కాళిదాసు ఉప్మా...

కాళిదాసు ఉప్మా...

ఒక సారి భోజమహారాజుకి తన కొలువులో ఉన్న కవులందరితో కలిసి వనభోజనానికి వెళ్ళాలనే కోరిక పుట్టింది. మందీ మార్బలంతో వెళితే కవితాగోష్టికి కావలసినంత సమయం దొరకదు కనుక తానూ, మంత్రీ నవరత్నాలూ మాత్రమే వెళ్ళేలాగా, అక్కడ భోజనానికి గానూ ప్రతీ కవి తమ ఇంటినుంచి ఏదో ఒకటి చేసుకు వచ్చేలాగా ఏర్పాట్లు చేసుకుని వనభోజనానికి వెళ్ళేరు. 


ఉన్నవారు నవరత్నాలైనా తొమ్మండుగురూ వంట చేసుకొస్తే అది చాలా ఎక్కువైపోతుంది కనుక కేవలం నలుగురు మాత్రం ఉప్మా చేసుకుని వెళ్ళేరట. 


మహా ఉత్సాహంతో కవిత్వం చెప్పుకుంటూ, ఆనందిస్తుండగా భోజనం వేళ అయింది. 


నలుగురు కవులూ తమవెంట తెచ్చిన ఉప్మా రాజుగారికి వంతులవారిగా వడ్డించేరు. మహదానందంగా తిన్నారు భోజరాజు. ఉప్మా రుచి ఎలా ఉందంటారో అని అది చేసుకొచ్చిన నలుగురూ ఎదురు చూస్తుండగా భోజరాజు ఇలా అన్నారట. 

దండినః పదలాలిత్యం 

భారవేరర్ధ గౌరవం 

ఉపమా కాళిదాసశ్య 

మఘో సంతి త్రయోగుణాః

అంటే 


దండి వండి తెచ్చిన ఉప్మా నాల్గవ వంతు మాత్రం ఉడికింది, భారవి గారి ఉప్మా సగం ఉడికింది, మాఘుని ఉప్మా మూడొంతులు ఉడకగా, కాళిదాసు గారి ఉప్మా అద్భుతంగా వచ్చింది 


అని. ఇది సరదాగా చెప్పుకునే అర్ధం. 


ఐతే పై శ్లోకానికి అసలు అర్ధం... 


దండి గారి కవిత్వములో పదములయొక్క లాలిత్యం కనపడుతుంది, భారవి గారి కవనములో అర్ధం ప్రస్ఫుటంగా తోచుతుంది, మాఘుని కవిత్వం త్రయోగుణాత్మకంగా ఉంటుంది, ఉపమానమును చెప్పే విషయములో కాళిదాసుకు తిరుగు లేదు 


అని... 


చిన్నప్పుడు మా తాతగారు చెప్పగా విన్నానిది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!