శ్రీనాథుడి గుణనిధి కథలోని పద్యం


శ్రీ అప్పారావుగారి "కిళ్ళీ" పొడుపుకథ వలన నాకు శ్రీనాథుడి గుణనిధి కథలోని పద్యం గుర్తుకొచ్చింది.

మరిచి ధూళీ పాళి పరిచితంబులు మాణి
బంధాశ్మ లవణ పాణింధమములు
బహుళ సిద్ధార్థ జంబాల సారంబులు
పటురామఠామోద భావితములు
తింత్రిణీక రసోపదేశ దూర్థురములు
జంబీర నీరాభి చుంబితములు
హైయంగవీన ధారాభిషిక్తంబులు
లలిత కస్తుంబరూల్లంఘితములు

శాకపాక రసావళీ సౌష్టవములు
భక్ష్యభోజ్య లేహ్యంబులు పానకములు
మున్నుగాఁ గల యోగిరంబులు సమృద్ధి
వెలయగొని వచ్చె నొండొండ విధములను

మహా శివరాత్రినాడు ఒక శివభక్తుడు సిద్ధపరచిన నైవేద్యాలను వర్ణిస్తున్న పద్యమిది.
మిరియాలపొడి (మరిచిధూళి) చల్లినవి కొన్నీ, సైంధవలవణం వేసి తయారు చేసినవి కొన్నీ, ఆవపెట్టి (సిద్ధార్ధ) వండినవి కొన్నీ, ఇంగువతో (రామఠము) ఘుమఘుమలాడుతున్నవి కొన్నీ, చింతపండుపులుసుతో (తింత్రిణీక రసం) చేసినవి కొన్నీ, నిమ్మరసంతో (జంబీర నీరం) చేసినవి కొన్నీ, తాజా నేతిలో (హైయంగవీనము = నిన్నటి పాలు తోడు పెట్టగా తయారయిన పెఱుగుని నేడు చిలికి తీసిన వెన్నకాచిన నెయ్యి - సద్యోఘృతం), మునిగితేలుతున్నవి కొన్నీ, లేత కొత్తిమీరతో పరిమళిస్తున్నవి కొన్నీ, శాకంగా ఉన్నపుడూ పాకంగా రసంగా మారినపుడూ సౌష్ఠవం కోల్పోని (వండకముందు ముడి పదార్థంగా ఉన్న దశలోనూ అవి సౌష్ఠవంగా ఉన్నాయి) భక్ష్యాలూ (నమిలి తినవలసినవి - కరకరలాడేవి), భోజ్యాలూ (అంతగా నమలనక్కరలేనివి), లేహ్యాలూ (నాల్కకు పని చెప్పేవి), పానకాలూ (త్రాగేవి) ఈ మొదలైన వివిధ ఆహారలను సమృద్ధిగా ఒక్కటొక్కటే ఇంటినుంచి ఆలయానికి తీసుకువచ్చాడు ఆ భక్తుడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!