నడుస్తున్న వంటగదిలో ఉపగదులు .

నడుస్తున్న వంటగదిలో ఉపగదులు 

.

ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. 

తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు.

.

19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు. ‘స్ర్తీ కి శరీరం ఉంది. దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది. దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి’ అని సంప్రదాయాల చేతిలో కీలుబొమ్మల్లా బతుకుతున్న స్ర్తీలలో చైతన్యం కలిగించేలా రచనలు చేసిన చలం స్ర్తీలకి ఎప్పటికీ చిరస్మరణీయుడే. 60ల నుంచి స్ర్తీలు సాహిత్య రంగంలో ప్రవేశించారు. 

కోడూరి, యద్దనపూడి, మాదిరెడ్డి, లత, రంగనాయకమ్మ మొదలగువారు తమ రచనలతో తెలుగు సాహిత్యాన్ని ముంచెత్తారు. ఆ సమయంలో కొందరు రచయితలు కూడా స్ర్తీల పేర్లలో రచనలు చేశారంటే వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదో ఆలోచించవచ్చు. వీరందరూ కేవలం కథారంగానికీ, నవలా రంగానికీ పరిమితం. కవితా రంగంలో కాలు పెట్టలేదు. 80ల్లో కవిత్వ రంగాన్ని కుదిపివేస్తూ స్ర్తీవాద కవిత్వ ఉద్యమం ప్రారంభమైంది. సమాజంలోని పురుషాహంకార ధోరణిని ప్రటిఘటిస్తూ సంప్రదాయ భావజాలాలపై తిరుగుబాటు చేస్తూ ఒక ప్రభంజనంలా, ఒక విస్ఫోటనంలా, ఒక మహోద్వేగ ప్రవాహంలా తెలుగు కవిత్వాన్ని ఒక్క కుదుపు కుదిపింది స్ర్తీవాద కవిత్వం. స్త్రీలు తాము మాత్రమే అనుభవించి అనుభూతించి, తాము మాత్రమే రాయగలిగే భావాలకు అక్షర రూపమిచ్చారు. 

కవయిత్రులుగా కొత్త ప్రపంచపు తలుపులు తెరిచారు. పితృస్వామ్య వ్యవస్థను ధిక్కరిస్తూ తమ కవిత్వపు కొరడా దెబ్బలు ఝుళిపించారు. అక్షరాలను అగ్ని కేతనాలుగా ఎగుర వేశారు. పిడుగులు కురిపించారు. తుఫానులా విజృంభించారు. స్ర్తీ వాద కవిత్వంలో తొలి తెలుగు కవయిత్రి రేవతీ దేవి. తన అనుగార దగ్థ హృదయ జ్వాల సెగలతో తెలుగు కవితా ప్రపంచాన్ని జ్వలింపచేశారు. ‘నేనెవరినో మీ కెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును. ఆ కళ్ళు అనురాగం కళ్ళు. లోకమంతట్లోనూ నన్నే చూసేది ఆ అనురాగపుటందమైన కళ్ళు. యుగ యుగాల సమస్త ప్రాణకోటి అనురాగాన్ని. నా పైన అవిరళంగా వర్షించే అనురాగ మేఘాలు ఆ కళ్ళు. ఈ హృదయం రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకొన్న నెత్తురు పువ్వు’. స్ర్తీలంటే కేవలం శరీరాలే తప్ప హృదయాలు గుర్తుకు రాని ప్రపంచంలో రవంత అనురాగ సుగంధం కోసం, కాసింత వలపు పరిమళం కోసం తపించి, జ్వలించి తన హృదయ పుష్పాన్ని నిస్పంకోచంగా రేకులు రేకులుగా విప్పి పరచింది రేవతీ దేవి. అవయవాలకే తప్ప ఆత్మలకు తావు లేని సాహిత్య ప్రపంచంలో మొట్టమొదట ‘అనురాగం’ అనే నాలుగు అక్షరాల పదాన్ని ప్రయోగించిన తొలి కవయిత్రి రేవతీ దేవి.. .

.

తన కలల గాలిపటాన్ని నిర్భయంగా ఎరుగవేసి, తన కాంక్షల చిత్తరువులపై పరదాలు తొలగించి తన అంతరంగ వర్ణాలను ప్రదర్శించిన భావుకురాలు రేవతీదేవి. కోపం, ద్వేషం, కోరిక మొదలైన రంగు రంగుల ఇంద్రధనుస్సుల సౌందర్యాలను పాఠకుల హృదయ వేదికలపై ఆరబోసిన రేవతీ దేవి రచించిన మరో కవిత ‘దిగులు’. ‘దిగులు/ దిగులు దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే/ దిగులెందుకు’ అని చెప్పలేని దిగులును గురించి అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది. స్ర్తీవాద కవిత్వంలో అనితర సాధ్యమైన శైలి రేవతీ దేవిది. పరస్పరం అనురాగ బద్ధంగా అన్యోన్యంగా జీవించవలసిన వివాహం స్ర్తీల పాలిట పెద్ద శిక్షగా మారడాన్ని వ్యాఖ్యానిస్తూ సావిత్రి ‘పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తానని/ పంతులుగా రన్నప్పుడే భయం వేసింది/ ఆఫీసులో నా మొగుడున్నాడు/ అవసరమైనా సెలవివ్వడని/ అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది/ వాడికేం మగ మహారాజని ఆడా మగా వాగినప్పుడే అర్ధమై పోయింది ‘పెళ్ళంటే పెద్ద శిక్ష’ అని/ మొగుడంటే స్వేచ్ఛా భక్షకుడని/ మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే/ మమ్మల్ని విభజించి పాలిస్తోందని- ‘బందిపోట్లు’ కవితలో భార్యలకు స్వేచ్ఛ నివ్వకుండా బానిసలుగా చూసే భర్తలను గురించి ఢంకా బజాయించి చెప్తారు. నేడు భార్య కన్నా భార్య తెచ్చే జీతాన్నే ప్రేమించే భర్తలు ఎక్కువయ్యారు. ఆనందానుభూతితో పరవశించవలసిన భర్త పరిష్వంగం భార్య పాలిటి సర్ప పరిష్వంగ మెలా అయ్యిందో మందరపు హైమవతి (ఈ వ్యాస రచయిత్రి) తన సర్ప పరిష్వంగం కవితలో ‘అంతా బాగానే ఉంటుంది/ అప్పటి వరకు/ కామంతో నైతే నేమి/ మోహంతో అయితే నేమి/ ఇరువురి తనువులొకటైనాక/ అదె్వైత స్థితి పొందినాక/ ఈ లోకాన్నే మరచిపోయిన/ అమృత ఘడియలలో/ అక్షయ తూణీరం నుంచి/ ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు/ జీత మెప్పుడిస్తారు’ అని. ఈ లోకాన్నే మరచిపోయిన అదె్వైత స్థితిలో కూడా భర్త భార్యని జీతం గురించే అడుగుతాడు. అప్పుడామె ఒక్కసారిగా ‘వేయి రాక్షస బల్లులు/ మీద పాకినట్టు/ మనస్సు ఝడుసుకొన్న ఆ క్షణంలో/ నా జీవితం నుంచి/ దూరంగా సుదూరంగా విదిలించి వేయాలనుకుంటాను నిన్ను!’ అని భర్తని వదలి వెయ్యాలనుకుంటుంది గానీ- భారత స్ర్తీ నైనందుకు/ సంప్రదాయాల సజీవ సమాధిలో/ ఊపిరాడక గిల గిల కొట్టుకుంటూ/ వివాహం ఊబిలో/ కూరుకుపోతున్నప్పుడు/ జీవితం నుంచి కాదు కదా/ శరీరం నుంచైనా కించిత్తుకూడా/ దూరమవడం నా చేతుల్లో లేని పని’ అంటుంది. ఇక్కడ ఆలు మగల అనురాగ పూరితమైన పరిష్వంగం ఆర్ధిక కారణాల వలన, భార్యని బదులు డబ్బును ప్రేమించడం వలన ఆ పరిష్వంగం అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా మారిపోయింది. ఆధునిక యుగంలో సర్వత్రా కనిపించేవి ఇలాంటి సర్ప పరిష్వంగాలే. పతియే ప్రత్యక్ష దైవమైన వ్యవస్థలో ఆ పతి పరిష్వంగాన్ని అత్యంత జుగుప్సాకరమైన సర్ప పరిష్వంగంగా భావించడమే ఒక ధిక్కారం, ఒక సాహసం. 

.

సాహిత్యం అంతా పురుషుల దృష్టితోనే రాయడం వల్ల, వారి కాముక దృష్టికి స్ర్తీలు కేవలం అవయవాల ప్రదర్శన శాలలు గానే కనిపిస్తారు. వారి దృష్టిలో స్ర్తీలంటే రెండు వక్షోజాలు, రెండు జఘనాలు మాత్రమే. వారి చూపులు స్ర్తీల నెలా ఇబ్బంది పెడతాయో కేవలం స్ర్తీలు మాత్రమే రాయగలిగిన కవిత ‘చూపులు’. స్కూలుకు వెళ్ళే విద్యార్ధినులను, ఉద్యోగాలు చేసే స్ర్తీలను, రోడ్డు మీద నడిచే మహిళలను మగవారు చూసే చూపులు, ఆకలి చూపులు, కామపూరితమైన వికృతమైన చూపుల గురించి- ‘రెండు కళ్ళనుంచి/ చూపులు/ సూదుల్లా వచ్చి/ మాంసపు ముద్దలపై/ విచ్చల విడిగా తిరుగుతూ ఉంటాయి’ అని జయప్రభ వర్ణిస్తారు. బడికి వెళ్తున్నా, గుడికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఆఫీసుకు వెళ్తున్నా చూపులు ఆడవాళ్ళ శరీరాల మీద గాయాలు చేస్తూనే ఉంటాయి. ‘బస్సులోను/ క్లాసు లోనూ/ వేసే ప్రతి అడుగు వెనకా/ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని/ గాయం చేస్తూ/ విషపు చూపులు గుచ్చుకుంటూనే ఉంటాయి’ అంటూ పురుషుల చూపులు పడతుల హృదయాలనెలా ముక్కలు చేస్తాయో వర్ణించిన కవిత ఇది. అలాంటి చూపులను సహించలేని స్ర్తీలు అలాంటి పురుషులను ప్రతిఘటించాలనుకుంటారు. అందుకే కవయిత్రి ‘ఈ దేశంలోని ఆడదానికి/ వళ్ళంతా ముళ్ళుండే రోజు/ ఎప్పుడొస్తుందా అని’ ఎదురు చూస్తుంది. పిల్లల్ని కనే ప్రక్రియ ఎంత నరకమో ఆ స్థితిలో ఆమె పరిస్థితి ఎంత భయంకరమో కొండేపూడి నిర్మల ‘లేబర్‌ రూం’ కవితలో ‘ప్రపంచంలోని నరకమో/ నరకంలోని ప్రపంచమో/ త్రీడీలో చూస్తున్నట్టే ఉంటుంది’ అంటూ పరాకాష్ఠకు చేరిన బాధను వర్ణిస్తూ ‘కాళ్ళనలా ఎడం చేసి దీనంగా హీనంగా నీచాతి నీచంగా/ ఒక హింసాతల పరాకాష్ఠ కోసం ఎదురు చూడ్డమంటే/ రైలు పట్టాలమీద నాణెం విస్తరించిన బాధ/ కలపను చెక్కుతున్న రంపం కింద పొట్టులా ఉండ చుట్టుకొన్న బాధ’ను కళ్ళకు కట్టినట్టు, మనసుకు పట్టినట్టు చిత్రీకరిస్తారు. పిల్లల్ని కనడం ఎంత నరకమో ఈ కవిత వర్ణిస్తే, తప్పనిసరి పరిస్థితిలో పిల్లలు వద్దనుకొని అబార్షను చేయించుకొని పరితపించే కొందరి తల్లుల మానసిక బాధను అబార్షను స్టేట్‌మెంట్‌లో పాటిబండ్ల రజని ‘నీకు పంచేందుకు రక్తం లేకనే కదా/ నిన్ను పెంచేందుకు తీరిక లేకనే కదా/ నీ అక్కకు ఇంకా పాకడమైనా రాలేదనే గదా, నేన్నిన్ను వద్దనుకొన్నది/ నా టెంపరరీ ఉద్యోగమూ, ఆరోగ్యము, నీకు మరణశిక్షను ఖాయం చేస్తే/ తల్లడిల్లిన తల్లి మనసు అయ్యో/ పాలింకిపోవడానికికున్నట్టు/ మనసింకిపోవడానికి/ మాత్రలుంటే ఎంత బావుండు’ అని ఆక్రోశిస్తారు. స్ర్తీవాద కవితల్లో మరో ప్రముఖ కవిత వంటిల్లు. సమాజంలో వంటిల్లు స్ర్తీలకు, ముందు గది పురుషులకు కేటాయించారు. 

.

మంచి స్ర్తీకి కితాబు ఏమిటంటే మంచి మంచి వంటలు బాగా చేసి ఇంట్లో వాళ్ళను మెప్పించడము. ఏ కాలమైనా ఈ లక్షణం మాత్రం మారదు. ప్రవరుడు తీర్థయాత్రలు చేసి హిమాలయ సౌందర్యాలను ఆస్వాదిస్తే అతని భార్య మాత్రం అరుణాస్పద పురంలోనే ఉండి ‘వండ నలయదు వేవురు వచ్చిరేని’ అని వంటింటికే అంకితమవుతుంది. నల భీమ పాకమని మగవారి వంటలు ప్రశస్తికి వచ్చినా ఆ నల భీముల పాకశాస్త్ర ప్రావీణ్యం కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం. ‘అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంటుంది’ అంటూ వంటింటి రహస్యాల్ని విప్పి చెప్తారు విమల. ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే మహారాణి/ అయినా చివరికి వంటింటి గిన్నె లన్నిటిపైనా/ మా నాన్న పేరే’ అని పచ్చి నిజాన్ని చెప్తారు. వంట చెయ్యడం, వడ్డించడంలోనే రోజులో చాలా సమయం గడిచిపోతుంది స్ర్తీలకు. చదవడానికే, రాయడానికీ దేనికీ సమయముండదు. అందుకే ‘ఎంత అమానుషమైందీ వంటగది? మన రక్తం పీల్చేసి మన ఆశల్నీ, కలల్నీ కాజేసి/ కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న రాకాసి గద్ద ఈ వంటిల్లు’ అని వంటిల్లు ఎలా స్ర్తీల శక్తుల్ని ధ్వంసం చేస్తుందో చెప్తారు. మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం/ గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రండి’ అంటూ వంటిళ్ళలోనే జీవితమంతా అంకితమైపోయిన స్ర్తీల గురించి ఘాటైన చురకలు వేస్తారు. లావుగా ఉన్నవాళ్ళు సన్నగా మారాలని, నల్లటివాళ్ళు తెల్లగా మారాలనే నేపథ్యంలో ఎంత హింసను అనుభవిస్తున్నారో ‘సౌందర్యాత్మక హింస’లో ‘మన మంటే 34, 24, 35 కొలతలమైన చోట, మొటిమలు మొలవడం, జుట్టు రాలడం/ నడుం సన్నగా లేకపోవడమే/ మన నిరంతరాందోళలైన చోట/ దైహిక సౌందర్య పిపాస యే/ మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట/ ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!’ అని సకల స్ర్తీల బాధల గురించి విమల వ్యాఖ్యానిస్తారు. స్ర్తీవాద రచయిత్రులు చాలా మంది వివాహ వ్యవస్థలోని అసమానతల గురించి, ఎంత సేపూ భార్యలు మాత్రమే సర్దుకు పోవడం గురించి, దాంపత్యంలోని బోలుతనం గురించి ఎన్నో కవితల్లో విప్పి చెప్పారు. ‘సర్దుకుపో ఈ నాలుగక్షరాలే/ స్ర్తీని అగ్నికాహుతి చేసే సాధనాలు’ అని ఈ సర్దుకు పోవడం స్ర్తీలకే ఎందుకు పరిమితం కావాలని ప్రశ్నిస్తూ ‘నీటిలోనే జీవిస్తుంది చేప/ కాసేపు నేలపైన ఉండమంటే/ నశిస్తుంది మరుక్షణమే/ నింగిలో విహరించే పక్షిని/ కాసేపు సర్దుకో నేలపైనే ఎగురు’ అంటే ఎంత అసహజమో ఈ సర్దుకు పోవడం కూడా అంతకష్టమైనదే అని మందరపు హైమవతి తన ‘సర్దుకుపో’ కవితలో వాస్తవ స్థితిని వివరిస్తారు. పురుషాధిక్య సమాజంలో స్ర్తీలు ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో తెలిపే సిలబస్‌ను గూడ పురుషులే రూపొందించారు. స్ర్తీలను ప్రాణ పరిమళంతో అణువణువు స్పందించే మనుషులుగా గాక ఒక బానిసగానో, ఒక ఆటబొమ్మగానో, ఒక విలాసవస్తువుగానో చూసే సంఘం గుండెల్లో ప్రశ్నల బాణాలు సంధిస్తూ ‘ఎన్నాళ్ళు ఈ పూర్వకాలపు పాఠాలు/ మనసును గుర్తించలేని పాతకాలపు భావాలు’ అని నిలదీస్తుంది మందరపు హైమవతి. ‘అలా పగలబడి నవ్వడం తప్పు గదూ/ అధరాలపై చిరు దరహాసమే సుందరం/ అలా భర్త మాటను ఎదిరిస్తావెందుకు/ సహనం స్ర్తీకి ఆభరణం/ గృహిణికి శాంతమే భూషణం’ ఇలాంటి పాఠాలనీ సిలబస్‌నీ అందరం కలిసి మార్చలేమా అని ప్రశ్నిస్తారు. స్ర్తీల దైహిక బాధల గురించి, మానసిక వేదనల గురించి, తరతరాలుగా యుగ యుగాలుగా పురుషులు చేసిన గాయాలనుంచి, అనేకానేక అనుభూతుల గురించి మనసులో గుచ్చుకునేటట్టు కవితలు రచించారు. ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, జయప్రభ, ఓల్గా, సావిత్రి, మందరపు హైమవతి, రజియా బేగం, పాటిబండ్ల రజని, బి. పద్మావతి, కె. గీత, ఎస్‌. జయ మొదలైనవారు ఎన్నో స్ర్తీవాద కవితల్ని రచించారు. లేబర్‌ రూం, పైటను తగలెయ్యాలి, చూపులు, అబార్షన్‌ స్టేట్‌మెంట్‌, సర్పపరష్వంగం, రాజీవనాలు, కాల్‌గళ్స్‌ మొనోలాగ్‌, గుక్క పట్టిన బాల్యం, కట్టుకొయ్య, గృహమేకదా స్వర్గ సీమ, దాంపత్యం, నిషిద్ధాక్షరి, నీలి కవితలే రాస్తాము మొదలగు కవితలు కవితా ప్రపంచంలో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. స్ర్తీవాద సాహిత్య ఉద్యమం మూడు దశాబ్దాలు దాటిన సందర్భంలో సమాజంలో ఎన్నో విజయాలు సాధించింది. సంఘంలో మార్పుని వేగంగా తీసుకువచ్చింది. అధికారులకైనా, మామూలు ప్రజలకైనా స్ర్తీ ంటే ఉన్న చులకన భావం పోయింది. సభల్లో నైనా, నిజ జీవితంలోనైనా స్ర్తీల గురించి ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి జంకుతున్నారు. ఆధునిక పురుషులు చాలా మంది ఇళ్ళల్లో భార్యలకి సాయం చేస్తున్నారు. పిల్లల పెంపకంలో పాలు పంచుకుంటున్నారు. 

.

నేడు మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, బస్సుల్లోనూ, రైళ్ళలోనూ, సినిమాల్లోనూ చంటిపిల్లల్ని మగవాళ్ళు ఎత్తుకున్న దృశ్యాలే కనిపిస్తాయి. స్ర్తీవాదం తెలుగు కవిత్వంలో ఎంత సంచలనం కలిగించినా ఆ తర్వాత ఉద్యమంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్ర్తీలందరూ ఒకటి గాదు. ధనవంతులు, అగ్రవర్ణాల స్ర్తీలతో బాటు దళిత స్ర్తీలు, అణగారిన వర్గాల స్ర్తీలున్నారని, వాళ్ళ సమస్యలు వేరని ఆ స్ర్తీల సమస్యల్ని ప్రతిబింబిస్తూ దళిత వాద సాహిత్యం వచ్చింది. ఆ తర్వాత ముస్లిం వాద సాహిత్యం వచ్చింది. నీలి మేఘాలు, గురి చూసి పాడే పాట సంకలనాలు కాకుండా ‘నల్ల పొద్దు’ మొదలైన సంకలనాలు వచ్చాయి. దేనికైనా బలమైన పునాది స్ర్తీవాద సాహిత్యమే. సమాజంలో నేడు శ్రామిక స్ర్తీలు అధికంగా ఉన్నారు. ఇళ్ళలో పనిచేసేవారు, ఫేక్టరీలలో, షాపుల్లో, ఇళ్ళ నిర్మాణాల్లో, పొలాల్లో, తోటల్లో శారీరక శ్రమ చేసేవాళ్ళు ఎంతమందో ఉన్నారు. వారి సమస్యలను చిత్రీకరిస్తూ, ఇంకా అట్టడుగు ప్రజల జీవనాల్లోకి వెళ్ళినప్పుడే స్ర్తీవాద సాహిత్యం బలోపేతమవుతుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!