వైద్యేనాథేశ్వర జ్యోతిర్లింగం:

Brahmasri Chaganti Koteswara RAO

వైద్యేనాథేశ్వర జ్యోతిర్లింగం:

రాక్షసరాజగు రావణుడు గొప్ప అభిమాని. తన అహంకారమును ప్రకటించుకొని స్వభావము కలవాడు. ఉత్తమమగు కైలాసపర్వతమునందు భక్తిభావముతో శివుని ఆరాధించుచుండెను. కొంతకాలము ఆరాధించినప్పటికీ శివుడు ప్రత్యక్షము కాలేదు. పులస్త్యకులనందనుడగు రావణుడు సిద్ధికొరకు సారవంతమగు హిమాలయ పర్వతములకు దక్షిణదిశగా ఒక గుంతను త్రవ్వి దానిలో అగ్నిని రగుల్కొల్పెను. ఆ స్థలము వృక్షములతో దట్టమైయుండెను. దాని దగ్గరలోనే భగవంతుడగు శివుని స్థాపించి హవనమును ఆరంభించెను. గ్రీష్మఋతువునందు పంచాగ్నుల మధ్య కూర్చొనెడివాడు. వర్షఋతువునందు మైదానమున వేదికమీద నిదురించెడివాడు. శీతాకాలమునందు జలమధ్యమున నిలబడెడివాడు. ఇట్లు మూడు విధములుగా తపస్సు జరుగుచుండెను. దుష్టులకు ఆ స్వామిని ముగ్ధుని చేయుట అంత సులభము కాదు. ఆ పరమాత్మ ప్రసన్నుడు కాలేదు. అప్పుడు మహామనస్వియగు రావణుడు తన మస్తకమును ఖండించి శంకరుని పూజింపనారంభించెను. విధిపూర్వకముగా శివపూజచేసి అతడు తన ఒక్కొక్క తలను ఖండించుచూ భగవంతునికి సమర్పించుచుండెను. ఇట్లు అతడు తొమ్మిది తలలను ఖండించెను. ఇట్లు అతడు క్రమముగా తన తొమ్మిది తలలను ఖండించెను. ఒకే తల మిగిలియుండగా భక్తవత్సలుడు భగవంతుడగు శంకరుడు సంతసించి ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యెను. అతని సమస్త తలలను యధావిధిగా సమకూర్చి తనికి స్వస్థత చేకూర్చెను. అతని కోరిక ప్రకారము సాటిలేని మహోన్నత బలమును ప్రసాదించెను. రాక్షసుడగు రావణుడు భగవంతుడగు శివుని కృపాప్రసాదమును పొంది నతమస్తకుడై చేతులు జోడించి ఇట్లు పలికెను. దేవేశ్వరా! నేను మిమ్ములను లంకకు తీసుకొనిపోయెదను. మీరు నా మనోరథమును సఫలము చేయుడు."

రావణుని మాటలు విని భగవంతుడగు శంకరుడు మిగుల సంకటమునకు లోనయి ఇట్లు పలికెను. "రాక్షసరాజా! సారగర్భితమైన నా మాట వినుము. నీవు నా యీ ఉత్తమ లింగమును భక్తిభావముతో నీ గృహమునకు తీసుకొనిపొమ్ము. కానీ నీవు మధ్యలో దీనిని ఎచటనైననూ భూమిమీద ఉంచినచో, అప్పుడది అచటనే సుస్థిరమైపోవును. ఇందు సంశయము లేదు." రావణుడు దానికి అంగీకరించి శివలింగమును తనవెంట తీసుకొని వెళ్ళెను. కానీ మార్గమధ్యమున శివుని మాయతో అతనికి మూత్రవిసర్జన కోరిక కలిగెను. రావణుడు సమర్థుడైనప్పటికీ మూత్రవేగమును ఆపుకొనలేకపోయెను. అప్పుడు ఆ చుట్టుపట్లనున్న ఒక గొల్లవానిని చూచి ఆ శివలింగమును వాని చేతికి ఇచ్చి తాను తిరిగి వచ్చు వరకు క్రింద పెట్టరాదని పలికెను. ఒక ముహూర్తకాలము గడుచుచుండగా ఆ శివలింగము భారము భారమై ఆ గొల్లవానిని బాధింపసాగెను. అతడు వ్యాకులతకు లోనై ఆ లింగమును భూమిమీద ఉంచెను. వజ్రమయమగు ఆ శివలింగము అక్కడనే స్థాపితమై సుస్థిరమయ్యెను. దానిని దర్శించిన మాత్రముననే అది సకలాభీష్టముల నెరవేర్చును. సకల పాపరాశిని హరించును. ఆ శివలింగము ముల్లోకములందు వైద్యనాథేశ్వరుడను పేరుతో ప్రసిద్ధిచెందినది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!