ముక్కుపై చక్కని పద్యం !

ముక్కుపై చక్కని పద్యం ! 

.

మనకి ప్రబంధ కవులలో ముక్కు తిమ్మన యనేకవి ఉన్నాడు.ముక్కుపై చక్కని పద్యం చెప్పినందుకు ఆయనకు ముక్కు తిమ్మన యనే బిరుద నామం వచ్చిందనిృపెద్దలు చెపుతూఉంటారు. కానీ ఆపద్యం యిప్పుడు రామరాజభూషణుని వసుచరిత్ర లోకనిపిస్తూఉంది. బహుశః కాపీ రైట్సు యిచ్చాశాడేమో తిమ్మనగారు. ఆగొడవంతా మనకెందుకు? అసలా పద్యమేమిటో ఒకసారి చూస్తే సరిగదా! సరే! వినండి మరి!

శా; నానా సూన వితాన వాసనల నానందించు సారంగ మేలా 

నన్నొల్ల దటంచు గంధఫలి బల్కాకం తపంబంది యో 

షా నాసాకృతిబూని సర్వ సుమనస్సౌరభ్య సంవాసమై, 

పూనెం బ్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబు లిర్వంకలన్;

గంధఫలి యంటే సంపెంగ. దానికి తుమ్మెదమీద కోపంవచ్చిందట! యెందుకనీ? అన్ని పూలదగ్గరకూ పోతుంది, నాదగ్గరకుమాత్రం రాదేమని. తుమ్మెదకు సంపంగి వాసన గిట్టదు. ఆవాసన సోకగానే తలదిరిగి పడిపోతుంది. అందువల్ల సంపంగి దగ్గరకు రాదు. పూవు ఫలించాలంటే పరపాగ సంపర్కం తప్పదు. అదితుమ్మెదలవలననేగదా జరిగేది.(సృష్టిక ఆడ,మగ కలసినట్లు.) మరి తుమ్మెదరాకుంటే యెలా? అదీ సంగతి!

యెలాగైనాసరే తుమ్మెదను సాధించాల్సిందే నని సంపెంగ పట్టుపట్టింది. తపస్సు చేసింది( యెండలోకాగింది) తపస్సుకి అసాధ్యంలేదుగదా! ఆతపఃఫలం కారణంగా గిరికాదేవి ముక్కుగా పుట్టిందట. యిర్పుడాముక్కునకు అన్నిపూల సుగంధాలూ అంటుతున్నాయి. యికనేం? అప్పుడొక్క తుమ్మెదయినా రాదని బాధపడిందా? యిప్పుడాబాధంతాతీర్చుకునేలా తనదగ్గర రెండు గండు తుమ్మెదలను కట్టి వేసుకున్నదట!

యేమిటిదంతా అంటారా? ఆమెముక్కు సంపెంగి పూవులాఉంది .(తుప్ప సంపెంగకాదు.చెట్టు సంపెంగ. విశాఖలో దొరకు తుంది) కళ్ళేమో గండు తుమ్మెదలను పోలి ఉన్నాయని చెప్పటం యిదంతా! బాగుంది కదూ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!