కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా.


నిజంగా కృష్ణుడికి సత్యభామ అంటే అంత భయమా. జగన్నాటక సూత్రధారి ముందు ఎవరి నాటకాలు మాత్రం చెల్లుతాయి చెప్పండి. ఈ విషయాన్ని మన తిక్కన వారు బాగుగా గ్రహించారు. అందుకే.... పారిజాత పుష్పం విషయంలో... శ్రీకృష్ణున్ని తన్నే దాకా వచ్చింది మన సత్యభామ. ఆ వెంటనే శ్రీకృష్ణుడి చేత ఈ పద్యం చదివించారు....

నను, భవదీయ దాసుని మనంబున నెయ్యపుఁగింకఁ బూని తా
చిన యది నాకు మన్ననయ! చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా!

"నేను నీ దాసుణ్ణి. నీవు ప్రణయకోపముతో తన్నటం కన్నా, నేను కోరుకోదగిన భాగ్యం యేముంటుంది చెప్పు? ఇదిగో గగుర్పొడిచి నా శరీరం యెలా ముళ్ళపొదలా వుందో చూడు. ఈ ముళ్ళు గుచ్చుకుంటే అమ్మయ్యో! ఇంకేమైనా వుందా! మెత్తని నీ పాదాలు గాయపడవూ! అందుకే యింతసేపటినించీ బతిమాలుకుంటున్నాను. అలకమాను" అని ఈ పద్యం అర్థం.

అంత వరకూ బాగానే ఉంది. చివర్లో అరాళ కుంతలా... అంటూ సంభోదింపజేశారు. అసలు ఇక్కడ సన్నివేశం ఏంటి.... ఈ సమయంలో... దట్టమైన కురులు కలదానా.... అని సంబోధించాల్సిన అవసరమేంటి.... అక్కడే ఉంది కిటుకంతా. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అని... కాళ్ళు అందబుచ్చుకున్న కన్నయ్య.... జుట్టు అందుకోవడానికి బయలు దేరాడు అన్నదే ఈ పద్యంలోని అంతరార్ధం. అన్నన్నా.... కన్నయ్య ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చెయ్యకపోతే.... పదియారు వేలమంది గోపికలతో... అష్టభార్యలతో వేగి ఉంటాడో కదా...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!