సరదా కబూర్లు..

 శ్రీహర్షుడు...............‘నైషధం’ .(ఇడ్డెన్లూ.)!

లేక...అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా.!


.

.


సంసృత కవి శ్రీహర్షుడు తెలుసుగా, ఆయన రాజుగారి కోరికమీద ‘నైషధం’ అనే కావ్యం రాసినాడంట. ఆ కావ్యం ఫస్టుకాపీ హర్షుడి తల్లి మామల్లదేవి చదివిందట. మహామహా పండితులకే అర్థంగానట్టు కొరకరాని కొయ్యలా ఉందా కావ్యం. ఆవిడ కూడా మంచి విదుషీమణి. ఆ కావ్యం అట్టానే రాజుకినిపించినాడంటే కొడుక్కి పేరు రాదనుకుని ‘ఒరే నాయనా, చదివేకి బాగా కష్టంగా ఉందిది, మళ్లోసారి రాయి నాయనా’ అందట.

 తల్లిమాట మీద మళ్లీ మొదట్నుంచీ మొదలుబెట్టి రెండోసారి రాసేశాడట హర్షుడు.


మొదటిదాని మీద ఆ రెండో కాపీ సుమారుగానే ఉన్నా అదీ ఓ మాదిరి కష్టంగానే ఉండటంతో ఇట్ట లాబం లేదన్జెప్పి హర్షుడికి రోజూ మినుములు తినబెట్టడానికి పూనుకుందటా మహాతల్లి. ఇడ్డెన్లూ(ఇవి అప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు, కొంత సొంత పైత్యం కలిపేస్తున్నా), గారెలూ, దిబ్బరొట్టెలూ మినప సున్నుండలూ... ఈ రకంగా ముప్పొద్దులా మినుముల వంటకాలే. 


ఆర్నెల్ల తర్వాత...

.

ఒకరోజు హర్షుడు వంటింట్లో కూర్చుని మినపరొట్టి తింటుండగా ఆయన మేనమామ వచ్చి ‘కిమశ్నాసి’(అంటే... ‘ఏం తింటున్నావోయ్’ అని కాబోలు) అని అడిగాడట.


దానికి హర్షుడు... ‘అశేష శేముషీ మోష మాష మశ్నామి మారిషా’ అని సమాధానం చెప్పాడట.

(ఇదెప్పుడో చిన్నప్పుడు మా నాన్న చెప్పిన చమక్కు. నా కోడిబుర్రకు అర్థమైనంతవరకూ... ‘నా సమస్త బుద్ధినీ తస్కరించే మినుములు(తో తయారుచేసిన రొట్టి) తింటున్నాను ఆర్యా’ అనిదీనర్థం. ఒకవేళ తప్పైతే, సరైన అర్థం పెద్దలు తాలబాసుగారో ఊకదంపుడుగారో చింతారామకృష్ణారావుగారో నేను పేర్లు మరచిన మిగతా పెద్దలో చెప్పాలి).

.


హర్షుడి సమాధానం ఆ పక్కనే రొట్లు కాలుస్తున్న మామల్లదేవి విన్నది. వినగానే ఆవిడ ముఖం చింకి చాటంత అయ్యిందట. కొడుకు తను అనుకున్న స్టాండర్డుకి వచ్చేసినాడని అర్థం చేసుకుని ‘అబ్బాయ్, ఇంక మళ్లీ మొదలెట్టు నీ నైషధం’ అందట.


భక్తులారా... ఆవిదంగా...

హర్షుడు మూడోపాలి రాసిన నైషధమే మనమిప్పుడు అందరం చెప్పుకొంటోన్న నలదమయంతుల కథ అనే అద్భుత కావ్యం. 

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!