్పుము! నీ విటొంటిమై

ని వ్వనరాశి దాటి యిట కే గతి వచ్చితి? నామమేమి? నీ

వెవ్వని ప్రాపునం బెఱికి తీ వనమంతయు శంక లేక? యిం

కెవ్వని పంపునం దునిమి తీ సురవైరులనెల్ల నుగ్రతన్?"

భావము: "నీవు ఎవడవురా? నీ ప్రభువు ఎవరో చెప్పు. ఇలా ఒంటరిగా సముద్రమును దాటి ఇక్కడికి ఎలా రాగలిగినావు? ఎవరి అండ చూసుకుని, ఏమాత్రం భయం లేకుండా మా అశోకవనమును ధ్వంసం చేశావు? ఎవరి అనుమతితో ఈ రాక్షసవీరులందరినీ ఈవిధంగా సంహరించావు?" అంటున్నాడు రావణుడు.

"శరనిధి దాటి వచ్చుటయ చాలక నా పురిఁ జొచ్చి, చొచ్చియున్

వెఱవక దంటవై వనము వేళ్ళకుఁ ద్రుంచితి, త్రుంచి క్రమ్మఱన్

బిరుదవు పోలె రాక్షసులఁ బెక్కురఁ జంపితి, చంపి నెమ్మదిన్

గరకరితోడ నా యెదుర గర్వముతోడుత నిల్చి తద్దిరా!"

భావము: "సాగరము దాటివచ్చినది చాలక నా లంకాపురిలోకి ప్రవేశించావు. ప్రవేశించి వెఱపులేకుండా పోటుగాడి వలె మా వనమును కూకటివేళ్ళతో కూల్చినావు. కూల్చి మొనగాడిలా అసురవీరులను ఎందరినో హతమార్చావు. హతమార్చి బెదురులేక నా యెదుట గర్వంగా నిలిచినావు. భళా!" అంటున్నాడు రావణుడు.

పద్యమును ఒకచోట ఆపి, తిరిగి ఆపిన పదముతోనే పద్యమును కొనసాగించడం పై పద్యము యొక్క పాదములలో గమనించవచ్చును. నాకు తెలిసినంతవరకు దీనిని "ముక్తపదగ్రస్తము" అంటారు.

"ఖండించెద నీ చేతులు,

తుండించెద నడుము రెండు తునుకలు గాగన్,

చెండించెదఁ గత్తులతో,

వండించెద నూనెలోన వారక నిన్నున్!"

భావము: రావణుడు క్రోధముతో ఇంకా ఇలా అంటున్నాడు. "నీ హస్తములను నరికించివేస్తాను. నీ నడుమును రెండు తునుకలుగా ఛేదింపజేస్తాను. కత్తులతో నీ శరీరమును ముక్కలుముక్కలుగా చేయించి, నూనెలో వేగించి వండింపజేస్తాను".

(రామాయణము, సుందరకాండము - మొల్ల)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!