పతియే ప్రత్యక్ష దైవం.......

పతియే ప్రత్యక్ష దైవం.......

హనుమంత రావుgaru in Hashya vallari...

(ఆలోచన ఆవిడది::అక్షరం నాది)

###


(ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. అప్పుడే భార్య వీధివైపు నుంచి లోపలకి వచ్చింది.)

భార్య: (తెచ్చిన ప్రసాదం భర్తచేతిలో పెట్టి,కుర్చీ భర్తదగ్గరకి లాక్కుంటూ)... ఏమండీ! ఇవ్వాళ గుళ్ళో వుపన్యాసం

చెప్తూ భర్తయే ప్రత్యక్షదైవం అంటూ చెప్పారండి. ప్రత్యక్షదైవం అంటే యేమిటండీ?

భర్త: ఇన్నాళ్ళకి ఓ మంచి ప్రశ్నవేసావోయ్ తాయారూ! చెప్తా విను. ప్రత్యక్షదైవం అంటే కనిపించే దేముడని అర్థం.

నిజానికి దేముడు మనకంటికి కనపడడు కదా...అంచేత కనపడే భర్తలోనే అంటే పతిలోనే దేముణ్ణి చూడమని

దాని భావం...అర్ధమయిందా?

భార్య: బాగా అర్ధమయిందండీ..నేనూ అదే అనుకున్నానండీ...రేపు యేకాదశి

కదా? రేపట్నించి మిమ్మల్నే నేను పూర్తిగా దేముడిలా కొలుచుకుంటానండీ..

భర్త: అలాగే తాయారూ! ఇన్నాళ్ళకు నీకో మంచి బుద్ధి కలిగింది. నాకు చాలా సంతోషంగా వుంది.

* * * * * * * * *

(నేపధ్యంలో తాయారు పాడుతూ వుంటుంది...

::తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మరల పరుండేవు లేరా...)

భర్త: (ప్రవేశిస్తూ..వళ్ళంతా దులుపుకుంటూ..) ప్రొద్దున్నే సుప్రభాతం పాడేవు.. అంతదాకా బాగానే వుంది...

అభిషేకమన్నావు..యేదో మామూలు స్నానమనుకున్నా..యిలా ఈ కొబ్బరి బొండాం నీల్లేమితి...తేనె యేమిటి...పాలేమిటి...పెరుగేమిటి...యిలా ఇవన్నీ పోసాసావేంటే బాబూ..అబ్బబ్బా..

వళ్ళంతా చాలా జిడ్డు జిడ్డుగావుంది...ఆ షాంపూ సీసా యియ్యి స్నానం చేసొస్తా....చాలా చిరాకేస్తోంది.

భార్య: (లెంపలేసుకుంటూ)మహాపచారం..మహాపచారం...అభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్నానమేమిటి?

'వస్త్రార్థం అక్షితాన్ సమర్పయామి' అని అక్షింతలు వేస్తానుండండి...

భర్త: ఇదెక్కడి గొడవే బాబూ,,,అక్షింతలేస్తే ఈ జిడ్డెలా పోతుందే... అయినా యింతవరకు కాఫీ కూడా యివ్వలేదు.

భార్య: అదేమిటండీ...ఇంత చదువుకున్నారు. దేవుళ్ళు కాఫీలు, టీలూ త్రాగినట్టు ఏ పురాణాలలోనైనా చదివారా?..

తప్పు తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదు...కళ్ళు పోతాయి.

భర్త: అదేమిటీ...మరి కాఫీ కూడా యివ్వవా..అయితే నేను దేముడిగా వుండను

భార్య: ఏంటమ్మా అది? సర్లెండి..కాఫీ అటుతిరిగి త్రాగుదురుగానిలెండి్--నీరాజమంత్ర పుష్పాలు అయ్యాక.

భర్త: సర్లే...అవునూ మరి నైవేద్యమెప్పుడూ? నైవేద్యానికి యేంచేసావు.?

భార్య: ఇవ్వాళ ఏకాదశి...ఈ పూట నైవేద్యానికి యేమీ వుండదు. రాత్రి ఉప్పిడిపిండి చేసి నైవేద్యం పెట్తాను...అదే ఫలహారం.

భర్త: చంపావు తల్లీ!----సర్లే యేదో సర్దుకుంటాను...కానీ తాయారూ! ఉప్పిడిపిండిలోకి వంకాయపులుసుపచ్చడి...

ఉల్లిపాయలు బాగా దట్టించి చెయ్...బాగుంటుంది. నాక్కూడా యిష్టం.

bhaarya ; (లెంపలు వాయించుకుంటుంది..) అపచారం...అపచారం...పిదపకాలం బుద్ధులు..పిదపకాలం బుద్ధులా అని...

ఉల్లిపాయలు దేముడికి నివేదించకూడదండీ..

భర్త: నాకు నివేదించవచ్చుకదోయ్..

భార్య: మీరు ప్రత్యక్షదైవం..మీకు అస్సలు కూడదు...మహా పాపం.(నిష్క్రమణ)

*********

(భర్తని శ్రీ వేంకటేశ్వరుడిలా నిలబెట్టింది..అభయహస్తం, వరదముద్ర పెట్టించింది...ఓ పెద్దపూలమాల

( వేసినట్టు అభినయించింది.)..ఆయన సీరియస్ గా నీరస్ గా నించున్నాడు...)

భార్య: (భర్త పెదాలు తన చేతివ్రేళ్ళతో సాగదీసి) ఏంటా చికాకు..మొహానికి కాస్త నవ్వు యేడవండి...

భర్త: (సీరియస్ గా ...నవ్వాడు)

భార్య: (నివేదన చేస్తూ)..ప్రాణాయస్వాహా..అపానాయస్వాహా...

భర్త: (పళ్ళెంలో చేయిపెట్టి తినబోతాడు)

భార్య: (అతని చేతిమీద ఒకటి కొట్టి)...అలా ముట్టుకోకూడదు. మంత్రం పూర్తవ్వాలి నీరాజనం

సమర్పయామి...మంత్రపుష్పం సమర్పయామి...భక్తోపచారం సమర్పయామి...హమ్మయ్య..

భర్త: హమ్మయ్య...అయిపోయిందా...

భార్య: ఊఁ...పూజ అయింది...యిక ప్రసాదం...నీరసం వచ్చేస్తోంది. ప్రొద్దున్ననించీ కటిక వుపవాసం కదా....

భర్త: మరే మరే...పెట్టేయ్..పెట్టేయ్.ఆకలి దంచేస్తోంది. ప్రొద్దుట్నించీ పచ్చిమంచినీళ్ళైనా త్రాగలేదు

....పెట్టేయ్ త్వరగా...

భార్య: ఏమిటీ..పెట్టేదీ....

భర్త: అదేనోయ్...ఫలహారం...ఉప్పిడిపిండి చేసావుకదా...

భార్య: తప్పు..ఉప్పిడిపిండి అనకూడదు...ప్రసాదం..ప్రసాదంగా నేను పుచ్చుకుంటాను.

భర్త: మరి నాకు..

bharya: మీకు నివేదన అయిపోయింది..తాంబూలం కూడా సమర్పించేసాను. నేను ప్రసాదం తీసుకుని వచ్చి,

మీకు పవ్వళింపుసేవ చేస్తాను....రేపు సుప్రభాత సేవదాకా శుభ్రంగా పడుకుందురుగాని....

పతియే ప్రత్యక్షదైవం. (సూత్రాలు కళ్ళకందుకుంటుంది)(లోపలికి వెళ్తుంది)

భర్త: ఇదెక్కడి గొడవే తాయారూ...ఓరి దేముడోయ్....అర్జంటుగా కనికరించు.. ఓ పురాణం శాస్త్రులుగారూ...

అర్జంటుగా పురాణాలు మార్చండి...మేము ఉత్తుత్తి భర్తలమే....దేముళ్ళమీ..గీముళ్ళమీ కాము..

ప్రత్యక్ష దైవాలము అస్సలు కాము.....ఆకల్రోయ్....దేముడోయ్..


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!