భర్తృహరి సుభాషితాలు...

భర్తృహరి సుభాషితాలు


     భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్

     భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్

     భూషలు కావు పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి వా

     గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్ !!

పై పద్యానికి సంస్కృత మూలం

     కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః

     న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా

     వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే 

     క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం !!


     ధర ఖర్వాటుడొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై

     త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ తాళ ద్రుమచ్ఛాయ త

     చ్ఛిరమున్ తత్ఫల పాత వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా

     బొరి దైవోపహతుండు వోవు కడకుం పోవుంగదా యాపదల్ !!

     

     అతనికి వార్ధి కుల్య యగు నగ్ని జలంబగు మేరు శైలమం

     చిత శిల లీల నుండు మద సింహము జింక తెరంగు దాల్చు కో

     పిత ఫణి పూల దండ యగు భిష్మ విషాగ్ని సుధా రసంబగున్

     క్షితి జన సమ్మతంబగు సుశీల మదెవ్వని యందు శోభిలున్ !!


     ఒకచో నేలను పవ్వళించు నొకచో నొప్పారు పూసెజ్జ పై

     నొకచో శాకము లారగించు నొకచో నుత్కృష్ట శాల్యోదనం

     బొకచో బొంత ధరించు నొక్కొక తరిన్ యోగ్యాంబర శ్రేణి లె

     క్కకు రానీయడు కార్య సాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ !!

పై పద్యానికి సంస్కృత మూలం

     క్వచిత్ ప్రిథ్విశయ్యా క్వచిదపి చ పర్యంకశయనః

     క్వచిత్ఛాకాహారీ క్వచిదపిచ శాల్యోదనరుచిః 

     క్వచిత్కంధాధారీ క్వచిదపిచ దివ్యాంబరధరో

     మనస్వీ కార్యార్ధీ న గణయతు సుఖం న చ దుఃఖం 

(చౌర్తెస్య్: డ్.శ్వరూప్)(స్వరూప్@వెహిచ్లె.ంఏ.బెర్కెలెయ్.ఏడూ)


     ఆకాశంబుననుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సు

     శ్లోకంబైన హిమాద్రినుండి  భువి, భూలోకంబునందుండి య

     స్తోకాంబోధి పయోధినుండి పవనాంధో లోకముంజేరె గం

     గాకూలంకష పెక్కు భంగుల్ వివేకభ్రష్ట సంపాతముల్

(చౌర్తెస్య్: పద్మ ఇంద్రగంటి)(పద్మై@చ్సుల్బ్.ఎదు)


     తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు

     తవిలి మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు

     తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు

     చేరి మూర్ఖుని మనసు రంజింప రాదు


     కసవుచే నీటిచే మోదకలన చేత

     బ్రదుకు మృగమీనసజ్జన ప్రకారమునకు

     శబర కైవర్త సూచక జనులు జగతి

     గారణము లేని పగవారు గారె తలప

పై పద్యానికి సంస్కృత మూలం

     మృగ మీన సజ్జనానాం తృణ జల సంతోష విహిత వృత్తీనాం |     

     లుబ్ధ కధీవర పిశునా నిష్కారణమేవ వైరిణో జగతి ||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!