నన్నయ అకాల మరణంపై ఒక కథనం.!

నన్నయ అకాల మరణంపై ఒక కథనం.!

.

(పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879 )

.

నన్నయ తాను తలపెట్టిన భారతరచన ముగించక ముందే మరణించడానికి కారణం భీమన అను మహాకవియొక్క శాపము అని ప్రతీతి. ఆ కథనం ఇలా ఉంటుంది.. ’’భీమన ఇతఁడు భారతమును తెనిఁగించుటకు మునుపే ఒక భారతమును తెనుఁగున రచియించి ఆ గ్రంథమును నన్నయభట్టారకునివద్దకు కొనివచ్చి దానియందలి లోపములను పరిశీలించి రాజునకు చూపి తనకు సన్మానము కలుగఁజేయవలయును అని అడుగఁగా దానినతఁడు చదివిచూచి అందలి ప్రయోగపద్ధతులు మొదలగునవి మిక్కిలి శ్లాఘనీయములు అయి ఉండఁగా అది బయటవచ్చినయెడల తన భారతము అడఁగిపోవును అని ఎంచి ఆ యభిప్రాయమును బయలుపఱపక భీమకవితో నేను రాజు ప్రేరేఁపణచేత ఒక భారతము రచియించుచు ఉన్నాను. ఆదిపర్వముమాత్రము ఇప్పటికి అయినది. ఇప్పుడు ఈగ్రంథమును రాజునకు చూపిన యెడల తన ప్రయత్నము నెఱవేఱుటకు భంగముగా ఇది ఒకటి వచ్చెను అని తిరస్కరించునుగాని అంగీకరింపఁడు. కనుక సమయముచూచి నీ గ్రంథమును అతనికి చూపి సన్మానము చేయింతును అని చెప్పి అది తీసి తన ఒద్ద ఉంచుకొని, ఆయనను పంపి దానిని కాల్చివేసెను. ఈసంగతి భీమన ఎఱుఁగడు కనుక కొన్ని దినములు తాళి నన్నయభట్టారకుని యింటికివచ్చి అప్పుడు ఆయన ఇంటలేకపోఁగా ఆయన భార్యను పిలిచి నీ భర్త చేయుచు ఉన్న భారతము ముగిసెనా అని అడిగాడు. అంతట ఆమె ఆరణ్యపర్వము జరుగుచు ఉన్నది అని చెప్పెను. అది విని అతఁడు తనకు ఏసమాచారమును తెలియఁజేయకయే ఇతఁడు గ్రంథరచన జరపుచు ఉన్నాఁడు కనుక తన గ్రంథమును ముందుకు రానీయఁజాలఁడు అని తలఁచి, దానివలని సంతాపముచే ఇంకను ఆరణ్యములోనే పడి ఉన్నాడా అని అన్నాడు. అదియే శాపముగా తగిలి ఆ కాలమందు ఏమో పని కలిగి ఊరిముందరి అడవికి పోయి ఉండిన నన్నయభట్టారకుఁడు అక్కడనే దేహత్యాగము చేసెను.’’

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!