శుక్ర నీతి.:-

శుక్ర  నీతి.:- 


 "నేనడిగిన మూడడుగుల నేలా నాకియ్యి – అంతేచాలు" అని పదేపదే అంటున్న వామనుని మాటలు శుక్రచార్యునికి అనుమానం కలిగించాయి. దానం చేయటానికి సంసిద్ధుడైన బలిచక్రవర్తిని ఆ ప్రయత్నం నుంచి మరలింపదలచాడు. ఎందువల్లనంటే శుక్రుడు – "రాక్షసరాజ్య నిర్మాణధుర్యుడు" వామనుడై వచ్చినవాడు విష్ణువనీ, "మూడడుగుల నేల" అనే నెపంతో బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడనీ, సమస్తమూ కోల్పోయి బలి "బడుగు పగిది" బ్రతుకవలసి వస్తుందనీ హెచ్చరించాడు. ఆత్మవినాశ హేతువైన దానాన్ని చేయకపోవటం వల్ల అసత్యదోషం ఉండదన్నాడు. చాలా ప్రమాణాలు చూపాడు. చివరకు –

 

"వారిజాక్షులందు వైవాహికములందుఁ 

బ్రాణ విత్త మాన భంగమందుఁ 

జకిత గోకులాగ్రజన్మ రక్షణమందు 

వొంకవచ్చునఘమువొందడధిప!"


        అనే నీతిని వెలయించాడు. ఇదంతా శుక్రునికి బలిపై ఉన్న వాత్సల్యం. రాక్షస గురువుగా ఆయన ధర్మం. కులాచార్యుడు శుక్రుడు చెప్తున్న హితవాక్యాలను విన్న బలి – "క్షణమాత్ర నిమీలిత లోచనుడై" ఆయనతో - "మహాత్మా! మీరు చెప్పేది యధార్థమే . ఏదడిగినా ఇస్తానని చెప్పిన నేను – ఇపుడు కాదనలేను. భూదేవి బ్రహ్మతో – ఎట్టి పాపాత్ముడినైనా భరిస్తానుగానీ, సత్యహీనునిమాత్రం భరించలేను అని చెప్పిందికదా. కర్షకునకు సారవంతమైన నేల, బలమైన విత్తనాలు ఒకేచోట దొరికినట్లు దాతకు తగిన ప్రతిగ్రహీత లభించటం కూడా మహద్భాగ్యమేకదా - ఎన్నో యజ్ఞాలు, పుణ్యకార్యాలు చేసినా దర్శనభాగ్యం ప్రసాదించని గొప్పవాడైన విష్ణువు నేడు వామనుడై నన్ను దానం చేయమని చేయిచాచి అర్థిస్తున్నాడు.


 ఎటువంటి చేయి అది – 


ఆదిన్ శ్రీసతి కొప్పుపై ,తనువుపై,నంసోత్తరీయంబుపైఁ 

బాదాబ్జంబులపైఁ గపోలతటిపైఁబాలిండ్లపై నూత్నమ 

ర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదై నా కరంబుంట మే 

ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమేకాయంబు నాపాయమే


        అంతటి ప్రశస్త హస్తం క్రిందిది కావటం, నాది పైచేయి కావటంకంటె అదృష్టమా ! 


"కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే 

వారేరీ? సిరిమూట గట్టుకొని పోవంజాలిరే ? భూమిపైఁ 

బేరైనంగలదే ?శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై 

యీరే కోర్కులు?వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా !"


        అన్న బలిచక్రవర్తి యొక్క ఆనందపారవశ్యం, ధీరోదాత్తత ఎంతటిదని చెప్పగలం? "తిరుగన్ నేరదు

 నాదుజిహ్వ, మేరువు తలక్రిందలైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమి పిండియైపోయినా ఈ దానాన్ని చేసితీరుతాను" అన్న బలిపై ఆగ్రహించిన శుక్రుడు "నాశాసనం ధిక్కరించావు కనుక త్వరలోనే పద భ్రష్టుడవౌతావు" అని శపించాడు. 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!