అమ్మా, నాన్న ఎక్కడికి....(దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం..)

అమ్మా, నాన్న ఎక్కడికి....(దేవరకొండ బాల గంగాధర తిలక్ కవిత్వం..)

అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?
అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి-
అలవోకగా, వాడి తల నిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు-
ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మర ఫిరంగులు పేలిన జాడలు....
..కాష్మీర్ సరిహద్దుల్లో పొగలమధ్య కాలూని నిల్చున్న సైనికుడు
ఆమె కళ్ళ ముందు నిలిచాడు.

ఆమె కళవళపడింది - నిట్టూర్చింది పైట సరిచేసుకుంది
అంతలో మృదు గర్వ రేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలసి పోయింది...
.. ఆమె రోజూ వస్తుంది పార్కు లోకి వార్తల కోసం
అల్లాగే తెల్లని చీర కట్టుకొని యెర్రని బొట్టు పెట్టుకుని
నల్లని వాల్జెడలో తెల్లని సన్నజాజులు తురుముకొని...
... జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది
పాకిస్తాన్ చైనా ల మధ్య మైత్రి, పామూ తోడేలూ కలసినట్టు
ఇది రెండు దేశాల మధ్య యుధ్ధమే కాదు...
ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం ఇది...
....శత్రువుల టాంకులు విమానాలు యెన్నో కూలిపోయాయి
సాహసోపేతమైన భారత సైన్య తరంగం
లాహోర్ సరిహద్దుల మీద విరుచుకు పడింది
నిర్ణిద్ర హర్యక్షమై జాతి నిలబడి గర్జించింది
.... లక్షలాది అజ్ఞాత సైనికుల కాబాలగోపాలం కృతజ్ఞతాంజలి
సమర్పించింది.

ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది
అలాగే తెల్లచీర కట్టుకుందిగాని యెర్రని బొట్టులేదు...
..ఆమె సోగ కన్నులలో వాన కురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది
ఆమె చీటికి మాటికి అదిరే పెదవిని మునిపంట నొక్కుతోంది
అక్కడ చేరిన గుంపులు "జై హింద్" అన్న నినాదం చేసారు
అమ్మా, నాన్న.... అని అడుగుతున్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని
ఆమె కూడా రుధ్ధ కంఠం తో "జై హింద్" అని మెల్లగా పలికింది
ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హాయిగా, తీయగా వినపడింది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!