దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

,

మనసున మల్లెల మాలలూగెనే అంటూ మధుర రాత్రులకు కొత్త అర్థాలు చెప్పినా…ఏడ తానున్నాడో బావ అంటూ విరహ వేదనలోని వివిధ కోణాలు మనకు రుచి చూపించినా…కుశలమా నీకూ కుశలమేనా అంటూ ఆలూ మగల మధ్యన ఉండాల్సిన అనురాగం గురించి కాబోయే దంపతులకు ప్రేమతో చెప్పినా…తొందరపడి ఒక కోయిల చేత కాస్తంత ముందే కూయించినా…

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..

సడి సేయకో గాలి సడి సేయ బోకే బడలి వొడిలో రాజు పవళిoచేనే అంటూ ప్రకృతి కాంతకు ప్రణమిల్లినా.. పగలయితే దొరవేరా…రాతిరి నా రాజువిరా అంటూ రసరమ్యమైన పదాలతో రంజింప చేసినా…పాలిచ్చే గోవులకూ పసుపూ కుంకం,పనిచేసే బసవడికీ పత్రీ పుష్పం సమర్పించి తెలుగు వారి లోగిళ్ళలో అక్షరాలతో అందాల సంక్రాంతి ముగ్గులు దిద్దించినా..

అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది..

మందారంలా పూస్తే మంచిమొగుదొస్తాడని…గన్నేరంలా పూస్తే కలవాదొస్తాదని…సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా…అందాల చందమామ అతడే దిగి వొస్తాడంటూ పెళ్ళికాని తెలుగమ్మాయిల కలలకు గోరింటాకు సొగసులద్దినా…గోరింకా పెళ్లై పోతే ఏ వంకో వెళ్ళీపోతే గూడంతా గుబులై పోదా గుండెల్లో దిగులై పోదా అంటూ భగ్న ప్రేమికుల గుండెల్లో గుబులును నింపి వారి మనసుల్ని దిగులులో ముంచెత్తినా…

అసలు ఏం చేసినా ఏం రాసినా అది ఒక్క దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికే చెల్లింది…ఇంకా చెప్పాలంటే అసలు తెలుగు భాషని గానీ తెలుగు వారిని కాని ఏమన్నా చేసుకునే హక్కు ఆయనకా పరమేశ్వరుదే ఇచ్చాదేమో. .

“జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ దివ్య ధాత్రి” అంటూ తన అపారమైన దేశభక్తితో ఏకంగా భరత మాతనే పరవశింప చేసిన ఈ ధన్యజీవి తదనంతరం మన తెలుగు వారందరి కేర్ అఫ్ అడ్రెస్స్ గా మారారు…

మరి అంతటి కృష్ణ శాస్త్రి గారు తెలీని తెలుగు వారు ఎవరన్నా వున్నారంటే అది శాస్త్రి గారికి కాదు వారి సాటి తెలుగు వార మైన మనకే ఎంతో అవమానం…ఎన్నిసార్లు విన్నాఎన్ని తరాల తర్వాత విన్నాఇప్పటికీ ఎంతో కొత్తగా అనిపించే ఎన్నోఆణిముత్యాలను మన తెలుగు వారికందించిన ధన్య చరితులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు..

అటువంటి పరమ పుణ్యాత్ములైన శాస్త్రిగారు అదేమీ శాపమో గానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎనలేని విషాదాన్ని చవి చూసారు..

“నావలోతానుండి మము నట్టేట నడిపే రామచరణం…త్రోవలో కారడవిలో తోత్తోడ నడిపే రామచరణం… నావ అయితే రామచరణం…త్రోవ అయితే రామచరణం…మాకు చాలును వికుంట మందిర తోరణం శ్రీరామ చరణం..”

అంటూ మనకు తత్వ బోధన చేసిన కృష్ణ శాస్త్రి గారు కాన్సర్ తో తన మాట్లాడే శక్తిని పూర్తిగా కోల్పోయినా పెద్దగా బాధ పడలేదు గానీ తన కంటి వెలుగైన తన ముద్దుల గారాల పట్టి సీత అకాల మరణాన్నిమాత్రం జీర్ణించుకోలేక పొయారు…

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!