తొలి రోజుల్లో.. కె.ఆర్. విజయ!


తొలి రోజుల్లో.. కె.ఆర్. విజయ!

.

కె.ఆర్. విజయ తెలుగువారి అభిమాననటి కాగలిగిందంటే దాని వెనుక ఆమె సముపార్జించుకున్న సామర్థ్యం, పట్టుదల, సహనశక్తే కారణమని చెప్పాలి. అందరిలా ఆమె మొదట చిన్న చిన్న పాత్రలు ధరించి, అవకాశం లభించగానే కథానాయికగా మారలేదు. విజయ మొదటగా తమిళ చిత్రరంగంలో కథానాయికగానే ప్రవేశించింది. ఆయా సినిమాల్లో విజయ ప్రదర్శించిన అభినయం చూసి ముచ్చటపడి తెలుగు చిత్ర నిర్మాతలు తమ చిత్రాల్లో కూడా విజయకు ముఖ్య పాత్రల్ని ఇస్తూ వచ్చారు. వాటిలో ఆమె ప్రదర్శించిన హావభావాలకు ముగ్ధులైన తెలుగువాళ్లు తమ అభిమాన తారగా ఆమెకు సముచిత స్థానాన్ని కల్పించారు. విజయ కళ్లల్లో మత్తుమందు ఉంది. నాయికగా వెలుగొందిన కాలంలో కొంటె చూపులు విసురుతూ పెదాలతో చిరు దరహాసం చిందిస్తూ ప్రేక్షకుల్ని అయస్కాంతంగా ఆకర్షించే నేర్పు ఉంది. ఆ నేర్పుతోటే నాయికగా రాణిస్తూ సినీ రంగంలో మేటి స్థానాన్ని అందుకుంది.

విజయ 1947 ఫిబ్రవరి 8న కేరళలోని త్రిచూర్‌లో రామచంద్రన్, కల్యాణి దంపతులకు జన్మించింది. రామచంద్రన్ పేరుపొందిన రంగస్థల నటుడు. ఆయన 1934లో స్కూలు చదువును అర్ధంతరంగా ఆపేసి, మధుర వచ్చి, బోయ్స్ డ్రమటిక్ కంపెనీలో చేరి, దాని తరపున ఎన్నో ప్రదర్శనలిచ్చి రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

విజయ పెద్దగా చదువుకోలేదు. ఆమెకు బాల్యం నుంచే నటనలో శిక్షణనిచ్చి నటిగా రూపొందడానికి తండ్రి ఎంతగానో శ్రమించారు. విజయకు నాట్యం కూడా ఆయనే నేర్పారు. ఆయన శ్రమ వృధా కాలేదు. విజయ నటిగా రూపొందింది.

తొలి చిత్రం 'కర్పగం'


ప్రముఖ రచయిత కె.ఎస్. గోపాలకృష్ణన్ 'కర్పగం' చిత్రాన్ని రూపొందిస్తూ విజయను చూశారు. చూసీ చూడగానే తన సినిమా హీరోయిన్ ఆమే అనుకుని, మరో ఆలోచనకు తావివ్వకుండా తీసుకున్నారు. ఆ సినిమా కథంతా నాయిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. అలాంటి క్లిష్ట పాత్రను విజయకు ఇచ్చారంటే, ఆమెపై ఆయన ఉంచిన నమ్మకం ఏపాటిదో గ్రహించవచ్చు. 'కర్పగం' విడుదలయ్యాక అభినందనల వర్షంలో తడిసి ముద్దయింది విజయ. ఆ తర్వాత 'కైకుడుత్తదైవం', 'తొయిలాళి', 'కరుప్పుపణం' వంటి తమిళ చిత్రాల్లో నాయిక అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అప్పుడే కొన్ని మలయాళ చిత్రాల్లోనూ ఆమె నటించింది.

ఆమె అంతగా చదువుకోకపోయినా తెలుగు, తమిళ, మలయాళ, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం సంపాదించింది.

విజయలోని ముగ్ధమోహనత్వం గమనించి ఎన్టీ రామారావు తమ ఎన్.ఎ.టి. సంస్థ నిర్మించిన 'శ్రీకృష్ణ పాండవీయం'లో రుక్మిణి పాత్రనిచ్చి ప్రోత్సహించారు. అంది వచ్చిన అవకాశాన్ని ఆమె వృథా చేసుకోలేదు. తన సామర్థ్యాన్ని నిరూపించుకొంది. ఆ తర్వాత వచ్చిన 'పరమానందయ్య శిష్యుల కథ', 'అసాధ్యుడు', 'భలే అబ్బాయిలు', 'ఏకవీర' వంటి చిత్రాలు విజయను మేటితారగా రూపొందించాయి. 'భలే అబ్బాయిలు' నాటికి ఆమె వివాహం చేసుకొని పిల్లల తల్లి అయినా ఆమె అందం ఇనుమడించిందే కానీ తగ్గలేదు. ప్రేక్షకుల అభిమాన తారగా ఆమె ప్రాభవం మరింత పెరిగింది. తెలుగు సినిమాలతో పాటే తమిళ సినిమాల్లోనూ ఆమె మంచి డిమాండ్ సంపాదించుకుంది. ఉత్తమనటిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డును అందుకుంది.

'కళావర్థని' అనే నాటక సంస్థను విజయ సొంతంగా నిర్వహించేది. ప్రతిభ ఉన్న కొత్త నటీనటుల్ని ఈ సంస్థ ద్వారా అందించింది. కళావర్థని ద్వారా ఇచ్చిన నాటక ప్రదర్శనల వల్ల వసూలైన డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించింది. తన ఇద్దరు చెల్లెళ్లకు తీరిక వేళల్లో నృత్యంలో శిక్షణ ఇస్తూ వచ్చింది. తన కూతురికి హేమలత అనే పేరు పెట్టుకుంది. సినిమాలతో తీరికలేనంత పని ఒత్తిడి ఉండటంతో కళావర్థనికి సమయం కేటాయించలేకపోతున్నానని బాధపడేది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!