సీత అగ్నిప్రవేశం....... రామాయణ కల్పవృక్షం. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ....

సీత అగ్నిప్రవేశం....... రామాయణ కల్పవృక్షం. శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ....

అగ్నిప్రవేశానికి ప్రవేశిక సుందరకాండలో జరుగిందని చెప్పవచ్చు! హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని సీత తనలో దాచుకుంటుందిట! 

ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు. సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని. అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది. ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు. రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం. మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే అన్న పరిస్థిని సూచించడానికా? ఇన్ని ఆలోచనలని రేపే కల్పన ఇది!

ఇక అసలు ఘట్టానికి వద్దాం. సీత రాముడున్న ప్రదేశానికి ఇలా వచ్చింది:

"మత్త గజ మంథరగమనంబున భీతవోలె, విరాగిణివలె, దిరస్కారభావయుతవలె, భర్త్రనురక్తవలె నడచుచు బ్రవేశించి శ్రీరామచంద్రుని కెదురుగా నిలుచుండిన."

అలా నిలుచున్న సీతని చూస్తే రామునికెలా అనిపించింది?


ఏడాది యన్నమ్ము నెఱుగదు లలితాంగి

నిద్దుర యెఱుగదు నీరజాక్షి

ముడుచుకు కూర్చున్న యొడలుగా నంసభా

గమున వంగినయట్లు కానిపించు

మొగి నిరంతం బెడతెగని యేదో భయం

బక్షుల వెనుభాగ మానరింప

నఖిలలోకాతీత మైన సర్వాంగ వి

న్యాస సౌభాగ్య సౌందర్య మొప్ప


తన్ను హరిణంబు గొని తెమ్మటన్న కాంత

సగము సగమైన మై రామచంద్రునకును

తన సమస్త కామమున కాస్థాన భూమి

కనుల యెదుటను వచ్చి సాక్షాత్కరించె.


అప్పుడు రాముని మనసులో ఏమనుకుంటున్నాడు?


ఈ యమ హేతువై వనుల నెల్ల జరించెను దా బికారిగా

నీ యమ హేతువై జలధి కెంతొ శ్రమంపడి కట్టగట్టె దా

నీ యమ హేతువై గెలుచు టెంత శ్రమంబయిపోయె లంకలో

నా యమ జూచినంత హృదయంబున బట్టగరాని కోపమై


అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ

చించె సుంత వినదు చెలువ తాను

ననుభవించె దాను ననుభవించితి మేము

నాడదింత సేయుననుచు గలదె?


ఇదంతా వాల్మీకంలోని "హృదయాంతర్గత క్రోధమే". ఆ తర్వాత విశ్వనాథలోని కవి ప్రవేశిస్తాడు. అక్కడున్న వచనం ఇది:


"ఇట్లూహించుచు" రాముండు మనసులో "నూరక" కోపంబు పెంచుకొంచుండగా"


కవి భాషాశక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో చూసారా! ఊహించుకోవడం రెండర్థాలనిస్తుంది, అలానే "ఊరక" అన్న పదం కూడా.

ఆ సీత చూసేవాళ్ళకి ఎలా ఉందిట?

"తెలియన్ రాకయ చూచు నేత్రములకున్ స్త్రీమూర్తి తానింతలో

పల నాగ్నేయ శిఖాకృతిం బొలుచు"

అగ్నిశిఖలా ఉందిట ఆవిడ!


అంతలో ఏమయింది?

"అంత బడబాగ్ని చేత సళపెళ క్రాగి కళపెళలాడు సముద్రోపరి సముద్భూత బుద్బుదధ్వనులవోని కంఠరావ మొప్ప శ్రీరామచంద్రుడిట్లనియె"

లోపల బడబాగ్ని చేత, పైన కళపెళలాడే అలలపై బుడగల చప్పుడులా ఉందిట రాముని కంఠం. ఏవిటా బడబాగ్ని అన్నది పాఠకులే ఊహించుకోవాలి.

రాముడు వాల్మీకంలోలాగానే మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకా దారుణంగా అనిపించే మరోమాట కూడా అంటాడు:


మఱియున్ నీకొక మాట చెప్పవలయున్ మారీచునిం జంపితిన్

హరిణం బయ్యది కాదు లక్ష్మణుడు యాథార్థ్యంబు వాచించె ని

ష్ఠురు లాయిద్దఱు గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క

బ్బుర మా బంగరులేడి గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?


"అప్పుడు నువ్వుకోరిన బంగారు లేడి లక్ష్మణుడు అనుమానించినట్టే రాక్షసుడు, మారీచుడు. ఆ రావణాసురుడూ మారీచుడూ ఇద్దరూ కలిపి కూడబలుక్కొని ఈ పన్నాగం పన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏవిటంటే, నువ్వు అలా బంగారులేడిని కోరుకుంటావని వాళ్ళెలా ఊహించారో కదా!" అని దీనర్థం. ఎంత మహా ఘోరమైన నింద ధ్వనిస్తోంది ఇందులో! 


అప్పుడు సీత ఏం చేసింది?

"అంత బెద్దసేపు జానకీదేవి రామచంద్రుని వంక జూచుచు నట్లే నిలుచుండి చివరకు లక్ష్మణుని గాంచి యిట్లనియె"


"నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా

కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల

చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నేనీ దరి

ద్రాకారంబున జచ్చియుం బ్రదికి యౌరా! యొక్కరీతిం దగున్"


లక్ష్మణుని కావాలంటే పెళ్ళిచేసుకో అన్న రాముడికి ఈ మాటలు కొరడాతో కొట్టినట్టు అనిపించక మానతాయా!

సీత అగ్నిప్రవేశానికి ముందు రాముణ్ణి పూర్తిగా కుంకుడుకాయ రసంపోసి మరీ తలంటేస్తుంది! ఆవిడ పెట్టే చీవాట్లు వింటే, సీతేదో అమాయకురాలు, నోరులేనిదీ, భర్త దగ్గర నోరెత్తనిదీ, దీనురాలు అనుకొనే వాళ్ళ ఆలోచనల్లో తుప్పొదిలిపోతుంది. 


నే నొక్కించుకసేపు లోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా

మీ! నీ యాజ్ఞన్ వచియింతు గొంచెము సమున్మీలద్యశోధామ! దై

వానన్ వచ్చిన దోసమంతయును నా వంకన్ నిరూపింతు, నీ

వైనన్ దైవమ వండ్రు, నీకు కృపలే దందున్ మఱట్లైనచో


దైవం వల్ల వచ్చిన దోషాన్ని నాపై పెట్టడానికి ప్రయత్నించావు. నిన్నందరూ దేవుడిలా చూస్తారు కాని, నీకు ఏమాత్రం దయా గుణం లేదు.


మచ్చిక జెట్ట యర్థముల మాటలనంటివి నన్ను నీవనన్

వచ్చును నేనునైన బడవచ్చును, బంగరులేడి జూడగా

విచ్చిన కంటితో నెడద విచ్చెను విచ్చిన గుండెలోపలన్

జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వ ఋషీంద్ర వాంఛలున్!


ఏ ఋషి భావనా మహిమ ఏర్పడ నాయెదలోన జొచ్చి నన్

గోరగ జేసె లేడి, నది కోమలనీలపయోదదేహ! నా

కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా

నేరను వచ్చు, నీ విదియు నేరవె? సర్వఋషీంద్ర హృత్స్థితా!


ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం

బు కలుగనటం జూతురు తమోహరణా! దయజూచితేని కో

రికయును నాది నీకు సురరీకృత కీర్తిరమా ఫలప్రదం

బకలుష గుప్తశౌర్య బహిరాగతి దివ్యఫలంబు రాఘవా!


నువ్వు ఊరికే అనవసరమైన చెడ్డమాటలన్నీ అన్నావు. అయినా నువ్వు నన్ననవచ్చు నేను పడవచ్చునూ. కాని అసలు విషయం చెప్తాను. బంగారులేడిని జూడగానే నా కళ్ళు చెదిరాయి నిజమే. కాని దాంతోపాటు నా గుండెకూడా చెదిరిపోయింది. చెదిరిన ఆ మనసులో సమస్త ఋషుల కోరికలు కూడా దూరాయి. నన్ను బంగారులేడిని కోరినట్లుగా చేసినది ఆ ఋషిభావనా మహిమ (దానవ సంహారమే ఆ ఋషుల కోరిక కదా). దానికి నువ్వు రాక్షస భావం అంటగడుతున్నావు. నీకామాత్రం నిజానిజాలు తెలియవా? సరే, ఒక పనివల్ల కలిగే మంచిచెడ్డలని చూసి ఆ పని సరైనదా కాదా అని నిర్ణయిస్తారు కదా. అలా చూసినా నేను కోరిన ఆ కోరిక నీకు మేలే చేసింది. నీలో దాగిన శౌర్యాన్ని అందరికీ తెలిసేలా చేసి నీకు కీర్తిని సంపాదించి పెట్టింది కదా!


ఆడది యింత సేతు ననుటన్నది యున్నదె యంచు నన్ను నూ

టాడితి, కైక కోరక మహాప్రభు నీ వని రాకలేదు, నీ

యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేద, యా

యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్


ఆడది ఎంతకైనా చేస్తుందన్నావే, నిజమే నయ్యా! నిన్నొక ఆడది కైక కోరిక కోరికపోతే అడవికి వచ్చేవాడివా, నేను (బంగారులేడిని)కోరకపోతే ఈ రాక్షసులనందరినీ సంహరించేవాడివా!


ఇలా రాముడన్న ప్రతిమాటకీ సమాధానమిస్తుంది సీత. 


ఇనవంశేందు! మనస్సు లోపల మనస్సే లేదు నీకందు! నీ

కొనరన్ నిక్కముగా మనస్సున మనస్సున్నన్ ధరాజాత నే

మనినా వెవ్వరినో వరింపుమనియా? యయ్యయ్యొ! యా వేరి పే

ర్లనినా వెవ్వరుగాని నవ్వరటవే, రామా! జగన్మోహనా!


మనసున నింత యుంచుకొని మారుతితోడన యుంగరంబు పం

చినయది గుర్తు చిత్రము, రచించిన నీయెదలోని చా టెఱుం

గనియది, యిర్వదేండ్లు నిను గాంతుని గాగను నమ్మి సంసృతిం

బొనరిచి నిన్ను నే నెఱుగబోవని నా తెలివిన్ హసించెదన్


"నీకు మనసంటూ లేదు రామా! ఇన్నాళ్ళూ నిన్ను తెలుసుకోలేని నా తెలివికి నేనే నవ్వుకుంటున్నాను" అని ఎంత సూటిగా చెప్పింది! పైగా ఎంటంటోందో చూడండి (ఇక ప్రతిపద్యానికీ వివరణ ఇవ్వడం నా వల్ల కాదు!):


నీ పొనరించుదాన నొక నీతియు నున్నది నేనెఱింగినన్

నీ పొనరింపబోవు పనినే మరణించియ యుందు దేనికై

యా పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు చంపునౌ

నీ పదిదిక్కులన్ యశమదెట్టుల దక్కును నీకు మత్పతీ!


ఆమిక్షాకృతి విచ్చిపోదు రనసూయారుంధతుల్ గాని లో

పాముద్రాసతిగాని నీ విటుల భూపాలా! మదిన్ నమ్మవే

నీ, మోహాంధ వటంచు ధూర్జటి హిమానీశైలకన్యామణిం

దా మాటాడునె? నీవు పల్కెదవుపో ధాత్రీ సతీకన్యకన్


అప్పుడరుంధతీ సతియు నంతిపురంబును నింక ద్రొక్కనం

చొప్పమి లేచిపోయె విపినోర్వికి నేనును వచ్చు టెంచుచున్

జెప్పకు మింటి కేగి యిది, సీతయు నగ్నిని జొచ్చె నేను బో

నప్పుడె యంచు జెప్పిన మహాప్రభు! దోసము మాసిపోయెడున్


ఆయా మౌనుల యిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్

ధ్యేయాకారలు వారి గేహినులు భక్తింబొల్చు న న్నీ గతిం

జేయన్ నీవును గోప మూనెదరుసూ! సేమంబు కాదద్ది నీ

వా యా మౌనులయిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్


ఆ వేళన్ వని జేరునప్పుడు ప్రసంగానీతమై చెప్పగా

సావిత్రీకథ నేను నీ మరణవాంఛాబుద్ధి నైనట్లుగా

నీ వాడన్ బ్రభు నేన చత్తునని యంటిన్ నిక్కమట్లయ్యె నీ

నీవే కారణమౌట దానికిని బండెన్ మత్తపంబంతయున్


రాముడిని అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఋషుల ఇంటికి వెళ్ళడం క్షేమం కాదని హెచ్చరిస్తోంది! ఎందుకు? తననిలా తూలనాడినందుకు మునిపత్నులందరూ రామునిపై తీవ్రంగా కోపగించుకుంటారు కాబట్టి!


నాపయి రామచంద్ర! రఘునాయక! మత్పతి! నీకు నెందుకో

కోపము వచ్చె నద్ది యిదిగో పది యల్లితి వంశగౌరవ

క్షేమముగాగ మచ్చ యని చెప్పితి వచ్చట నింత కంటె దీ

వ్రాపద యున్నదయ్య రఘువంశము నందున గోప మేటికిన్


నీకు నామీద ఎందుకో కోపం వచ్చింది. అంచేత ఎవో పది రకాలుగా నన్నన్నావు. నువ్వేదో మీ వంశగౌరవం అంటున్నావే, దానికి నువ్వనుకుంటున్నదానికంటే పెద్ద నష్టం ఇప్పుడు వాటిల్లబోతోంది! ఏవిటది?


నన్నున్ వీడి మఱీవు వేఱయిన కాంతం బొంద వప్డున్ గులో

త్సన్నంబై చను గైకకంటెను భవత్సంపాదితంబైన సమా

సన్నంబై చను పెద్దయెగ్గు రఘువంశంబందు లోకాగ్నికిన్

స్నాన్నాయంబగు నూహ లెత్తదు భవిష్యత్కాల సంసూచిగా


భరతుడొసగిన ధర ధర్మపత్ని ప్రక్క

లేక యేలెడు నర్హత లేదు నీకు

నరపతివి కాక నన్ను గొనంగవచ్చు

నుభయతోభ్రష్టతం బొందుచుంటి రామ!


ఆహా! ఎంత తిరుగులేని మాట చెప్పింది సీత యిక్కడ! రాముడు తన్ను వీడి మరొక కాంతను ఎలానూ చేపట్టడు. దానివల్ల కైక రఘువంశానికి చేసిందనుకొంటున్న కీడు కన్నా కూడా మహాపద కలుగుతుంది. భరతుడు తనకి ఒప్పచెప్పిన రాజ్యాన్ని ధర్మపత్ని లేకుండా రాముడు ఏల లేడు. అప్పుడు మరి రఘువంశ భవిష్యత్తు ఏమి కావాలి? పైగా, రాముడు తన వంశాన్ని రాజ్యాన్ని వదులుకొని ఇప్పుడు సీతని గ్రహించవచ్చు. కాని సీతని పరిత్యజించి ఆ వంశగౌరవాన్నీ, రాజ్యాన్నీ ఎటూ పొందలేడు. అప్పుడతను రెంటికీ చెడ్డ రేవడే అవుతాడు!

ఇది చెప్పిన తర్వాత, సీత మరో రహస్యం చెప్పి, అగ్నిప్రవేశానికి ఉపక్రమిస్తుంది.


అగ్నిమండుచు నున్నది యారిపోక

ముందు నే దానిలోనికి బోవవలయు

జివరి కొకమాట నీకును జెప్పవలయు

దెలియజాలరు దీనిని దేవతలును


ఇరువురము నొక్క వెలుగున

జెఱుసగమును దీని నెఱుగు శివుడొకరుండే

పురుషుడ వీ వైతివి నే

గరితనుగా నైతి బ్రాణకాంతా! మఱియున్


అచట చూచుచు నున్నట్టి యందఱకును

జెలువ యేమని చెప్పెనో తెలియలేద

చాది చూచిరి నట నుర్విజాత నచటి

యుర్విజాత యన్నట్లుగా నున్నదాని


మారుతి లక్ష్మణుండును క్షమాసుత బూర్వము చూచినట్టి వా

రా రుచిరాంగి చెప్పినది యంతయు నర్థము చేసికొన్న వా

రీ రచనంబు సర్వమును మహీయ మతీతమనస్కమై జనం

బేరును రామునందున వహింపరు తొల్త దలంచు దోసమున్


"నిర్భీకవలె, స్వాధీనపతికవలె, బురస్కారభావయుతవలె, మత్తగజ మంథర సుందర గమనంబున నగ్నికడకు నడచి యగ్ని బ్రవేశించిన"


ఈ చివరి సీత నడకని, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వర్ణించిన నడకతో (ఈ టపా మొదట్లో ఉంది) పోల్చి చూడండి. అందులో ఎంతటి వైవిధ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించారో, ఎందుకు ప్రదర్శించారో!


ఈ అగ్నిప్రవేశ ఘట్టం మనల్నీ (రాముణ్ణీ) రామాయణం చివరికంటూ వెంటాడుతునే ఉంటుంది! ఆ తర్వాత సీతని ప్రసన్నురాలిని చేసుకోడానికి నా నా తిప్పలూ పడతాడు రాముడు. ఆఖరికి రాముడు జానకిని ప్రసన్నురాలిని జేసుకొనవలసిన స్థితినుండి, సీతచేత తాను అనుగ్రహింపబడవలసిన స్థితికి వస్తాడుట! 

తిరిగి అయోధ్యకి సీతారాములు ప్రయాణమైనప్పుడు ఋష్యమూక పర్వతం కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతతో, అక్కడ ఎంతగా విరహాగ్ని తనని కాల్చివేసిందో చెప్తాడు రాముడు. అప్పుడు సీత, "నిన్నేమో అగ్ని కానిది అగ్నిలా దహించింది, నన్నేమో అగ్నే అగ్నిలా దహించకుండా పోయింది" అని ఓ పోటు పొడుస్తుంది!

ఆ తర్వాత వాళ్ళు అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, సీత అనసూయకి జరిగిన వృత్తాంతం చెప్తూ, తనని రాముడు చేసిన అవమానం కూడ చెప్పి, రాముడన్న మాటలకి "జుగుప్సావార్ధులాడెం జుమీ!" అంటుంది. దాంతో అనసూయ, రాముని వద్దకు వచ్చి చాలా కోపంగా చూసి, తర్వాత తనని తమాయించుకొని మళ్ళీ లోపలకి వెళ్ళిపోతుందిట!

భరతుడికి తను తిరిగివస్తున్నానన్న వార్త చెప్పమని హనుమంతుని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు వెళ్ళేసరికి, రాముడు గడువు పూర్తయినా రాలేదని అప్పుడే అగ్నిప్రవేశానికి సిద్ధపడతాడు భరతుడు. అప్పుడు హనుమంతుని కంటికి భరతుడు ఇలా కనిపించాడట:


ధరణిదేవికన్య దశరథసూనుండు

రామమూర్తి యనలరాశి ద్రోచె

దానికిన్ ఫలంబు తానే మహాగ్నిలో

నుఱుకుచుండె నన్న యూహ తోచి


భరతుడు రామునిలాగే ఉంటాడు కదా ఆకారంలో మరి! దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అగ్నిప్రవేశాన్ని మనకి గుర్తుచేసారు విశ్వనాథ.

అయోధ్యకి తిరిగివచ్చిన తర్వాత, అరుంధతి తమని చూడటానికి వస్తున్నప్పుడు రాముడు తెగ భయపడిపోతాడు! అనసూయ అయితే కోపంగా చూసి ఊరుకుంది, అరుంధతికి కోపం వస్తే అలా ఊరుకుంటుందన్న నమ్మకం లేదు. అంచేత ఆమెకి ఏమీ చెప్పవద్దని సీతని ప్రాధేయపడతాడు రాముడు. సీత అతనికి అభయం ఇస్తుంది!


ఇలా అగ్నిప్రవేశం గురించి కల్పవృక్షంలో చదివితే స్త్రీశక్తి, అందులోనూ సీతాదేవి మహోన్నత వ్యక్తిత్వం, మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రామాయణం "సీతాయాశ్చరితం" అన్నది మరింత బలపడుతుంది.

వడలి మందేశ్వరరావుగారు "ఇది కల్పవృక్షం" అన్న పుస్తకంలో, అగ్నిప్రవేశాన్ని గురించి చెప్తూ, ఇది సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. దీనివల్ల ఇప్పటికీ రాముని వ్యక్తిత్వాన్ని సరిగా అంచనా వెయ్యడానికి కష్టంగానే ఉంది అన్నారు. అది అక్షర సత్యం!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!