ముక్కు తిమ్మన


వింజమూరి అప్పారావుగారి అనుమతితో....గంటివారు అడిగిన ప్రకారం....

నందితిమ్మన ముక్కు తిమ్మనగా ప్రసిద్ధి అయ్యాడు. దానికి ఒక కథ చెబుతారు. ఈయన నాయిక ముక్కుని వర్ణిస్తూ “నానా సూన....” అనే పద్యం చెప్పాడట.

ఈ పద్యంతో నంది తిమ్మన కాస్తా ముక్క తిమ్మన అయ్యాడు.
ఈ పద్యాన్ని రామరాజభూషణుడు కొనుక్కొని తన వసుచరిత్రములో వాడుకున్నాడనీ మరో కథ ఉంది. ఇది పూర్తిగా కట్టుకథ అని తేల్చారు. ఈ పద్యం గొప్పదే కానీ అనువాదం. కాకతీయుల కాలంనాటి విద్యానాథుడి శ్లోకం.
భృంగానవాప్తి ప్రతిపన్న ఖేదా!
కృత్యావనే గంధఫలీత పాలం
తన్నాసికా భూదనుభూత గంధా!
స్వపార్శ్య నేత్రీ కృతభృంగ సేవా !
దీన్నే కళాపూర్ణొదయ కర్త పింగళిసూరన్న "అంబుజగంధి నాసిక నిజాన్వయ శత్రువు చంపక ప్రసూనంబు గరంబు గెల్చుట మనంబున బెట్టి..." అంటూ అనువదించాడు. అనువాద పద్యానికి ఇంత హడావిడా? ఇంటిపేరు మారిపోయిందా? అసంబద్ధం అని తేల్చారు విమర్శకులు.
ఇలాంటి అర్థం వచ్చే పద్యం హర్ష నైషధంలో - తపస్సుచేసి దమయంతి పాదాల్లా మారిందని - ఉంది.

“వసుచరిత్రము”లో వసురాజు నర్మసచివుడు ఒక వీణా నాదం విన్నారు.
ఆ నాదం ఎక్కడిదో కనుగొనడానికి నర్మసచివుడు వెళతాడు. అతడు అక్కడ వీణవాయిస్తున్న నాయికని చూసి వచ్చి వసురాజుతో ఆమెని ఆపాదమస్తకం వర్ణిస్తాడు. ఇక్కడే ప్రఖ్యాతమైన ఈ ముక్కు పద్యం కనపడుతుంది.
నానా సూన వితాన వాసనల నానందించు సారంగమే
లానన్నొల్లదటంచు గంధఫలి బల్కాకన్ దపంబంది యో
షా నాసాకృతి దాల్చి సర్వ సుమనః సౌరభ్య సంవాసియై
పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్
ముక్కుని సంపెంగ తో పోలుస్తారు. ఈ పద్యం యొక్క చమత్కారం అంతా అదే.
అనేక పుష్పాల మీద వాలి మకరందాన్ని ఆస్వాదించే తేటి (తుమ్మెద) నా వద్దకు ఎందుకు రాదు? అని సంపెంగపువ్వు ఒక మండు వేసవికాలంలో (బల్ కాకన్) తపస్సు చేసింది (వేసవికాలంలో సంపెంగపూవులు పూయవు). ఆ తపస్సు ఫలితంగా స్త్రీయొక్క (యోష) ముక్కు (నాస) ఆకారాన్ని పొంది (ఆకృతిపొంది) అన్ని పువ్వుల యొక్క సౌరభ్య - సువాసనకు స్థానమై (సంవాసియై); (సంపెంగపువ్వు అనేక పుష్పాల వాసన కలిగి ఉంటుంది.) ఒకటి కాదు, రెండు తుమ్మెదల్ని తనకి (ముక్కుకి) ఇరువైపులా (ఇర్వంకలన్) నిత్యం ఉండే కంటిచూపులు (ప్రేక్షణ) అనే ఆడుతుమ్మెదల (మధుకరీ) వరుసల్ని (పుంజమ్ములన్) పూనింది.
తపస్సు చేసినంతనే దాని కోరిక తీరింది. ఆ సంపెంగ స్త్రీ యొక్క ముక్కువలె జన్మనెత్తింది. మరి దాని కోరిక ఎలా తీరింది? కంటి చూపులు అనే ఆడుతుమ్మెదల వరుసలల్ని ఇర్వంకన్ పూనెన్.
సారంగము - తేటి, తుమ్మెద. నిజానికి తేటి వేరు, తుమ్మెద వేరు. తేటి అంటే తేనెటీగ. తుమ్మెద అంటే జుంజుమ్మంటూ ఎగిరే ఒక పురుగు. కవులు ఈ రెంటినీ ఒకటే అన్నట్లు చెబుతారు. పూలమీద వాలేది ఆడతేటి గాని మగతేటి కాదు. కవులు తేటి మగవాడుగా పుష్పం స్త్రీగా వర్ణిస్తారు. కూసేది మగ కోయిలే కాని ఆడు కోయిల కాదు. కవులు ఆడుకోయిల కూసిందంటారు. ఆడవాళ్ళకి గానకోకిల బిరుదిస్తారు. శుక్లపక్షం తెల్లగా ఉంటుందనీ, కృష్ణపక్షం నల్లగా ఉంటుందనీ అంటారు. శుక్లపక్షంలో వెన్నెల రాత్రి మొదటి భాగంలో వస్తుంది. కృష్ణపక్షంలో వెన్నెల రాత్రి చివరి భాగంలో ఉంటుంది. వెన్నెల సమానంగానే ఉంటుంది. కానీ శుక్లపక్షం తెల్లనిదనీ, కృష్ణపక్షం నల్లనిదని చెప్పటం కవిసమయం. చాతకపక్షులు వెన్నెలని గ్రోలి జీవిస్తాయని అంటారు. వీటిని కవిసమయాలంటారు.
చిత్తగించవలెను.
భవదీయుడు
రమణ బాలాంత్రపు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!