వేంకటేశ్వరుడు

 వేంకటేశ్వరుడు
నాకు ఒక్క విషయం అర్థం కాలేదు. పండితులను అడిగాను కాని దాటేశారు సరైన సమాధానం చెప్పలేదు. కొంచెం పెద్దలు నా సందేహాన్ని తీర్చగలరు. ఏమంటే ఆదిశంకరులు ఆశేతు హిమాచల పర్యంతం పర్యటించి అనేక మఠాలను నెలకొల్పి హైందవమతాన్ని జాగ్రుతం చేసారు. బాగుంది. చాలా బాగుంది. అయితే ఆయన కొండకోనలలో జనులు చొరరాని కీకారణ్యంగా వున్న తిరుమల గిరిపై వెలసిన వెంకన్నగారి హుండీకి లక్ష్మీ యంత్రాన్ని ధనాకర్షణ, జనాకర్షణ యంత్రాన్ని ఎందుకు స్థాపించారు తన శైవ మఠాలను వదిలేసి. ఎవరికైనా తన మఠాలపైనే దృష్టి వుంటుంది కదా. శంకర మఠాలను వదిలేసి వైష్ణవ క్షేత్రంలోనే ఎందుకు యంత్రాలను ప్రతిష్టించారు అని. శంకరులవారికి శివకేశవ బేధం లేదు అని చెప్పచ్చు. కేవలం వైష్ణవ క్షేత్రం అభివృద్ధిని కాంక్షించే చేసారంటారా....... పెద్దలెవరైన సరైన వివరణ ఇస్తే బాగుంటుంది.

VVS = ఈ ప్రశ్నలోని విషయాలు సామాన్యంగా అందరికీవచ్చే సంశయాలే. మనందరి పరిజ్ఞానం - పెద్దలు చెప్పినా, ప్రవచనాలు విన్నా, ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్న సమాచారం వెదకినా వచ్చినదే. పురాణ వాఙ్మయము చదివి ప్రమాణములతో చెప్పగలవారు చాలా తక్కువ. మన మొదటి అపోహ శంకరాచార్యుడు శైవుడు, ఆయన వైష్ణవుడు కాడు అనేది. శంకరాచార్యుని చిత్రించే విధానం శైవునిలా విబూతిధారణతో కనుపిస్తుంది. ఈ శైవ, వైష్ణవభేదాలు శంకరుల తరువాత వచ్చినవి. రామానుజ పూర్ణప్రజ్ఞ (మధ్వ) దర్శనాలనే వైష్ణవదర్శనాలంటారు.......

vvs గారి వ్రాతకు జతగా నాకు తోచిన నాలుగు మాటలు వ్రాయ సంకల్పించినాను.

నిజానికి వెం+కట అన్న ఈ రెండు శబ్దాలు సంస్కృత శబ్దములు కాదని విన్నాను. వీనికి సంస్కృత శబ్దమైన ఈశ్వర కలిపి వెంకటేశ్వర ఐనదని పండితుల మాట. ఇక నిజానిజాలకొస్తే వైష్ణవులు ఎవరైతే విష్ణువే పరబ్రహ్మ స్వరుపుడనుకోటారో వారు ఈశ్వర శబ్దము నుచ్చరించరు. అందుకే వెంకటాచల పతి
యని శ్రీనివాస యని నామంతరముల నెర్పరచుకొని పిలుచుకొంటారు .

మహా పండితులు కోట వెంకటా చలం గారు సహేతుకముగా సాదికారకముగా జగద్గురు ఆది శంకరుల కాలము బి. సి. 509--477 అని నిరుపించినారు. అట్టి ఆది శంకరులు వారు జీవించిన కాలములోనే ధనకర్షణ జనాకర్షణ యంత్రములు వేసియుంటారు . అసలా యంత్రాలు వారు వేసినారా లేదా అంటే అతి ప్రాచీనమైన ధనాకర్షణ యంత్రము స్వామి కొప్పెరను 10 లేక 15 సం.ల క్రితం పునరుద్దరించు నపుడు భూమి యడుగున దొరికింది . అంటే ఆ యంత్రముల పురాతనత్వము మీకు ఎరుకపడి వుంటుంది . శంకరులు సకల దేవతా స్తోత్రములు వ్రాసినా ప్రత్యేకించి వేంకటేశ్వరుని గూర్చి వ్రాయలేదు. కారణం ఆయన శివ కేశవ అభేది గనుక. ఆ విగ్రహమును గూర్చి యా అపర శంకరులకేరుక కనుక.
ఇక భగవద్రామానుజులు (1017–1137)
భగవద్రామానుజులవారు దాదాపు 120 సం. బ్రతికినారు.ఎన్నొ ఉత్థాన పతనాలను అనుభవించినారు. రామానుజులవారు వైష్ణవము నకు ప్రాచుర్యము సంతరింప జేయు వరకు ఆ మూర్తి వెంకటేశ్వరుని గానే ఆరాధింప బడుచుండినది . రామనుజులవారి గురువు యాదవ ప్రకాశ యతి(అద్వైతి),రామానుజుల తెలివితేటలపై మాత్సర్యము వహించుటచే కాలాంతరమున రామానుజులవారు శ్రీ యమునాచార్యుల(అలవందార్ )వారి శిష్యులై విశిష్టాద్వైతియై అద్వైతము పై ఆగ్రహమేమైనా పెంచుకొన్నారేమో వారి కాలములో వాగ్స్పర్ధ లేకాక వైష్ణవ మతాన్తరీకరణములు దేవాలయ మూల విగ్రహ నామాన్తరీకరణములు జరిగినట్లు పెద్దల వల్ల విన్నాను .

ఏది ఏమైనా వారికి పూర్వము ఆ విగ్రహాన్ని 6 నెలలు శైవాగమ విధానము గాను 6 నెలలు వైష్ణవాగమ విధానము గానూ పూజించేవారు .
వారి కాలములో చంద్రగిరి రాజులు వైష్ణవులైనందువల్ల వారి మాట పై గురుత్వము చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని శ్ర్రీనివాస విగ్రహం గా మార్చినట్లు తెలియ వచ్చుచున్నది .

ఇందుకు అనేక కారణాలున్నాయి . అవి తరువాత పోస్ట్ లో తెలియబరచుతాను. నేను విన్న చదివిన ఆధారాలపైనే ఈ మాటలు వ్రాస్తున్నాను .జిజ్ఞ్యాసువులు నన్ను తప్పుగా తలవారని తలుస్తాను.

Cheruku Ramamohanrao

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!