సాహిత్యంలో చాటువులు-

సాహిత్యంలో చాటువులు-- ‘విద్వాన్’తిరుమలపెద్దింటి.నరసింహాచార్యులు ..

.

కవులపేరు తెలియని అనేక చాటుపద్యాలు, “క్రీడాభిరామం, చాటుపద్య మణిమంజరి” వంటి గ్రంథాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపంన్నం చేసాయి.అట్టి వానిలో నుండి ఆణిముత్యాల వంటి కొన్ని చాటుపద్యాల్ని మీముందుంచుతున్నాను చదివి ఆనందించండి.

.

“ కొండనుండు నెమలి కోరిన పాలిచ్చు 

పశువు శిశువుతోడ పలుక నేర్చు 

వనిత వేదములను వల్లించుచుండును 

బ్రాహ్మణుండు కాకి పలలము దిను”

.

పై చాటు పద్యంలో ఏపాదానికి ఆపాదం భావం చూస్తే విపరీతార్థంగ ఉంటుంది. ఎలాగో చూద్దాం—మొదటిపాదం= కొండనుండే నెమలి కోరినన్ని (చాలా)పాలు ఇస్తుందిట!

రెండవపాదం= పశువు (ఆవు) శిశువుతో (చిన్న పిల్లాడితో)మాటాడుతుందిట!

మూడవ పాదం= వనిత(స్త్రీ) వేదాలు చదువునట! 

నాల్గవపాదం= బ్రాహ్మణుడు కాకి పలలము(మాంసము )

తినునట! నెమలి పాలివ్వడం,ఆవు మాటాడటం,స్త్రీ వేదాలు(పూర్వకాలం) చదవడం, బ్రాహ్మణుడు కాకి మాంసం తినడం అసహజాలు, విపరీతాలు కూడా.మరి కవి అలా ఎందుకు వ్రాసినట్లు? పై చాటుపద్యంలో ఉన్న చమత్కారం అదే! ఇప్పుడు మనం పై పద్య పాదాలలోని పదాలని క్రమం(వరుస) మార్చి చదివితే చక్కని సహజమైన భావార్థాలు ఏర్పడుతాయి. 

.

“ కొండనుండు నెమలి.

కోరిన పాలిచ్చు పశువు.

శిశువుతోడ పలుకనేర్చు వనిత.

వేదములను వల్లించుచుండు బ్రాహ్మణుండు.

.

కాకి పలలము( మాంసము) తిను. ( భావము సులభము)

చూసారా! పదాల మార్పుతో పై పద్య భావం ఎంత రసవత్తరంగా మారిందో! అందుకే చాటు సాహిత్యం చాల రసవంతమైనది. 

పై చాటువు వంటిదే ఇంకొకటి.

.

“వంగ తోటనుండు, వరిమళ్లలో నుండు,

జోన్నచేలనుండు, చోద్యముగను,

తలుపు మూలనుండు,తలమీదనుండును,

.

దీనిభావమేమి తెలియుడయ్య.”

పై చాటుపద్యాన్ని కవి పొడుపుకథ రూపంలో రచించేడు. తెలుగువారికి పొడుపు కథలు క్రొత్త కాదు. చిన్నపిల్లల తరగతి పుస్తకాలలోకూడా ఇవి కనపడతాయి. కొన్ని—“ గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చే పోయే వారికి వడ్డించు బొమ్మ” ఏమిటి? (తేలు.) “ కిటకిట తలుపులు, కిటారి తలుపులు,ఎప్పుడు మూసినా,చప్పుడు కావు.” అవి?( కనురెప్పలు) “చింపిరి చింపిరి గుడ్డలు,ముత్యాలవంటి బిడ్డలు.” (పనస పండు.) ఇట్టివి చాల,చాల ఉన్నాయి.

ఇప్పుడు పై చాటు పద్యాన్ని పరిశీలిద్దాం.

“వంగతోటలో ( వంకాయ తోటలో) ఉంటుంది,వరిమళ్ళలో ఉంటుంది, జొన్నచేలో,ఆశ్చర్యం!తలుపుమూల,తలమీద ఉంటుందిట. దానిభావం ఏమిటో తెలుసుకోమంటాడు కవి. ఏది?ఉంటుంది? అనికొచెం ఆలో చిద్దాం. తెలిసిందా? లేదుకదా? ఎక్కువ ఆలోచించ కుండా పద్యంలోని పదాలని ఆపి,ఆపి చదవండి. అదేమిటో తెలిసి పోతుంది. ఎలా అంటే ---

“ వంగ, తోటనుండు .( వంకాయలు తోటలోనే ఉంటాయి.)

వరి, మళ్ళలోనే ఉంటుంది. (వరిమళ్లు ప్రసిద్ధం కదా!)

జొన్న, చేలోనే పండుతాయి. (జొన్న చేలు అంటాం కదా!)

తలుపుకి, మూల ఉంటుంది. (తలుపుమూల అని వాడుక)

అలాగే తల,( శిరస్సు.)శరీరంలో అన్నిటికంటే మీద పైభాగంలో ఉంటుంది. ఈ విధంగా పై పద్య భావాన్ని అంటే వాటి,వాటి స్థానాల్లో అవి ఉంటాయి అనే భావాన్ని తెలుసుకోమంటాడు కవి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!