సంగీతమయం సమస్తం.

సంగీతమయం సమస్తం



 


తెలుగు సినిమాకి భావయుక్తంగా పాట ఎలా పాడాలో, పద్యం ఎలా చదవాలో నేర్పిన మహాభావుడు నాగయ్య.


తాను పోషించిన పాత్ర ' పోతన ' లాగే తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయిన ధర్మాత్ముడు నాగయ్య.


సినిమావాళ్ళంటే జులాయిలు, వ్యభిచారులు అనే అపప్రధను పోగొట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టిన నటుడు నాగయ్య.


1965 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ బిరుదు పొందిన తొలి తెలుగు సినిమా నటుడు నాగయ్య.


' నా యిల్లు ' చిత్రం తర్వాత నిర్మించిన ' భక్త రామదాసు ' ఆయన్ని ఆర్థికంగా మరింత కృంగదీసింది. అనేక కష్టాలకు ఓర్చి నిర్మాణం పూర్తి చేసి విడుదల చేసినా ఆర్థికంగా విజయవంతం కాకపోవడం ఆయన్ని మరిన్ని కష్టాలలోకి నెట్టింది. అందుకే ఆయన తన అనుభవాలను వివరిస్తూ .........

" నా జీవితం ఇంకొకరికి గుణపాఠం. నేను నేర్చుకున్న నీతిని అందరికీ వెల్లడిస్తూ నేర్చుకోమని విన్నవిస్తున్నాను. దానధర్మాలు చెయ్యండి. తనకు మాలిన ధర్మాలు చేయకండి. అందరినీ నమ్మకండి. అందరూ మంచివాళ్ళే అనుకోవడం పెద్ద పొరబాటు. మేకవన్నె పులులేవరో తెలుసుకుని వాళ్ళని వేరు చేయండి. మీ మంచితనాన్ని, సహృదయతను వినియోగించుకునే వాళ్ళని గమనించి ప్రవర్తించండి. పేరు ప్రఖ్యాతులు, అఖండ గౌరవాలు  పొందినా నాలాంటి దుర్దశ ఇంకొకరికి రాకూడదు "

అంటారు నాగయ్య.


మొదట భోగిగా, తర్వాత యోగిగా మారిన వేమన అంతిమయాత్ర జరుగుతోంది. తొలుత మిత్రుడు, తర్వాత శిష్యుడిగా మారిన అభిరాముడు దుఃఖంతో గానం చేస్తుండగా వేమన తనువు చాలించాడు. ' యోగి వేమన ' చిత్రంలో ఈ ఘట్టం చిత్రీకరణ పూర్తయింది. ఆ ఘట్టంలో అభిరాముడి పాత్రధారి లింగమూర్తి కూడా నాగయ్య గారికి ప్రియ మిత్రుడు. మేకప్ తీసేసాక ఆయనతో నాగయ్య గారు " బావా ! ఇలాగే మనిద్దరిలో ఎవరు ముందుగా కాల్ షీట్ పూర్తి చేసుకుని ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి సిద్ధమవుతారో... వారి చెవిలో రెండవవారు నారాయణ మంత్రం చెబుతూ వీడ్కోలు పలకాలి. అలా అని నాకు మాటియ్యి " అని లింగమూర్తి గారి చేత చేతిలో చెయ్యి వేయించుకున్నారట.

1973 డిసెంబర్ 30 వ తేదీన లింగమూర్తి గారికి ఆమాట నిలబెట్టుకునే అవకాశం వచ్చింది. మద్రాస్ ' వాలంటరీ హెల్త్ సర్వీసెస్ ' ఆస్పత్రిలో నాగయ్య గారి చివరి ఘడియల్లో ఆ వార్డులో భజన జరుగుతుండగా లింగమూర్తి గారు నాగయ్య గారి చెవిలో నారాయణ మంత్రం జపించారు. ఆస్పత్రి వర్గాలు గానీ, అక్కడి రోగులు గానీ ఆ భజనకు ఆడ్డు చెప్పలేదు సరికదా వారు కూడా పాల్గోన్నారట.

దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.... నాగయ్య గారి మీద ప్రజలకు వున్న పూజ్య భావాన్ని. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా దానధర్మాలు చేసినా తెలుగు, తమిళ ప్రజల మనస్సులో మాత్రం మహోన్నతమైన స్థానాన్ని మిగుల్చుకున్న మహానటుడు నాగయ్య గారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!