చూచారా మన కవిసామ్రాట్ ని?

చూచారా మన కవిసామ్రాట్ ని? కనిపించాఁడు కాబట్టి అతనితో ప్రస్తావించడానికి తెగిస్తున్నాను.
(చింతా రామ కృష్ణా రావు.)
.
ఆ. విశ్వ నాధుఁడైన పృథ్వీశు రాముని,
కల్పవృక్షమందు గాంచ చేసి,
కవి వతంసు లెన్న కమనీయ కావ్యాన
వెలుగు చుంటివయ్య విశ్వనాధ.
.
చ. భరమగు నారికేళ పరిపాక కవిత్వ సుధా పయోధిగా
గురుతరమైన రామ కథ కోరి రచించిన భాగ్యశాలివే.
స్తిరముగ కీర్తి చంద్రికలు చిందులు వేయుచు భూ నభంబులన్.
సురుచిరమై వెలుంగును. విశుద్ధ కవిత్వ ఝరీస్వరూపుఁడా!
.
ఉ. పాకము నారికేళమది బ్రహ్మయు మెచ్చు విధాన గొల్పుటన్
నీకిక సాటి లేరనుట నిక్కము. కాంచగ చిత్రముల్. స్వయం
పాకము లోన కూడ సరి వారలు గల్గిరె? యన్న యట్లు యీ
లోకులు మెచ్చుతీరున సులోచన మైనను లేక చేయుదే?
( సులోచనము=కళ్ళజోడు)
.
ఆ. మనుమరాలు నేర్వ మహనీయ మగు వంట
చేయుచుంటి వీవు చేవ చూపి.
కవులు నేర్చునట్లు కల్పవృక్షము వ్రాసి
అంద జేసి తీవు విందు చేయ..
.
నశ్యం పండిత లక్షణం.
ఉ. నశ్యము పీల్చు పండితులు. నశ్యము కాని కవిత్వ సృష్టిచే
నశ్యము పీల్చ నీకగును నాసరి పండితు లేరటంచు. నీ
వశ్యము వాణి. పల్కెడిది బంగరు పల్కయి కావ్య రూపమై
దృశ్య కవిత్వమై పఱగు. దివ్య కవిత్వ విశిష్ట తేజుఁడా!
.
విశ్వ నాథ మనకు ఎదురుగానే ఉన్నారు కదా!

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!