కత్తిలాంటి పద్యం!

కత్తిలాంటి పద్యం!

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా

లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్

బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా

గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్


చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసి మొగ్గలాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవిగా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించ గలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్ని యిస్తాయేమోనని! 

దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది. సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథివంటి తెలుగు కవి మరింకొకడు కనిపించడంటే అతిశయోక్తి గాదు. పదాలలో చుఱుకుదనం, నడకలో పరువులెత్తే ఉద్రేకం, భావంలో విప్లవం, వీటన్నిటినీ ఛందస్సులో సునాయాసంగా బిగించగల నైపుణ్యం, దాశరథి సొంతం. ఆ కాలంలో అందరి కవుల్లాగానే దాశరథికూడా భావకవిత్వం వ్రాసారు.

Comments

  1. కవిత్వ బాంబులు కాల్చి, ప్రేల్చి,
    'అగ్నిధార'లకు ఆజ్యం పోసి,
    నిజాము రాజును బజారు కీడ్చిన
    ప్రజాకవీంద్రుడు - 'దాశరథి'!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!