అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము నుండి.

ఇది  నా  బ్లాగు  లో  నా  1,000 వ పోస్టింగు..

దీనిని  నా  గురువు  చిరంజీవి  భావరాజు  పద్మిని కి  అంకితం...

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము నుండి.

ఒక ఊరిలో గౌతమి అను బ్రాహ్మణ వనిత ఉండేది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. అతడు ఒక రోజు పాము కరిచి చనిపోయాడు. అది చూసి ఆమె దుఃఖించ సాగింది.

అంతలో అది చూసిన బోయవాడు ఆ కుర్రాడిని కరిచిన పామును పట్టి తెచ్చి " అమ్మా ! ఇదిగో నీ కుమారుడిని కరిచిన పామును పట్టి తెచ్చాను. దీనిని ఏమి చెయ్యమటావో చెప్పు. తలపగులకొట్టి చంపమంటావా ! లేక నిలువునా చీల్చి చంపమంటావా ! నీవు ఎలా చెప్తే అలా చేస్తాను " అన్నాడు. గౌతమి " అన్నా ! ఈ పామును విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! ఇది నీ కుమారుని చంపింది కదా! " అన్నాడు. గౌతమి " అన్నా! విధివశాత్తు ఈ ఆపద వచ్చింది. నాకుమారుడు చనిపోయాడు. అందుకు దుఃఖించడము సహజమే అయినా ! దానికి కారకులు అయిన వారిని చంపడం అధములు చేసే పని. ఉత్తములు , ధర్మపరులు ఆ పని చెయ్యరు. జరిగిన ఆపదను వెంటనే మరచి పోతారు. అన్నా ! నీవు ఆ పామును చంపినంత మాత్రాన నా కుమారుడు బ్రతుకుతాడా ! దానిని విడిచి పెట్టు " అన్నది. బోయవాడు " అమ్మా ! నీ మాటలు నాలాంటి వాడికి అర్ధము కాదు. చంపిన వాడిని చంపడమే నాకు తెలిసిన ధర్మము. కనుక ఈ పామును చంపుతాను " అని అన్నాడు. గౌతమి " అన్నా ! నీ పేరు అర్జునుకుడు. అంటే తెల్లని వాడివి, స్వచ్ఛమైన వాడివి, అమాయకుడివి నీవు ఇలా ప్రవర్తించ తగదు . అయినా నేను హింసకు ఎలా సహిస్తాను " అన్నది. బోయవాడు " అమ్మా ! నా మాట విను జనులను బాధించే వారిని చంపడమే ధర్మము దాని వలన పాపము రాదు " అన్నాడు. గౌతమి " తాను బంధించిన వాడు శత్రువైనా అతడిని చంపడము అధర్మము కదా ! " అన్నది. అమ్మా ! ఈ పామును చంపి ఈ పాటు వలన బాధించబడు వారిని రక్షించడం ధర్మము కాదా ! వృత్తాసురుడిని దేవేంద్రుడు చంపలేదా ! మహాశివుడు దక్షయజ్ఞం ధ్వంసం చేయ లేదా ! అవన్నీ ధర్మములు అయినప్పుడు. ఇది మాత్రము ఎందుకు ధర్మము కాదు. కనుక ఈ పామును చంపుటకు అంగీకరించు " అన్నాడు.

.

వీళ్ళ సంభాషణ మౌనంగా విన్న పాము బోయవానితో " అన్నా ! ఇందు నాతప్పు ఏమీ లేదు మృత్యుదేవత నన్ను ఆవహించింది. నేను ఆ బాలుడిని కరిచి చంపాను. అంతే కాని నాకు ఆ బాలుడి మీద కోపము కాని ద్వేషము కాని లేదు " అని పలికింది పాము. బోయ వాడు " మరీ మంచిది మృత్యుదేవతకు ఆయుధమైన నీన్ను చంపడం తప్పు కాదు " పామును చంపబోయాడు. పాము " అయ్యా ! కుమ్మరి వాడు కుండలు చేసే సమయంలో కుండ పగిలితే తిరిగే సారెదా కుమ్మరి వాడిదా తప్పు. అయ్యా నరులు కనపడితే నన్నే చంపుతారు కదా ! అటువంటి నాకు ఇతరులను చంపే శక్తి నాకు ఏది " అన్నది. బోయవాడు " బాగా చెప్పావు సర్పమా ! ఎదుటి వాడు బాణం వేసినప్పుడు బాణము వేసిన వాడిది తప్పా బాణాది తప్పా అని ఆలోచిస్తూ ఊరుకుంటామా ! వేగంగా వస్తున్న బాణాన్ని వేరొక బాణంతో మధ్యలోనే తుంచమా ! అందులో పాపము ఏముంది. అయినా ఎవరో చెప్పారని వచ్చి బాలుని కరిచి ప్రాణములు హరించిన నిన్నే కాదు మృత్యుదేవత చేతి ఆయుధాలైన నీలాంటి పాములన్నింటినీ చంపాలి " అన్నాడు. అందుకు పాము నవ్వి " అన్నా యజ్ఞములు, యాగములు, యజమాని ఆజ్ఞ మేరకు పురోహితులు చేయించినా యజ్ఞఫలితము యజమానికి చెందుతుంది. కనుక ఈ బాలుడిని చంపిన పాపము మృత్యుదేవతే కాని నాది కాదు " అన్నది.

.

మృత్యుదేవతవాదన..

అంతలో మృత్యుదేవత అక్కడకు వచ్చి పాముని చూసి " సర్పరాజమా ! నీవు ఏ పాపము చేయలేదు. నేను నీకు చెప్పినట్లే యముడు నాకు చెప్పాడు. నేను యముని ఆజ్ఞను పాటించినట్లే నీవు నా ఆజ్ఞను పాటించావు కనుక ఇందులో నా పాపము, నీ పాపము ఏమీ లేదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, జలము, గాలి, ఈ ప్రకృతి అన్నీ యముని చేతిలో ఉన్నాయి " అని మృత్యుదేవత పలికింది. పాము " నువ్వు చెప్పినది నేను చేస్తే అది నా తప్పు అని అంటున్నారు. నీవు పంపావని నేను చెప్పాను. ఇది యముని తప్పా, నీ తప్పా అని చెప్పడానికి నేను ఎవరిని " అని " బోయవాడితో " అన్నా ! మృత్యు దేవత మాట విన్నావు కదా ! నువ్వు నా తప్పు అంటున్నావు. ఈ తప్పు నాకు అంటగట్టడం ధర్మమా ! " అన్నది. బోయవాడు నవ్వి " నువ్వూ మృత్యువు ఇద్దరూ పాపాత్ములే నాకు మీ ఇద్దరిలో ఎవరిని చూసినా భయము లేదు " అన్నాడు. ఇంతలో యమధర్మరాజు అక్కడకు వచ్చి " మీకు కలిగిన ధర్మసందేహం తీర్చడానికి నేను వచ్చాను. అసలు ఈ బాలుడి మరణానికి కారణం ఇతడి కర్మలఫలమే కాని వేరు కాదు. నేను కాని, పాము కాని, మృత్యుదేవత కాని కాదు. మనిషి చేసుకున్న కర్మలే ఫలితంగా పుట్టుకు, మరణము, సుఖము దుఃఖము కలుగుతాయి. వాటిని ఎవరూ తప్పించుకో లేరు. ఈశ్వరుడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు కనుక ఈ కుర్రాడు ఎంతటి వాడు కనుక ఎవరిని నిందించ వలసిన అవసరము ఏముంది " అన్నాడు. అప్పుడు గౌతమి తాను చెప్పిన మాటలే యమధర్మరాజు చెప్పడం చూసి " అన్నా ! యమధర్మరాజు చెప్పినది విన్నావు కదా ! నాకు పుత్రశోకం కలగాలని ఉంది కనుక అనుభవిస్తున్నాను. ఇది వెనుక జన్మలో నేను చేసిన కర్మల ఫలితము. దీనికి ఎవరిని నిందించిన ఫలితమేమి ? కనుక ఆ పామును విడిచి పెట్టు " అన్నది. ఇందరి మాట విని బోయవాడ జ్ఞానోదయము పొంది ఆ పామును విడిచి పెట్టాడు. కనుక ధర్మనందనా ! యుద్ధంలో నీ బంధువులు మరణానికి కారణం నీవు కాదు. వారి వారి దుష్కర్మలకు కలిగిన ఫలితమే ! నీవు వారి మరణానికి దుఃఖించడం వృధా ! " అని చెప్పాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!