మా అమ్మ పాత ట్రంకు పెట్ట!

మా అమ్మ పాత ట్రంకు పెట్ట!


💟💟💟💟💟💟💟💟


చిన్నప్పటి సంగతే అయినా నిత్య నూతనమే!


మా అమ్మ పెద్ద పెట్టె అంటేమా అందరికీ ఎంతిష్టమో!


ముదురు పసుపు రంగు మీద పూల పూల డిజైన్తో పడవంత పెట్టె!


దానికి సదా మండ్ర గప్పంతతాళం కప్ప!


తాళం చెవి ఉనికి మా అమ్మ మంగళ సూత్రాల మధ్యలోనే!


ఏం ఉంటాయో అందులో, ఎంత రహస్యమో!


ఎన్ని ఆలోచనలో! బంగారు నగలా! ఉన్న


రెండు తులాల పుస్తెల తాడూ, తులం నల్ల పూసల చేరూ,


ఎప్పుడూ మెడలోనే గా


పట్టు చీరలా ఎప్పుడూ కట్టడం చూడలేదే?


నోట్ల కట్టలా ! కాదేమో! ఇరవయ్యో


తారీకునించే ఒకటో తేదీ కోసం


ఎదురు చూపులు చూసేది కదూ!


మరేంటబ్బా! ఎప్పుడైనా ఆవిడ తెరవడం


చూస్తే ఎగబడి, ఎగిరెగిరీ తొంగి తొంగి


మరీ చూసేవాళ్లం!


గుమ్మడి పండు లా ఉండే వెండి కుంకం


భరిణ, పన్నీరు బుడ్డీ పట్టు రుమాలు,


కొత్త జాకెట్టు బట్టలు ! పెట్టె తీసేసరికి


గుప్పు గుప్పున కర్పూరం‌ వాసన!


' కలరా ఉండలే' ఆరిందా లా చిన్న చెల్లి


కామెంట్స్! ఇంతలోనే అమ్మ పెట్టె వేసేసేది


పెద్దవాళ్లం అయి, అమ్మా, నీకొ మంచి పెట్టె కొనీదా?


అంటే, ఊఁహూఁ ఒప్పుకోదే


" నా విజయభండారు ముందు మీ ఆల్ఫాలు, సఫారీ లు దిగదుడుపే"


ఒక్క మాట లో తేల్చి పారేసింది


ఎవరి పాటికి వాళ్లం‌ అయినా ఏమూలో


సందేహం, ఏదో ఉంది అమ్మ పెట్టెలో!


ఏమిటబ్బా! చెప్పదే! ఇప్పుడూ తెరిస్తే


చూస్తాం. అయినా బోధపడదు!


ఊహించని షాక్! పూజ కోసం పూలు కోస్తూ


అలా పడిపోయిన అమ్మ శాశ్వతంగా దూరం అయింది!


ఏడ్పులూ, మొత్తుకోళ్లూ మధ్య జరగాల్సినవి‌ అన్నీ జరిగి పోయేయి!


పదకొండు రోజుల తంతులూ ముగిసి,


మా పెట్టె లు మేం సద్దుకుంటూ ఉంటే,

కొడుకులాగ అమ్మ సంతానాన్ని సాకి కడ దాకా అమ్మకి


తోడుగా ఉండిపోయినపెద్దక్క అందరినీ పిలిచి


అమ్మ పాత పెట్టె తెరిచింది. చిన్నప్పటి లాగే మూగేం!


తొంగి తొంగి చూసేం! 

మీదన ఉన్నవన్నీ తెలిసినవే! 

కిందన పరిచిన పేపర్ తీస్తేఅక్కడ ఉన్నాయి ,


పాతబడీ, నల్లబడ్డరెండు పొడుగు పసుపు దారాల


తో పేనిన తాళ్లు! రహస్యం తెలిసి పోయింది!


పదునాల్గేళ్ల వయసులో ఆవిడ

పెళ్లిలో ఈ పసుపు దారాలతోనే మా నాన్న

ఆమె మెడలో తాళి కట్టేరు! బంగారు గొలుసు లోకి తాళి బొట్టు ఎప్పుడు మార్చిందో, ఈ పసుపు దారాలని ఇంత కాలం ఇంత భద్రంగా దాచుకుంది!


" అమ్మ బంగారం ఇత్తడి సామాను


ఎవరికేది కావాలో తీసుకొండే" అక్క


అంటుంటే, వెక్కుతూ అందరం


ఏక రాగంతో ఒకేసారి అన్నాం


" అక్కా,అమ్మ విజయభండారు పెట్టె నేను తీసుకోనా? "


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


( చిన్నతనం లో మా అమ్మ పెట్టె తీస్తే మేం ఇలాగే ఉద్వేగం చెందేవాళ్ళం.కవితలో కొన్ని మాత్రమే నా అనుభవాలు


ఈ ఫొటోలో పెట్టె నెట్ సహాయం తో తెచ్చుకున్నదే!


❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!