సర్వజ్ఞుడు (ఈశ్వరనిందాస్తుతి)

ఖండకావ్యము:తెలుగు వెలుగు

కృతికర్త:కీ.శే.కవిరత్న కొర్నెపాటి శేషగిరిరావు పంతులుగారు

ఖండిక:సర్వజ్ఞుడు (ఈశ్వరనిందాస్తుతి)


సీ.చంద్రు,గురుద్రోహి జావనీయక దెచ్చి, తలమీఱు సతిచెంత నిలిపినావు,

పుట్టిల్లు పుటమార్చి,గట్టు పట్టిన శక్తి కర్థదేహంబిచ్చియాపినావు,

అవని నెల్లనుగాల్చు హాలాహలవిషంబు పట్టి కుత్తుకలోన పెట్టినావు,

కస్సు,బుస్సనిలేచు కాలసర్పంబుల కంకణాంగదశోభ గాంచినావు,


పనులనెల్ల జెఱచు గణపయ్యనింట

పెద్దకొడుకునుగా జేసి పెట్టినావు,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో యెఱుగజాల!!!...........................1


సీ.పౌరుషంబుడివోవ పార్థునిచేబడి పాశుపతంబిచ్చి పంపినావు,

సిగ్గెగ్గులను వీడి శిరమునెక్కిన గంగ పరమపావనిజేసి వదలినావు,

ప్రియురాలితో నీకు బ్రేమ సంధించిన శ్రీకుమారుని బూదిజేసినావు,

కాళ్ళుగడిగి నీకు కన్నబిడ్డనొసంగు దక్షుని శీర్షంబు తరిగినావు,


మేలునకు కీడు, కీడుకు మేలుజేసి, 

యజ్ఞతను జాటుకొంటివీవఱసి చూడ,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో, యెఱుగజాల!!!.................2


సీ.బంగారు కొండ చేపట్టి, వ్యర్థునిరీతి పునుకబిచ్చమునకు బోయినావు,

ధనదుండు నేస్తుదై నినుగొల్చియుండగ, భూతాలచెలిమిని బూనినావు,

వెండికొండ నివాసపీఠమై నిలువక, మసనాలదిఱుగాడ మఱగినావు,

అలసతి యర్థాంగియై భజియింపగ,నీడిగదాని గాంక్షించినావు,


విలువగలవన్ని కాదని విడిచిపెట్టి,

పనికిమాలినవన్ని చేపట్టినావు,

బళిర!శంభయ్య! వెఱ్ఱి బాబయ్యవీవు,

యెట్లు సర్వజ్ఞమూర్తివో, యెఱుగజాల!!!


భద్రాద్రి రఘురాము పాదసేవదరించు రామదాసుండు గారాపుబిడ్డ,

కృతిరామునకునిచ్చి కృతకృత్యుడైనట్టి పోతన్న నీముద్దు పుత్రకుండు, 

రామసంకీర్తనారక్తి ముక్తుండైన త్యాగయ్య నీప్రియతనయుడమ్మ,

కాళహస్తీశ్వరు కరుణావిశేషంబు గన్న కన్నప్ప నీకన్నకొడుకు,


కాంచికాక్షేత్రమందు శంకరుని కరుణ

నవ్యయపదంబు గైకొన్న యసదృశుండు,

వాడు చిరుతొండనంబి నీపాపడమ్మ,

తెలియ నీకెవ్వరీడమ్మ తెలుగు తల్లి!!!............................10

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!