మనకు తెలియని మన త్యాగరాజు -యక్షగానాలు! ( సేకరణ )

మనకు తెలియని మన త్యాగరాజు -యక్షగానాలు!

( సేకరణ )

త్యాగరాజు తన సంగీతాన్ని కేవలం కృతిరచనకే పరిమితం


చెయ్యలేదు. త్యాగరాజుకి అత్యంత ప్రీతిపాత్రమైన నృత్యనాటికలు


కూడా రాసాడు. ఈ నృత్యనాటికలకి మూలం, అప్పట్లో బహుళ


ప్రచారంలో ఉన్న యక్షగానాలు. ఎన్నో యక్షగాన బృందాలు ఊరూరా


తిరుగుతూ తరచు ప్రదర్శనలిచ్చేవారు. బహుశా త్యాగరాజు ఈ


యక్షగానాలు చూసి ఆకర్షితుడయ్యుండచ్చు. అందుకే కర్ణాటక శాస్త్రీయ


సంగీతాన్ని యక్షగాన ప్రక్రియలో మిళితం చేసి మూడు నృత్య నాటికలు


రాసాడు. అవి నౌకా చరిత్రం, ప్రహ్లాద భక్తి విజయం, సీతారామ విజయం.


మొదటి రెండిటి ప్రతులూ ఇప్పుడు లభ్యమవుతున్నాయి. మూడోది


దొరకలేదు. కానీ సీతారామ విజయం ఖచ్చితంగా రాసాడని సంగీత


శాస్త్రజ్ఞలు విశ్వసిస్తారు. కాంభోజి రాగంలో “మా జానకీ చెట్టబట్టగా” అనే


ప్రసిద్ధమైన కృతి ఈ సీతారామ విజయం లోనిదే అంటారు. అలాగే


కేదార గౌళ రాగంలోని “వనజ నయనుడని వలచితివో” అనే కృతి


కూడ ఇందులోదే అంటారు. ఈ కీర్తనలున్నాయి కానీ, ఈ నృత్య నాటిక


ప్రతి మాత్రం లేదు. లోకనారాయణ శాస్త్రుల్లు అనే వ్యక్తి 1868 లో ఈ


సీతారామ విజయాన్ని మొదటి సారి ప్రచురించారు. దురదృష్టవశాత్తూ


ఒక్క ప్రతి కూడా ఇప్పుడు లేదు. ఈ సీతారామ విజయమే త్యాగరాజు


రాసిన మొట్ట మొదటి నృత్య నాటికని అంటారు. కాదు, నౌకాచరిత్రమే


మొదటి నృత్య నాటికని మరికొందరంటారు. ఏ కాలంలో ఏది రాసిందీ


తెలీదు.


నౌకాచరిత్రం


నౌకాచరిత్రమే ముందు రాసిఉండే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది


త్యాగరాజు రెండో వివాహం అయిన కొత్తల్లో రాసాడు. దాదాపు


కృతులన్నీ భక్తి తత్వం మీదుగానే ఉన్నా కొన్ని చోట్ల శృంగారరసం


మిళితమై కొన్ని కీర్తనలున్నాయి. ఏ కవీ తన వయసునీ, కాలాన్నీ


దాటి పోలేడు. ఈ నిర్ధారణలు ఊహాజనితాలే – వీటికి ఆధారాల్లేవు. ఈ


నౌకాచరిత్రం తాళపత్ర గ్రంధం తంజావూరు సరస్వతీ మహల్


గ్రంధాలయంలో ఉంది. ఈ ప్రతి తమిళలిపిలో ఉంటుంది. ఈ నౌకా


చరిత్రాన్ని 1939 లో సాంబమూర్తి ప్రచురించారు. ఆయనకి దీని ప్రతి


కృష్ణస్వామి భాగవతార్ (త్యాగరాజు శిష్యుడు) కొడుకు కె.కె.


రామస్వామి భాగవతార్ ద్వారా లభించింది. వీళ్ళందర్నీ వాలాజపేట


శిష్యులంటారు. ప్రతీఏటా వైకుంఠ ఏకాదశి నాడూ ఈ వాలాజపేట


శిష్యులు నౌకా చరిత్రం పాడేవారని సాంబమూర్తి రాసారు.


దీనిలో కథ పూర్తిగా త్యాగరాజు కల్పన. శ్రీకృస్ణుడు గోపికల మధ్యన


నౌకావిహారం అనే కొత్త సన్నివేశాన్ని కల్పించాడు. గోపికలతో కలసి


యమునా నదిలో నౌకా విహారయాత్ర కెళితే గాలివానలో చిక్కుకున్న


గోపికల్ని రక్షించే దైవంగా కృష్ణుణ్ణి చిత్రీకరిస్తూ – శృంగారాన్నీ, భక్తినీ,


తత్వాన్నీ చూపించాడు. గోపికలు యమునా నదిలో నౌకా విహారానికి


వెళదామని సిద్ధమవుతారు. వారితో బాలకృష్ణుని వెంట తీసుకెళ్ళాలా,


వద్దా అని సంశయిస్తారు. బాలుణ్ణని శంకించ వద్దని చెబుతూ, కాళింది


మడుగులో కాళీయుని మదమడచి గోపబాలుర్ని రక్షించలేదా అంటూ,


కృష్ణుడు వాళ్ళని సమాధానపరిచి వారితో బయలదేరుతాడు.


ఆనందంగా సాగే నౌకాక్రీడ మధ్యలో గాలివాన వస్తుంది. ఇంతలోనే


ఓడకు చిన్న కంత ఏర్పడి నీరు వచ్చే ప్రమాదముందని కృష్ణుడు


హెచ్చరిస్తాడు. గోపికలు వినరు. ఆ కంత కాస్తా పెద్దదయ్యి నౌక


మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చివరకి అందరూ చిన్నవాడైనా కృష్ణుణ్ణి


ఆశ్రయిస్తారు. వారి భక్తికి మెచ్చి కృష్ణుడు నౌకను ఒడ్డుకు చేరుస్తాడు.


నౌకా విహారం శుభప్రదంగా ముగుస్తుంది. స్థూలంగా ఇదీ కథ.


ఈ నృత్య నాటిక త్యాగరాజు అపారమైన ప్రతిభని చూపిస్తుంది.


ఇందులో సుమారు 27 రాగాలు వాడారు. మొత్తం అయిదు అంకాలుగా ఈ


నృత్య నాటిక నడుస్తుంది.


ప్రసిద్ధి చెందిన “ఓడను జరిపే ముచ్చట కనరే”, “ఎవరు మనకు


సమానమిలలో”, “ఏ నోము నోచితిమో”, “గంధము పూయరుగా” వంటి


కీర్తనలు ఈ నౌకా చరిత్రం లోవే! ఇందులో వాడిన రాగాలూ, కీర్తనలూ


అతి రమ్యంగా ఉంటాయి. ఈ నౌకా చరిత్రా రచనలో ఓ విశేషం ఉంది.


ఇందులో కీర్తనలు నృత్య నాటికలో భాగంగా మాత్రమే కాదు విడిగా


పాడినా కూడా ఏ కృతికాకృతి అర్థాన్నిస్తాయి. ఒక్కొక్కటీ వాటి


సాహిత్యమ్మీదా, రాగమ్మీదా నిలబడతాయి.


ఉదాహరణకి “గంధము పూయరుగా” కీర్తన విడిగా పాడుకోడానిక్కూడా


చక్కగా ఉంటుంది. ఈ నాటికలో ఇంకో విశేషం కూడా ఉంది. మొదటి


కీర్తన సురటి రాగంలో ఉంటుంది, చివర మంగళం కూడా ఇదే రాగంలో


ఉంటుంది.


ప్రహ్లాద భక్తి విజయం నృత్య నాటిక కూడా గొప్ప సృజనతో రాసిందే!


అందులో త్యాగరాజు కొన్ని ప్రయోగాలు చేసాడు. అందులో ఒకటి,


అప్పట్లో నాటకాల్లోనైనా, నృత్య నాటికల్లోనైనా మంగళం ఖచ్చితంగా


ఘంట, సురటి లేదా పంతువరాళి రాగాల్లోనే ఉండేది.



ఇందులో మంగళం సౌరాష్ట్ర రాగంలో ఉంటుంది. ఇందులో వాడిన భాష


శిష్టవ్యవహారికం. ఇందులో వాడే ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో


దరువులూ, కందపద్యాలూ, సీసపద్యాలూ, ఇతర ఛందో పద్యాలూ,


త్యాగరాజు తెలుగు సాహిత్య జ్ఞానానికి అద్దం పడతాయి.


ఉదాహరణకి ప్రహ్లాద భక్తి విజయంలో ఈ కంద పద్యమూ,


సీస పద్యమూ చూస్తే, త్యాగరాజుకి తెలుగు చందస్సుపై పట్టు తెలుస్తుంది.


కం: శ్రీ జానకీ మనోహర


రాజీవ భవాది సంధ్య రఘుకుల తిలకా


రాజీవ నయన మునిజన


పూజిత పద రామచంద్ర పుణ్యము చరితా


సీస పద్యం:


స్థితి లయోధృవముల శ్రీహరి వేడ్కగా


గావించి చూచితా గాసి దీర


నీ యందు బవళించి నిర్మలాత్ముడు యోగ


నిద్ర సల్పెను కదా నిత్యముగను


నృత్యనాటికలు ప్రదర్శించారో లేదో ఎక్కడా వివరాలు దొరకలేదు.


ప్రదర్శించి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.


ఆనందభైరవి రాగం గురించి ప్రచారంలో ఉన్న ఒక కథలో ఆయన నృత్యనాటికలు


ప్రదర్శించిన ప్రస్తావన ఉంది. ఎందుకంటే ఆనందభైరవి రాగంలో త్యాగరాజు కేవలం


మూడంటే మూడు కీర్తనలు రాసాడు. నృత్యనాటికలకీ, యక్షగానాలకీ ఆనందభైరవి రాగం


ప్రాణం. అలాంటిది కేవలం మూడు కీర్తనలతో సరిపెట్టుకున్నాడా త్యాగరాజనిపిస్తుంది. ఉ


న్న కృతుల సంఖ్య 800 పైగా ఉంది. ప్రతీ రాగంలో కనీసం అయిదారు కృతులైనా ఉన్నాయి.


ఒక్క ఆనందభైరవి రాగం తప్ప. దీనికి సంబంధించిన ఓ చిన్న కథ కూడా ఉంది.


త్యాగానంద భైరవి


దక్షిణాదిన కుంభకోణం దగ్గర్లో తిరిభువనం అనే వూళ్ళో స్వామినాధ అయ్యర్


అనే అర్చకుడొకాయనుండే వాడు. ఆయన సంగీత విద్వాసుండు. మంచి నటుడు కూడా.


ఆనంద భైరవి రాగంలో మంచి పట్టుందాయనకి. ఓసారి తిరిభువనం స్వామినాధ అయ్యర్


బృందం ఓ యక్షగాన ప్రదర్శన నిమిత్తమై తిరువయ్యార్ వచ్చారు. ప్రతీ రాత్రీ వీళ్ళు


యక్షగానం చేసేవారు. జనాలు తండోపతండాలుగా విచ్చేసారు. ఆనోటా ఈనోటా ఈ


యక్షగానం సంగతి త్యాగరాజు శిష్యులకి తెలిసింది. ఓ రాత్రి ప్రదర్శన కెళ్ళారు. 

అందులో ఆనందభైరవి రాగంలో స్వరపరిచిన ఓ పాట


(“మధురానగరిలో చల్లలమ్మబోదు” పాట అని అంటారు. ఎంతరకూ ఇది నిజమో


ధృవీకరించడం కష్టం) వారినత్తుకుంది. శిష్యుల ద్వారా తిరిభువనం స్వామినాధ అయ్యర్


గురించి త్యాగరాజుకి తెలిసింది. స్వతహాగా నృత్యనాటికలంటే ప్రియం కనుక ఆ యక్షగానం


చూడాలనీ, ఆ అనందభైరవి రాగంలో పాట వినాలనీ కుతూహలం కలిగింది త్యాగరాజుకి. ఆ


రోజు రాత్రి ప్రదర్శనకి శిష్యులతో బయల్దేరాడు. యక్షగానం జరుగుతోంది. నిజంగా ఆనంద


భైరవి రాగంలో పాట విని మంత్రముగ్ధుడయ్యాడు. నాటకం ముగిసాక సంతోషం పట్ట లేక


వేదిక వైపుగా వెళ్ళాడు. తోటి సంగీత విద్వాంసుణ్ణి మెచ్చుకొని ఆనందభైరవి రాగం ఇంత


గొప్పగా పాడిన స్వామినాధ అయ్యర్ ని సభాముఖంగా అభినందించాడు. త్యాగరాజు


మెచ్చుకోవడం అంటే సామాన్యమైన విషయంకాదు. ఆ స్వామినాధ అయ్యర్ ఆనందం


పట్టలేకపోయాడు.


త్యాగరాజు వంటి విద్వాంసుడు తనలాంటి వీధి నాటకాలు వేసుకొనే కళాకారుణ్ణి


ప్రశంసించడం తన అదృష్టమని చెబుతూ త్యాగరాజుని ఒక వరమడిగాడు. “అయ్యా, మీరు


సంగీతంలో మహా విద్వాంసులు. మీ నృత్యనాటిక చూసేకే ఈ అనందభైరవి రాగాన్ని ఈ


యక్షగానంలో ఉపయోగించాను. మీవంటి వారు నన్ను ప్రశంసించడం నా అదృష్టం. మీరు నా


ప్రదర్శన చూసారనీ, మీరు ఆనందభైరవి రాగం పాటని మెచ్చుకున్నారనీ తరతరాలుగా


తెలియాలి. అలా జరగాలంటే మీరు ఆనందభైరవి రాగాన్ని నాకు దానమిచ్చేయండి. కేవలం


ఈ ఆనందభైరవి రాగంలో మీరు ఒక్క కీర్తనా కట్టకపోతే సంగీత ప్రియులు అడుగుతారు.


అప్పుడు నా యక్షగానం సంగతి తెలుస్తుంది. ఆ రకంగా నేనూ చరిత్రలో మిగిలిపోతాను.


దయచేసి ఈ ఒక్క ఆనందభైరవి రాగాన్నీ నాకొదిలేయండని” అడిగాడు. త్యాగరాజు సరే


అన్నాడు. అప్పటికే మూడు కృతులు ఆనందభైరవి రాగంలో కట్టాడు. ఆ తరువాత


త్యాగరాజు అనందభైరవి జోలికి పోలేదు. “రామ రామ నీ వారము” అనే దివ్యనామ కీర్తనా,


“క్షీర సాగర విహార” అనే ఉత్సవ సంప్రదాయ కీర్తనా, “నీకే తెలియక” అనే కృతీ తప్ప


ఆనందభైరవిలో త్యాగరాజు రాసిన వేరే కృతుల్లేవు. ఇవి కూడా శిష్యుల ద్వారానే అందరికీ


అందుబాటులోకొచ్చాయి. బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కథ సాంబమూర్తి ది గ్రేట్


కంపోజర్స్ ( page 164 -166 ) లో ఉంది.


బహు భాషా కోవిదుడు


త్యాగరాజు బహుభాషావేత్త. కేవలం తెలుగు లోనే కాదు. సంస్కృతం, తమిళ, కన్నడ, హిందీ


మరియు మరాఠీ భాషల్లో ప్రావీణ్యముందని చెప్పే చాలా సంఘటనలున్నాయి. ఇంతకు


ముందు చెప్పినట్లుగా ఆయన శిష్యులు చాలామంది తమిళులే! గోపాలకృష్ణ భారతి,


మహారాజ స్వాతి తిరునాళ్ దూత, వడివేలు వచ్చినప్పుడూ తమిళం మాట్లాడినట్లుగా వారి


వారి జీవిత చరిత్రల్లో రాసారు. కాశీ నుండి గోపీనాధ భట్టాచార్య అనే ఆయన త్యాగరాజుని


అంత్య దశలో సందర్శించినప్పుడు, ఆయనతో హిందీలో మాట్లాడినట్లుగా


ఆధారాలున్నాయి. అలాగే శరభోజి రాజు అల్లుడు మోతీరావుతో మరాఠీ సాహిత్య చర్చల్లో


పాల్గొన్నట్లుగా రాసారు. ఇవన్నీ చూస్తే, త్యాగరాజుకి మిగతా భాషల్లోవున్న ప్రావీణ్యం


తెలుస్తుంది. ఎన్ని భాషలొచ్చినా మాతృ భాష తెలుగుని మాత్రం ఆయన వదల్లేదు.


అందులోనే సంగీతాన్ని నింపాడు. అందులోనే జీవించాడు. అందుకే త్యాగరాజు


తెలుగువాడుగా పుట్టినందుకు తెలుగువారందరూ గర్వపడాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!