అల వైకుంఠ పురంబులో నగరిలో ....

శుభం.!

(పోతన గారి పద్యాలు...బాపు గారి చిత్రం.)

.

"'అల వైకుంఠ పురంబులో నగరిలో నామూలసుధంబు దా,

పల మందారవనాన్త రామ్రు త సరః ప్రాంతేందు కాంతోప లో,

త్పల పర్యంక రమావినోది యగునాపన్నప్రసన్నుండు వి,

హ్వలనాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై'"

.

వైకుంఠపురం . అందులో సరస్సు , సరస్సు పక్కనే మందారవనం . మందారవనంలో ఒక చలువరాతి మంటపం . అక్కడే కలువపూలు పరిచిన పర్యంకం . మందహాస వదనారవిందుడై పర్యంకం మీద పవళించి లక్ష్మీ మాతతో సరస సల్లాపాలలో మునిగి ఉన్నాడు మాధవుడు . అకస్మాత్తుగా వినిపించింది గజేంద్రుని ఆర్తనాదం . క్షణంపాటు తొట్రుపాటు పడ్డాడు . భక్తుడు కష్టాలలో చిక్కుకున్నాడన్న విషయం తెలిసింది . గజేంద్రుని కరుణించాలనే తపన తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు పరమాత్ముడు . ఇతరులకు సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినవాడు తానే ఇతర విషయాలన్నీ వదిలేసి ఉన్నపళంగా బయలు దేరాడు భక్తుని రక్షించడానికి . ఆర్తత్రాణ పరాయణత్వం అంటే ఇదే .

.

"సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే

పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడాకర్ణికాం

తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోద్ధితశ్రీ కుచో

పరి చేలాంచలమైన వీడడు హరి గజప్రాణా వనోత్సాహి యై"

.

సమయం లేదు . గజరాజును కాపాడలనే తపనలో లక్ష్మీ మాతకు కూడా ఎక్కడకు వెడుతున్నాడో చెప్పలేదు . శంఖచక్రాలూ , తనపరివారమూ , వాహనమైన గరుడుడూ జ్ఞాపకం రాలేదు . ఎంత తొందరంటే పట్టుకున్న లక్ష్మీ దేవి కొంగు విడవాలని కూడా అనిపించలేదు . మహావిష్ణువు మనః స్థితిని అందరికీ తెలిసిన పై పద్యం ద్వారా చెప్పాడు పోతనామాత్యుడు . బాగానే వుంది . తొందరపాటులో ఏం చేయలో నిర్ణయించుకోలేక పోతున్న విష్ణువును చూచి చలించి పోయింది క్షీరసముద్ర రాజ తనయ .విషయమేమో తెలియడం లేదు . తెలుసుకోవాలనే కోరిక . అడగాలంటే సంకోచం . మన గృహాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయి . అప్పుడు భార్యలేం చేస్తారో తెలియదు కాని , మాత మాత్రం కింద చెప్పిన విధంగా ప్రవర్తించింది . మాత ఏం చేస్తోందో పద్యంలో మనకు తెలియ జేస్తున్నాడు

'

'మహానుభావుడు పోతన .

అడిగెద నని కడు వడి జను 

అడిగిన తన మగుడ నుడువడనినెడ యుడుగున్

వెడ వెడ జిడి ముడి తడబడ

నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్'

.

” ఎక్కడికి వెడుతున్నారు తమరు ” అని అడగాలనే కోరికతో ఒక అడుగు ముందుకు జరిపింది . అడగవచ్చునో అడగకూడదో అన్న సందింగ్ధంలో పడిపోయింది . ముందు జరిగిన పాదం వెనుకకు వేసింది .అడిగితే చెబుతాడో లేదో అనే సందేహం . మళ్ళీ ముందు అడుగు వేసింది . వేసిన అడుగు వెనుకబడింది . చిన్నపదాలతో లక్ష్మీ మాత మనస్సులో నెలకొనియున్న సందిగ్ధస్థితిని చక్కగా మనదృష్టికి తీసుకొని వచ్చాడు పోతన్న . పద్యం అర్థం కాకున్నా , తెలుగు భాష రాకున్నా , ఈ పద్యం విన్నవాడికి సందిగ్ధస్థితి నెలకొని ఉన్నదని అర్థమవుతుంది . శిల్పమంటే ఇదేనేమో ? ఇది సామాన్యమైన కళ కాదు . పోతనకే సాధ్యం . అందుకే అన్నాడో కవి ” ముద్దులు గార భాగవతమున్ రచియించుచు మధ్య మధ్య పంచదారలో నద్దితి వేమొ మహా కవి శేఖర , మధ్య మధ్య అట్లద్దక ఈ మధుర భావములెచ్చటనుండి వచ్చురా మహా కవీ” అని . మహాలక్ష్మి మనో భావాలకు దర్పణంగా నిలిచే ఈ పద్యం ఆంధ్ర సాహిత్యానికే అలంకారం , అపురూపం , అనితర సాధ్యం .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!