అలలా వచ్చిన దిగులే అంతాకాదు”..!

అలలా వచ్చిన దిగులే అంతాకాదు”..!

.

జీవితం మీద విరక్తి కలగకూడదు

దేనిమీదైనా విరక్తి పుట్టవచ్చేమోగానీ, జీవితం మీద విరక్తి కలగకూడదు. బతుకు తీపి అనేదే ఒక అద్భుతం. మనం అల్పం అనుకున్న క్షుద్రజీవిలో సైతం ఈ తీపి ఉంటుంది. చీమ మొదలు సార్వభౌముని వరకు సమానంగా విస్తరించినది ఈ బతుకు తీపి. జీవితానికి ఉన్న విలువ అపారం-లౌకికమైన ప్రయోజనాలతోపాటు అలౌకికమైన పరమార్థాన్ని సాధించే గొప్పతనం ` జీవితం ‘ అనే అంశంలో ఇమిడి ఉంది. జీవితాన్ని అందంగా, ఆనందంగా, సమృద్ధిగా అనుభవించడానికి కావల్సిన నైతికసూత్రాలు, నియమాలుం అభ్యాసాలు ఏర్పరచారు మన మహర్షులు. “ఆరోగ్యవంతమైన శరీరంలో మంచి మనస్సు ఉండాలి. ఈ రెండింటినీ సాధించడమే అసలైన ప్రయోజనం ” అన్నది స్పష్టమైన నిర్వచనం. అందుకే ఎప్పుడూ జీవితంపై రోత కలగకూడదు. ఈ అవగాహన లేక క్షణికోద్రేకాలకు లోనైనవాడు బతుకునే పూర్తిచేసుకోవాలనుకుంటాడు. ఈ ఆత్మహత్యా ప్రయత్నధోరణి ఉద్రేకం వల్ల, ఒత్తిడివల్ల కలుగుతుంటుంది. జీవితంలో అర్థంలేని పరుగులు పెడుతూ, `ప్రశాంతత ‘ అనే స్వాభావిక స్థితిని కోల్పోవడం చేత అవగాహన అనేది లేకుండా బతుకు సంపదని పోగుట్టుకుంటున్నాం.

హనుమంతునికి సీతజాడ తెలియక నిరాశతో తిరిగివెళ్ళడంకన్నా ఆత్మహత్య చేసుకుంటే మేలు అనుకుంటాడు. కానీ బుద్ధిమంతుడు కనుక తక్షణం ఆ బలహీనత నుంచి బయట పడ్డాడు. సక్రమంగా అలోచించాడు. “వినాశే బహవో దోషా: జీవన్ భద్రాణి పశ్యతు “.. ఇది హనుమంతుని మాట. ఈ ఒక్క వాక్యాన్ని మంత్రంలా మననం చెస్తే చాలు. నేటితరం అంతా వాళ్ళ గది గోడల మీదనో, డైరీ మొదటి పేజీలోనో మొత్తానికి హృదయఫలకంపై బలంగా లిఖించుకోదగిన వాక్యమిది. “చనిపోవడంలో చాలా దోషాలున్నాయి. జీవించి ఉంటే చాలు శుభాలను చూడవచ్చు ” ఒక్కొక్కసారి అంతా శున్యమే అనిపిస్తుంది. కానీ ఆ క్షణం దాటితే అంతా మేలే కలగవచ్చు. ఈ లోపల తొందరపడి మృత్యువుని స్వాగతిస్తే, ఆ శుభాలన్నీ అందుకొనే అవకాశమే మిగలదు. ఈ వాక్యంతో ఆత్మబలాన్ని పుంజుకున్న హనుమ ఆశావాదం ఫలించింది. అశోకవనంలో సీతజాడ దొరికింది. ఆశావాదానికున్న సత్ఫలం అది.

“అలలా వచ్చిన దిగులే అంతాకాదు”.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!