"పుత్రకామేష్టి యాగము" !

"పుత్రకామేష్టి యాగము" !
(శ్రీమదధ్యాత్మ రామాయణము, బాలకాండ - పండిత నేమాని రామజోగి సన్యాసిరావు.....
విశ్లేషణ ...శ్రీ పిస్కా సత్యనారయణ గారు.)

.
సంతానార్థియైన దశరథమహారాజు, తమ కులగురువు వసిష్ఠమహర్షి
సలహా ప్రకారం "పుత్రకామేష్టి యాగము" చేస్తాడు. యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసమును, మహారాణులు మువ్వురూ భక్తితో స్వీకరించి, గర్భం ధరిస్తారు.
కొన్నాళ్ళు గడిచి వారికి నెలలు నిండేసరికి వసంతఋతువు ప్రవేశించినది.
.

' దేవదేవుడు వచ్చు శీఘ్రమె దివ్యతేజముతోడ, భూ
దేవి చాల సుఖించు, పూర్తిగఁ దీరిపోవును కష్టముల్,
దేవతల్ తమ పూర్వవైభవదీప్తిఁ గాంచెద ' రంచు స
ద్భావ మొప్పగ మత్తకోకిల పాడె నామని రాకతో!
.

భావము:
' దేవాదిదేవుడైన శ్రీమన్నారాయణుడు త్వరలోనే గొప్పతేజస్సుతో ఈ భువిపై అవతరిస్తాడనీ
, ఈ వసుధ యొక్క కష్టములన్నీ తీరిపోతాయనీ, దేవతలు మళ్ళీ తమ గతవైభవమును పొందగలరనీ ' వసంతఋతువు ఆగమనముతో మత్తకోకిల గానం చేయసాగినది....
కవి ఈ పద్యమును "మత్తకోకిల ఛందము" లోనే వ్రాయడం విశేషం!
.

పిల్లగాలులు వీచుచుండగ విష్ణుకీర్తన జేయుచున్,
మల్లెపూవులు గొల్చుచుండగ మాధవాంఘ్రులు భక్తితో.
నల్లనల్లన భృంగముల్ పరమార్థనాద మొనర్ప, రా
జిల్లి వన్నెలతో వసంతము చేరె ధాత్రికి మిత్రమై!
.

భావము: నెమ్మదిగా వీస్తున్న పిల్లతెమ్మెరల సవ్వడులు విష్ణుసంకీర్తనం చేస్తున్నట్టుగా తోస్తున్నది. మాధవుని పాదములను భక్తితో అర్చించడానికే మల్లెలు పూచినట్టుగా అనిపిస్తున్నది. అక్కడక్కడా తుమ్మెదల ఝంకారధ్వని ఓంకారనాదమును తలపిస్తున్నది. ఇటువంటి శుభశకునములతో వసంతకాలము ధారుణికి నేస్తమై ఏగుదెంచినది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!