జయ నామ ఉగాది...........By Sudha Rani

జయ నామ ఉగాది...........By Sudha Rani

భారతదేశంలో హిందువుల పండుగలన్నీ చాంద్రమానం ప్రకారమే

చేసుకుంటామని అందరికీ తెలిసినదే. చంద్రుడు పౌర్ణమినాడు ఏ నక్షత్రం దగ్గర

కనిపిస్తాడో ఆ నక్షత్రం పేరు మీద ఆ మాసం వస్తుంది. చంద్రుడు చిత్ర నక్షత్రంతో

కలిసి ఉన్న పౌర్ణమి చైత్రమాసం. చైత్రమాసంతోనే మనకు వసంతఋతువు ప్రారంభమవుతుంది.

ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ప్రారంభమవుతాయి. మోడువారిన చెట్లు చిగురు

తొడుగుతాయి. అంతవరకు ఏ కొమ్మల మాటున దాగుంటుందో 

కోయిల వసంతం ఆగమించగానే  కుహూరవాలతో

పంచమస్వరంలో స్వాగతించి  జగతిని

మురిపిస్తుంది. మావిఁచిగురుతినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి

చిగురు తొడిగేనా అని కవిగారి సందేహానికి సమాధానం ప్రకృతికే తెలుసు.

ఇంత చక్కని వసంతఋతువు లో వచ్చే తెలుగువారి తొలి పండుగ ఉగాది.

ప్రతి సంవత్సరం ఉగాదితో ప్రారంభమవుతుంది తెలుగుసంవత్సరం. అందుకే ఉగాదిని

సంవత్సరాది పండుగ అని అంటారు. ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు ఉంది. ఆ సంవత్సరం

అంతా ఆ పేరుతోనే వ్యవహరిస్తారు. మనిషి పుట్టిన మాసం ఏ సంవత్సరంలో

ఉంటే తిరిగి ఆ సంవత్సరం రావడానికి అరవై సంవత్సరాలు పడుతుంది. అలా అరవై సంవత్సరాలను

పూర్తిగా ఒక వ్యక్తి తన జీవితకాలంలో చూడడం అనేది విశేషంగా భావిస్తారు కనుకే తెలుగువారు షష్టిపూర్తి అనే

పేరుతో 60సంవత్సరాల పుట్టినరోజును ఘనంగా చేసుకోవడం కూడా ఓ సంప్రదాయంగా వస్తోంది.

ఉగాది – యుగాది

యుగాది అనే సంస్కృత పదానికి

వికృత రూపమే ఉగాది అని అంటారు. మనిషిని ప్రకృతిని కాలాన్ని సృష్టించినవాడు బ్రహ్మ.

ప్రతి కల్పాంతంలోను ఒక ప్రళయం వచ్చి ఆయుగం ముగిసి కొత్త యుగం ప్రారంభం అవుతుంది.

దీనినే బ్రహ్మ కల్పం అంటారు. బ్రహ్మకల్పం లో సృష్టి ప్రారంభమయిన రోజు - యుగాది. చైత్రమాసపు శుక్లపక్షంలో మొదటి ఋతువు వసంతఋతువులో మొదటి తిథి పాడ్యమినాడు, మొదటివారం ఆదివారం నాడు ఈ సృష్టిని ప్రారంభించాడని ఆ యుగం ప్రారంభమే

యుగాది అని నారద పురాణంలో చెప్పబడింది. కాలాన్ని, నక్షత్రాలను, గ్రహాలను,

ఋతువులను, మాసాలను ఈదినమే బ్రహ్మ సృష్టించాడట. ఉగస్య ఆదిః ఉగాది. ఉగ అంటే

నక్షత్రగమనం, జన్మ, ఆయుష్షు అని అర్థం. అందువలన 

ఉగాది అనే పదం కూడా ప్రారంభం అనే అర్థంలో 

సరిపోతుంది.

యుగము అంటే జంట అనే అర్థం

కూడా ఉంది. భూ భ్రమణంలో ఏర్పడే ఉత్తరాయనం, దక్షణాయనం కలిపి యుగం అంటే సంవత్సరం

అయితే దానికి ప్రారంభమైన రోజు యుగాది అని కూడా అర్థం చెప్పుకోవచ్చు.  చైత్రశుద్ధ పాడ్యమినాడు ఉగాది పండుగ జరుపుకోవడం

అనేది అనాదిగా భారతదేశంలో కనిపిస్తున్న ఆచారం.

ఉగాది పండుగ వసంతశోభలను తనతో తీసుకువస్తుంది. కొత్త ఆశయాలతో,

ఆశలతో కొత్త సంవత్సరం గతసంవత్సరం కన్నా మేలుగా, శుభదాయకంగా ఉండాలని ప్రజలంతా ఈ

పండుగని స్వాగతిస్తారు.

ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. భారతీయ

ధర్మాచరణకు ప్రామాణికమైన ధర్మ, నిర్ణయ సింధువులలో  ఉగాది పండుగ గురించి వివరించాయి.  ఉగాది పండుగనాడు చేయవలసిన పంచకృత్యాలు – తైలంభ్యంగనం,

నూతన సంవత్సరాదిస్తోత్రం, నింబకుసుమ భక్షణం, ధ్వజారోహణం(పూర్ణకుంభ దానం), పంచాంగ

శ్రవణం.

నింబకుసుమ భక్షణం

ఇళ్ళను శుభ్రం చేసుకోవడం, ముగ్గులతో అలంకరించడం, మామిడాకుల

తోరణాలు కట్టడం, చక్కగా నూనెరాసుకుని, నలుగుపెట్టుకుని అభ్యంగనస్నానం చేయడం, కొత్త

బట్టలు ధరించి దేవాలయంలో ఆరాధన చేయడం,పిండివంటలు తయారుచేసుకుని బంధుమిత్రులతో

ఆరగించడం - తెలుగువారి అన్ని  పండుగలలోను ఉన్న విశేషాలే. కానీ ఉగాది పండుగకి

మాత్రమే ప్రత్యేకమైనది నింబకుసుమ భక్షణం. నింబకుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడి

తినడం. దీనినే అశోక కళికా ప్రాశనం అని కూడా అంటారు.

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం.

 నింబ అంటే వేప అని అర్ధం. వేపచిగుళ్లు తినడం వల్ల శతాయుష్షు, వజ్రసమానమైనదేహం, ఆరోగ్యం వల్ల

సర్వసంపదలు లభిస్తాయి. ఉగాది నాడు ముందుగా నింబ కుసుమాలు అంటే వేపపూతతో చేసిన

ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాతే ఏ పనయినా చేయాలి. ఉగాది పచ్చడి

షడ్రుచుల సమ్మేళనం తీపి పులుపు, ఉప్పు, కారం,వగరు,చేదుపదార్థాలు కలిసిన ఉగాది

పచ్చడి మానవజీవితంలో అనుభవానికి వచ్చే అంశాలకు ప్రతీకలు. కొత్త చింతపండు, లేత

మామిడిచిగుళ్లు, అశోకవృక్షం చిగుళ్ళు, చెరుకుముక్కలు, జీలకర్ర,కొత్త బెల్లం,

వేపపూత, మిరియాలు,లేదా మిరపకాయలు కలిపి చేసిన పచ్చడినే ఉగాది పచ్చడి అంటాము.

ఋతువులలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి, వాత కఫ పిత్త దోషాలను పోగొట్టుకోవడానికి  ఈ పచ్చడి ఎంతో మంచిది అని ఆయుర్వేదశాస్త్రం

పేర్కొంటుంది. ఖాళీ కడుపుతో ఈ పచ్చడిని ఉగాదిరోజుతో ప్రారంభించి నవరాత్రులు

పూర్తయ్యేవరకు అంటే శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ, లేదా పక్షంరోజులు  తీసుకుంటే సంవత్సరం అంతా ఆరోగ్యంగా గడపవచ్చునట.

త్వామష్ఠశోక నరాభీష్ట

మధుమాస సముద్భవ

నిబామి శోక సంతప్తాం

మమశోకం సదా కురు – అనే మంత్రం చదువుతూ ఈ ఉగాదిపచ్చడిని భుజించాలి. 

ఉగాదిపచ్చడిలో వేసే పదార్థాలను గమనిస్తే మనిషికి ప్రకృతిని

సంరక్షించుకోవలసిన అవసరం ఎంతగా ఉందో తెలుస్తుంది. ఆరోగ్యానికి ప్రకృతికి గల

సంబంధాన్ని వివరిస్తూ వృక్షో రక్షతి రక్షితః అనే సత్యాన్ని నిరూపిస్తుంది,

నింబకుసుమ భక్షణం అనే ఈ సంప్రదాయం. నూతనసంవత్సరాదిస్తోత్రం చేయడం అంటే ఉగాదినాడు

ప్రాతఃకాలాన లేచి శుచియైన తరువాత పూజామందిరంలో ఆసంవత్సరం పంచాంగం ఉంచి

సంవత్సరాధిదేవతను ధూపదీపారాధనలతో స్తుతించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. ఉగాది

రోజు దేవుడికి వడపప్పు, పానకం నివేదించాలి. రాబోయే వేసవికాలపు తాపాన్ని  వడపప్పు లోని పెసరపప్పు, బెల్లపు పానకం

తగ్గిస్తాయి కనుక శ్రీరామనవమి వరకు వీటిని నిత్యం నివేదించి సేవించాలి. 

ధ్వజారోహణం-పూర్ణకుంభదానము

ఉగాది నాడు ధ్వజారోహణం, పూర్ణకుంభదానము జరపడం ఒక సంప్రదాయం.

ధ్వజారోహణం అంటే పట్టు వస్త్రాన్ని వెదురుగడకు కట్టి మామిడి, వేప ఆకులు, పూలదండలు

కట్టి దానికొసన కొబ్బరికాయను ఉంచిన కలశాన్ని ఉంచి ఇంటి ప్రాంగణంలో లేదా అందరూ చూసే

స్థలంలో నిలిపి ఉంచుతారు. మహారాష్ట్రీయులు పాటిస్తున్న ఈ ఆచారం ప్రస్తుతం

తెలుగువారిలో కనుమరుగైంది. ప్రస్తుతం కలశ స్థాపన, పూర్ణకుంభ దానం చేస్తున్నారు.

రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కుండని రంగులతో అలంకరించి దానిలో పంచ

పల్లవాలు వేసి, చందనం, పుష్పాక్షతలతో ఆవాహనచేసి పూజించి దానికి కొత్త వస్త్రాన్ని

కట్టి అలంకరించిన కొబ్బరికాయను ఉంచి పురోహితునికి దానం చేయడాన్ని పూర్ణకుంభదానం

అంటారు. ఇలా చేస్తే సంవత్సరం పొడుగునా లాభదాయకంగా ఉంటుందని విశ్వాసం.

పంచాంగ శ్రవణం

ఉగాదినాడు తెలుగువారి సంప్రదాయం పంచాంగ శ్రవణం. పల్లెల్లో

ప్రజలందరూ దేవాలయానికి చేరి పురోహితుడితో ఆ సంవత్సరం పొడుగునా జరగబోయే మార్పులను

గురించి చెప్పించుకుంటారు. దీనినే పంచాంగ శ్రవణం అంటారు. తిథి వార నక్షత్ర కరణ

యోగాలను కలిపి పంచాంగం అంటారు. జ్యోతిశ్శాస్త్రం ప్రకారం మనిషిజీవితంలో జరగబోయే

శుభాశుభాలకు అద్దం పడుతుంది పంచాంగం. వీటిని ముందుగా తెలుసుకోవడం కోసమే పంచాంగ

శ్రవణం చేస్తారు. శుభకార్యాలు, పితృకార్యాలు, పూజాపునస్కారాలకు అనుకూలమైన

రోజులగురించి తెలుసుకోవడానికి, ఆ సంవత్సరంలో గ్రహణాలు ఏ మాసాలలో  రాబోతున్నాయి, ఏయే కాలాలు దేనికి అనుకూలం, ఏ

రాశివారికి ఏ ఫలితాలు కలగబోతున్నాయి తెలుసుకోవడానికి  పంచాంగం ఉపయోగపడుతుంది.ఆయా రాశులవారి ఆదాయ

వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు, కందాయఫలాలను ఉగాదినాడు పంచాంగ శ్రవణంతో తెలుసుకుంటారు. ఈ పంచాంగశ్రవణంలో  తిథితో సంపదను, వారంతో

ఆయుష్షు, నక్షత్రంతో పాప ప్రక్షాళన, యోగం వలన వ్యాధి నివృత్తి

కావడం, కరణంవల్ల గంగాస్నానం చేసినంత పుణ్యఫలం కలుగజేస్తాయని

ఒక విశ్వాసం.

తెలుగు ఉగాది ప్రత్యేకతలలో పంచాంగశ్రవణంతో పాటు

కవిసమ్మేళనాలు జరుపుకోవడం కూడా ఒకటి. కొత్త సంవత్సరాన్నికవిత్వంతో ఆహ్వానిస్తారు

కవులు. ఉగాదిరోజున తమ కళలతో ప్రజలను రంజింపచేసిన కళాకారులకు సన్మానాలు జరిపి

గౌరవించడం కూడా తెలుగు జాతి సంప్రదాయం.

ఉగాది ప్రాశస్త్యం

భారతదేశ కాలమానంలో హిందూ కాలమానాన్ని శాలివాహన శకం అని

పిలుస్తారు. క్రీస్తుశకానికి, ఈ శాలివాహన శకానికి 79సంవత్సరాల తేడా ఉంటుంది.  కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తమిళ ప్రాంతాలన్నీ పాలించిన గొప్ప తెలుగు చక్రవర్తి

శాలివాహనుడు. క్రీ.శ. 79లో

శకులమీద విజయం సాధించి పైఠాన్ కి తిరిగివచ్చి ఉగాది నాడే పట్టాభిషేకం

చేసుకున్నాడని, ఆ గుర్తుగా భారత కాలమానాన్ని శాలివాహన శకంగా వ్యవహరిస్తున్నామని

చరిత్రకారులు చెప్తారు. శ్రీరాముడు రావణాసురుడిని

సంహరించి అయోధ్యకిచేరి పట్టాభిషేకం చేసుకున్న రోజు కూడా ఉగాదినాడే అని పురాణాలు

చెబుతున్నాయి. ఉగాది అంటే గొప్పసంకల్పాలకి ఆరంభం, విజయ పరంపరల సాధనకి సంరంభం.

 ఉత్తర దక్షిణ భారతావనిలో ఉగాది వేడుకలు

ఉగాది పండుగ సంవత్సరంలో వచ్చే తొలిపండుగగా తెలుగువారితో పాటు

 భారతదేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో

జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగ పేరు గుధీ పడ్వా. పడ్వా అనే పదం పాడ్యమి అనే తిథికి

మరో రూపం. గుధీ అంటే ధ్వజం లేదా జెండా. ఆకుపచ్చ, పసుపు వర్ణాలుగల జరీ అంచు

వస్త్రాన్ని ఒక వెదురు బొంగుచివర కట్టి, దానికి మామిడాకులు, ఎరుపురంగు పుష్పాలను

అలంకరించి ఒక రాగిపాత్రను దానిమీద బోర్లిస్తారు. ఈ జెండాని అందరూ చూసే మార్గంలో

వెలుపల ఉంచుతారు.  బ్రహ్మధ్వజం అని,

ఇంద్రధ్వజం అని పిలిచే ఈ గుథీని, రాముడు రావణుడిమీద సాధించిన విజయానికి, ఛత్రపతి శివాజీ

సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు. సిక్కులు “వైశాఖీ” అని, బెంగాలీయులు “పొయ్ లా బైశాఖ్” అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. పంజాబు లో నూతన

సంవత్సరాన్ని “ వైశాఖి” అనే పేరుతో పిలుస్తారు. పంటలు

ఇంటికిచేరి రైతులు తమ సంతోషాన్ని పదిమందితో పంచుకునే పండుగ. భగవంతుడికి కృతజ్ఞతలు

తెలిపే పండుగ. అస్సాంలో కొత్త సంవత్సరాన్ని 

“బోహాగ్ బిహు ”పేరుతో పిలుస్తారు. ఎంతో ఉల్లాసంతో,

ఉత్సాహంతో ఈ పండుగ జరుపుకుంటారు. రాజస్థాన్ లో “తప్నా” అనే పేరుతో చైత్రమాసంలో కొత్తసంవత్సరం వేడుక జరుపుతారు.

సింధ్ ప్రాంతంలో “చేటీ చాంద్” అనే పేరుతో చైత్రమాసం పాడ్యమినాడు

కొత్త సంవత్సరం జరుపుకుంటారు. 

భారతదేశంలో దక్షిణాదిన మళయాళ ప్రజలు విషు అని, కొంకణ, కన్నడ ప్రాంతీయులు ఉగాది

అని, తమిళులు పుత్తాండి అని కేరళ ప్రాంతంలో

ఉగాదిని విషు అనే పేరుతో జరుపుకుంటారు. ఉగాది ముందురోజే ఇంట్లోని పూజగదిని బంగారురంగుపుష్పాలు,

పళ్లు, బంగారువస్తువులు, దేవతామూర్తులతో అలంకరించి ఉంచుతారు.ఆ ఇంటి ఇల్లాలు రాత్రి

ఆ పూజగదిలోనే నిద్రించి బ్రహ్మముహూర్తకాలంలో లేచి దీపం వెలిగించి ఇంటిలోవారందరినీ

ఒక్కొక్కరికీ కళ్లు మూసి పూజగదిలోకి తీసుకువస్తుంది. బంగారు రంగు వస్తువులతో అలంకరించబడిన

విషుక్కన్ చూడడం వలన కనులే కాక మనసులు కూడా పవిత్రమవుతాయని, కొత్త సంవత్సరం ఇలా

ప్రారంభిస్తారు మళయాళీలు. తమిళులు పుత్తాండి రోజున బంగారు, వెండి వస్తువులు,

తమలపాకులు, వక్కలు, పువ్వులు, కొత్తబియ్యం, కొబ్బరికాయలు వంటి వస్తువులను

చూడడంతో  పండుగవేడుక ప్రారంభిస్తారు. బాలి, ఇండొనేషియా, మారిషస్

వంటి ఇతర దేశాలలో కూడా భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలందరూ ఉగాది వేడుకలు జరుపుకుంటారు.

ఏ పేరుతో ఎలా పిలిచినా ఉగాది ఒక కొత్త సంవత్సరానికి

ప్రారంభం. అనాదిగా మనిషికి ప్రకృతికి గొప్ప అనుబంధం ఉంది. వసంతఋతువు ఆగమనంతో ప్రకృతిలో

మార్పులు వస్తాయి. పగళ్ళు దీర్ఘం అవుతాయి. 

శిశిరంలో రాలిపోయిన ఆకుల స్థానంలో చెట్లన్నీ కొత్త చిగుళ్ళువేసి

పచ్చదనాన్ని సంతరించుకుంటాయి. ఋతువులో కలిగిన ఈ మార్పు మనిషిలో మందకొడితనాన్ని

దూరంచేసి ఉత్సాహపరుస్తుంది. ప్రకృతితో పాటే మనిషి కూడా గతకాలపు అనుభవాల గురుతుల పత్రాలను  విదిలించుకుని   కొత్త ఆశలు, ఆశయాలు, ఆకాంక్షల కొత్త  చిగురులు తొడిగి జీవితంలో గొప్ప మార్పుకు

స్వాగతం పలుకుతాడు.  ప్రకృతిలో ఆగమించే

వసంతకాలం తమ జీవితాల్లో కూడా సందడిచేయాలని,  ఆశించే వారందరికీ ఈ జయ నామసంవత్సర ఉగాది సర్వసంపదలు,

సుఖశాంతులు ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!