తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్ర... అత్తగారు!

మరుపురాని పాత్ర... అత్తగారు!

తెలుగు సాహిత్యంలో మరుపురాని పాత్ర... అత్తగారు!
.
ఆ మాట అనగానే మనముందు గయ్యాళి సూర్యాకాంతం రూపం దర్శనమిస్తుంది. అది మన తప్పుకాదు. పరిస్థితుల ప్రభావం.
అత్తగారనగానే కోడళ్లని వేపుకు తినే పాత్రలే మన మనసులో మెదలుతాయి గాని,
.
“దొంగలెవరో, దొర్లెవరో మనకెట్లా తెలుస్తుంది? మా కాలంలో దొంగలైతే, నల్లగా నాపరాళ్లలాగ, పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనెరాసుకుని, దొంగతనాలకూ, దోపిళ్లకూ వస్తూండేవాళ్లు...,” అని అమాయకత్వం వెలిబుచ్చే ‘అత్తగారు’ కేవలం భానుమతి రామకృష్ణగారి ఊహల్లోనే ఉదయిస్తారు.
.
కల్తీలేని భాష, భావాలు, భావనలతో తెలుగింటి అత్తగారు ఇలాగే ఉండాలని అందరూ ఆశించి, ఆకాంక్షించే అపురూప సృష్టి భానుమతి అత్తగారు. ఈ అత్తగారిలో కనబడే వ్యక్తిత్వమల్లా కాలదోషం పట్టని ఆచారాలు, అలవాట్లు, నమ్మకాలు, కట్టుబాట్లు వీటన్నింటిని పేనివుంచే చాదస్తము. ఇది వాస్తవికతకు ఎంతో దగ్గరైన ప్రాత. ప్రతి వీథిలోనూ రామాలయం ఉన్నట్లే, ప్రతీ ఇంట్లోనూ ఒక అత్తగారు తప్పనిసరి. తాపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే ఆవిడ మనస్తత్వం, కోడలిని, ఇంటిని కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకోగలిగే నేర్పరితనం, నిమ్మకాయెంతో, ఆవకాయా అంతే, ఆవెంతో గేదంతే అనుకునే అజ్ఞానం, అమాయకత్వం వెరసి ‘అత్తగారు.’
.
బోసి నోట్లో కోరల్లా కనిపించే రెండు పళ్ళు, కేశాల్లేని తలని కప్పుతూ తెల్లని మల్లు పంచ, కొంచం అమాయకత్వం, కొంచం గడసరితనం, కొత్తని చూసి వింత పడడం, పాత సంగతులని ఆప్యాయంగా తలుచుకోవడం, అవకాశం దొరికితే పెత్తనం చేయాలన్న ఉబలాటం, ఒకమాట అని పది మాటలు పడ్డా అవి ఎవరికీ తెలియకూడదన్న లౌక్యం. వీటికి మారురూపే ‘అత్తగారు.’
.
అన్ని నాకే తెలుసనే ధీమా, తాను చేసే ప్రతి పని (నిర్వాకం) పై గట్టి నమ్మకం. అవి బెడిసి కొడితే తన తప్పును తాను ఒప్పుకోవటమేమిటి? విడ్డూరం. అసలు తాను తప్పు చేస్తే కాదా, తన చుట్టూ ఉన్న వాళ్లు చేతకాక తప్పులు చేస్తారు. తనదే తప్పని రుజువైతే, మొహం దాటేయడం తనకేం కొత్తకాదు. ఇహ ఆవిడ వంట చేస్తే వడ్డించిన వెంటనే ఫలానా అని కనుక్కోవడం ఆ బ్రహ్మతరంకాదు. అయితే, ఆవిడకు పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలు అంటే మహా ఇష్టం. అవి వండి, ప్రియమైన వారికి వడ్డించి వారిని దడిపించటం అంటే మరీ ఇష్టం. ఆవిడలో చాదస్తం, ఆచారలపట్ల మక్కువ కాస్త ఎక్కువైనా, ప్రేమకు ఆచారంలేదనే సహృదయం గల నిండు మనిషి.
.
ఇక ఆవిడ కాస్త మెల్లగా మాట్లాడితే, తంజావూరు తంబూరా మంద్రస్థాయి అనవచ్చు, అదే గొంతు పెంచారో కలకత్తా మెయిలే, కంఠం ఎత్తి మాట్లాడినపుడు మాత్రం కందిరీగలు ఘోష పెడుతున్నట్టుంది అంతే! అవడానికి పాతకాలం మనిషైనా, జాలీ మూడ్ లో ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఇంటిలో కాఫీ నిల్, రేపు మీకు నో కాఫీ అంటు పొడిమాటలు ఇంగ్లీషులో అలవోకగా దొర్లించేయగలరు.
.
అన్నట్టు మన అత్తగారు అవడానికి ఆంధ్రా గడుసుపిండమేగాని మధురాంతకంలో పుట్టి, చెంగల్పట్టులో పెరిగారు. అందుకే ఆవిడకు అరవ సాంప్రదాయం కూడా కరతళామలకం. అంతెందుకూ ఆలయాలు, ఆచారాలు అరవ దేశంలో ఉన్నట్టు ఆంధ్రాదేశంలో ఉండవంటారు ఆవిడ. అందుకే అరవ సంవత్సరాది కూడా ఆంధ్రా స్టైల్లో ఘనంగా జరుపుకుంటారు.
.
ఇంతెందుకు షడ్రసోపేతమైన భోజనం చేసి తాంబూలం వేసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుందో, భానుమతి అత్తగారిని తలుచుకుంటే అటువంటి అనుభూతే కలుగుతుందని చెప్పొచ్చు. ఉగాది పచ్చడిలో రుచుల్లా అత్తగారిలో కూడా అన్ని భావోద్రేకాలు పరిపూర్ణంగా మనకు గోచరిస్తాయి. తెలుగు సాహిత్య రంగంలో అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయే సజీవమూర్తి అత్తగారి పాత్ర.
(కృతజ్ఞతలు .. శ్రీ మతి సౌమ్యశ్రీ రాళ్లభండి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!