By Sudha Rani రామాయణంలో పిట్ట కథ-

By Sudha Rani
రామాయణంలో పిట్ట కథ-
కబంధ హస్తాలు అనే తెలుగు జాతీయాన్ని మనం తరచు వింటూ ఉంటాం కదా. ఈ పదం వెనక ఉన్న కథ ఏమిటో తెలుసా....
వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరుగల ఒక రాక్షసుడు ఉన్నాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు వారికి తటస్థ పడ్డాడు. అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. ఉదరం- అంటే కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి. అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి. అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో పెనవేసి గుప్పిట్లో బిగించాడు. భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో అతను నేలకి ఒరిగి పోయాడు. తనని గాయపరిచినది రాముడు అని తెలుసుకుని కబంధుడు ఎంతో సంతోషించాడు. అతని వికృత రూపానికి కారణం చెప్పాడు.

కబంధుడు ధనవు అనేవాడి కుమారుడు. బ్రహ్మకోసం తపస్సుచేసి దీర్ఘాయువు పొందాడు. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసరడంతో కబంధుడి తల కాళ్ళు దేహంలోకి చొచ్చుకుపోయి విచిత్రరూపంలోకి మారిపోయాడు. వధించమని ఎంత ప్రాధేయపడినా బ్రహ్మశాపం వృథా పోకూడదని ఇంద్రుడు కబంధుడిని అలాగే వదిలి వెళ్ళిపోయాడు. ఆరూపంలో అక్కడే పడి ఉండి తన సమీపానికి వచ్చిన పెద్దపెద్ద జంతువులను కూడా యోజనాల తరబడి విస్తరించి ఉన్న తన హస్తాలతో బంధించి తేలికగా ఆరగించేవాడు కబంధుడు. రాముడి చేతిలో తన శాపం పోగొట్టుకున్నాడు కబంధుడు. సీతను వెతకడంలో సుగ్రీవుడు సహాయం చేయగలడని చెప్పిఅతని చిరునామాను రాముడికి ఇచ్చిన వాడు కబంధుడు. సుగ్రీవుడు హనుమంతుడు రాముడికి ఎంత సహాయం చేసారో మనకి తెలిసిన కథే కదా.
అదీ కబంధ హస్తాల కథ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!