రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం రచన: ఏల్చూరి మురళీధరరావు

రజాశ్లేషం” – ఒకనాటి హృదాశ్లేషం


రచన: ఏల్చూరి మురళీధరరావు


1973 హేమంతంలో అనుకొంటాను. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ఇంటికి వెళ్ళాను.

ఆ రోజుల్లో కృష్ణశాస్త్రిగారి ఇల్లంటే సాహిత్యికులందరికీ సాహిత్య సంగీత హృదయంగమ సంగమతీర్థరాజం.

గోష్ఠీవినోదంకరణలతో అభ్యాగతులకు అయాచితంగా అనిమేషత్వం సిద్ధిస్తుండేది.

మేడ మెట్లెక్కి నేను కాలింగ్ బెల్ నొక్కేసరికి – భగవంతుడే మందిరద్వారాలు తీసినట్లు కృష్ణశాస్త్రిగారే తలుపుతీసి, ఆప్యాయనంగా పలకరించి, లోపలి గదికి తీసుకొనివెళ్ళారు.

అప్పటికే అక్కడ పిలకా గణపతిశాస్త్రి గారున్నారు.

నిండైన ప్రేమతో వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేను ఆంధ్రదేశం భావకవిత్వపు ఇంద్రజాలంలో మంత్రముగ్ధమై ఉండిన కాలపు కవితాసవితల సన్నిధిరూపమైన పెన్నిధిని స్వాయత్తీకరించుకొంటూ కేవలానుభవానందమూర్తినై ఉన్నాను.

‘మాట్లాడుకోవటం’ అంటే కృష్ణశాస్త్రి గారు స్క్రిబ్లింగ్ ప్యాడ్ పైని వ్రాయటం, గణపతిశాస్త్రి గారు వాకోవాక్యాన్ని కొనసాగిస్తూ ప్రసంగించటం అన్నమాట.

నా అదృష్టం ఏకకాలంలో ప్రేక్షక – శ్రోతృ స్థానీయత. కృష్ణశాస్త్రిగారి అందమైన అక్షరాలను చూస్తూ, గణపతిశాస్త్రిగారి అక్షరప్రసంగాన్ని వినటం.

ఒక్కొక్కసారి గణపతిశాస్త్రిగారు కృష్ణశాస్త్రిగారి వ్రాతను పైకి చదివి, నిమీలితనేత్రులై ధ్యానమగ్నులై భావాన్ని మనోగతం చేసికొని, ఆ తర్వాత ప్రశాంతంగా సమాధానించటం జరుగుతుండేది.

విషయం: తెలుగు కవిత్వపు స్థితిగతులు. వర్తమాన స్థితి ఆధారంగా భావిగతుల అభ్యూహ.

అంతలో “పోస్ట్” అని కేక వినిపించింది.

శాస్త్రిగారికి అపరిచితులూ, సుపరిచితులూ అందరూ ఆత్మీయులే. ఎక్కడెక్కడి నుంచో వారికి లెక్కలేనన్ని ఉత్తరాలు వస్తుండేవి. ఆ ఉత్తరాలను అందుకోవటం అంటే వారికి దేవులపల్లి సోదరకవులు పిఠాపుర సింహాసనాసీనులైనప్పుడు చెప్పిన పద్యాలలో అంతటి పట్టరానంత సంతోషం.

రాజహంసగారు ఉత్తరాల కట్టను అందుకొని, లోపలి గదిలోకి తెచ్చి కృష్ణశాస్త్రిగారి చేతిలో ఉంచారు.

అందులో బుక్ పోస్టు పాకెట్టు ఒకటున్నది.

శాస్త్రిగారు ఉత్తరాలను ప్రక్కనుంచి, బుక్ పోస్టు పాకెట్టును పైకి తీసి, దానిని ఎవరు పంపినదీ చూడకుండానే, నిరాసక్తంగా దారాలను తప్పించి, వేళ్ళకొనలతో కాగితపు ఆచ్ఛాదనను తొలగించి, అందులో ప్లాస్టిక్ జాకెట్టుతో ఉన్న ఎర్రని అట్టపైని గిల్టు అక్షరాలను చూసి విభ్రాంతులై, అద్ధావాక్కుతో చకచకా పేజీలను తిరగేసి, పుస్తకాన్ని మిలమిల మెరుస్తున్న కాటుక కన్నులకద్దుకొని, గుండెలకు హత్తుకొన్నారు.

గణపతిశాస్త్రిగారు మేదురమైన ఆ ఆదరానికి, పారమెరుగని ఆ పారవశ్యానికి, నిండైన ఆ భక్తితాత్పర్యానికి చకితులై, “ఏదండీ, ఆ పుస్తకం ఇలా ఇవ్వండి” అంటూ చేయిజాపారు.

శాస్త్రిగారు తెల్లవారుజామున తొలితొలి వెలుగురేకల నునువెచ్చని పలకరింపులకు పులకరించి ఒకటొకటిగా రేకులు విచ్చుకొని విప్పారిన గులాబీ పువ్వులాగా ఆ పుస్తకాన్ని కరాంజలిబంధంలో నిలుపుకొని గణపతిశాస్త్రిగారి కరకమలాలలో ఉంచారు.

వారు పుస్తకాన్ని తెరుస్తున్నప్పుడు ప్రక్కన కూర్చొని ఉన్న నేనూ విస్తుపోయి చూశాను.

అది పూజ్యులు అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు ఢిల్లీనుంచి పంపిన తమ తండ్రిగారు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు గారి అందమైన ఊహాగానము, ఇతర కృతులు ప్రథమ ముద్రిత ప్రకాశిత సువర్ణసంపుటం.

గణపతిశాస్త్రి గారు పుస్తకాన్ని తదేకంగా చూస్తుండగా కృష్ణశాస్త్రిగారు ఆ పద్యాలను పైకి చదవమని స్క్రిబ్లింగ్ పాడ్ పైని వ్రాసి, వారికి చూపారు.

గణపతిశాస్త్రి గారు పుస్తకం ముందునుంచి వెనుక దాకా పైపైని చూసి, మైమరపు నుంచి తేరుకొని, చివరికి – రామకృష్ణరావు గారి స్వహస్తాక్షరాలతో తిలకాయమానంగా విలసిల్లుతున్న పద్యాన్ని సుశ్రావ్యమైన మధుక్షీరద్రాక్షామధురధారాధారాళమైన స్వరసరణితో, పరమ మోహనమైన రాగధోరణిలో మరెన్నటికీ మరపుకు రానంత అందంగా పాడి వినిపించారు.

ప్రశాంతినిలయమైన వారి ముఖమండలం నుంచి వన్నెలు చిమ్ముతున్న మేనిచిన్నెలతో స్వరకిన్నెరలు శాంతికపోతాల వలె పైకెగిరి, మా హృదయకుహరాలలో విహరించి, ఇల్లంతా వ్యాపించి, కుడ్యగవాక్షరంధ్రాల గుండా వాయువీథులలోని కెగిసి ఒక్కటొక్కటిగా అంతర్హితములైపోతుండటాన్ని ఆ పుణ్యదివసాన కన్నులారా తిలకించి పులకించటం నాకింకా గుర్తున్నది:

“నేనే కాదు, సమస్తభూతతతియున్ నిర్వేదభారమ్ముచే

నానాభంగుల లాలనీయగతులన్ నా గీతమే పాడు; లో

కానీకమ్ముల లోన లోన నొక హాహాకార ముద్భూతమై

శ్రీ నారాయణపాదనీరజరజాశ్లేషమ్ము కాంక్షించెడిన్!”

అని పద్యాన్ని చదివి ముగించారు, గణపతిశాస్త్రిగారు. తాదాత్మ్యం వల్ల వారి కన్నులు అర్ధనిమీలితాలైనాయి.

అయితే ఎందుకో, ఆయన బొమలు ముడివడినట్లనిపించింది. గొంతు డగ్గుత్తికను చెందింది.

“శ్రీ నారాయణపాదనీరజరజాశ్లేషం అన్నారు, అబ్బూరి వారు …”

అంటూ, సందిగ్ధంగా కృష్ణశాస్త్రిగారికేసి చూశారు.

నేను అహమహమిక కొద్దీ ఉండబట్టలేక, “రజశ్శబ్దం నిఘంటువుల్లో సకారాంతం గానూ, అకారాంతం గానూ ఉన్నదేమో చూద్దాము” అన్నాను.

కృష్ణశాస్త్రి గారి వద్ద లేని నిఘంటువు ఉంటుందా? తామరలు నిండిన సరోవరం లాగా బీరువాలలో పుస్తకాలు నిండిన ఆ గది చదువుల తల్లికి కొలువుకూటం కదా!

రజశ్శబ్దం సకారాంతం. అందువల్ల దానిపై ఆశ్లేష శబ్దం సంధిల్లినప్పుడు సకారానికి లోపం వచ్చి ‘రజ ఆశ్లేషం’ అనీ; యకారం వచ్చినప్పుడు ‘రజయాశ్లేషం’ అనీ రెండు రూపాలే కాని, ‘రజాశ్లేషం’ కాజాలదని గణపతిశాస్త్రిగారి భావం అన్నమాట.

అబ్బూరి వారు పద్యంలో శ్రీమన్నారాయణుని పాదనీరజ రజాశ్లేషాన్ని కాంక్షించారు కదా.

కృష్ణశాస్త్రిగారు వెంటనే, “ఎర్రన్న యశశ్శబ్దాన్ని అకారాంతంగా ప్రయోగించాడు కదా, ఆ పద్యాన్ని చదువు” అన్నారు నాతో.

ఆ పద్యం స్ఫురింపక నేను ఖసూచకంగా చూశాను.

శ్రీ గణపతిశాస్త్రి గారు మహావిద్వాంసులు. శ్రీ మహాభారతాన్ని ఆంధ్రీసౌవస్తికులకోసం ఆధునికవచనంలో పాపఠ్యమానంగా ప్రపంచించిన పండితమూర్ధన్యులు. మహాకావ్యనిర్మాణధురంధరులు.

వారికీ స్ఫురించి ఉండదు. లేకపోతే చెప్పేవారే.

కృష్ణశాస్త్రిగారే ఆ పద్యపాదాన్ని వ్రాసి గణపతిశాస్త్రిగారికీ, నాకూ చూపించారు.

“నాకు తెలుగులో వేలకొద్దీ పద్యాలు వచ్చును. అయితే ఏదీ నియతంగా చదువుకోలేదు” అన్నారు. ‘చక్షూరాజీవయుగంబు’, ‘భద్రాయితమూర్తి’ అని చూసి నేర్చుకోవటమే కానీ, తాళ్ళూ దారాలూ తెలియవు.

చూడండి. ఒకప్పుడు నేనూ –

“ఈ లోకమ్ము దరిద్రతా కృపణతా హింసా రిరంసా రుషో

ద్వేలోల్లోలములందు మున్గి విలయాభీలస్థితిన్ మాయునే

మో! లేకున్న సహోదరాస్థిపలలమ్ముల్ తిందురే యెందు, త

త్కీలాలాసవపానలాలసమదాంధీభూతులై మానవుల్.”

అని వ్రాశానే కాని – అందులో గణాలూ, వ్యాకరణనియమాలూ చూసుకోలేదు” అన్నారు.

“మా అబ్బూరి అలా కాదు.

గొప్ప పండితుడు.

మహా మహా పండితుడు.

ఏది వ్రాసినా పరమగంభీరంగా ఉంటుంది.

ఎంతో గుండెల్ని కుదిపివేస్తేనే కాని వ్రాయడు.

వ్రాసిన ప్రతి అక్షరం ఆచి తూచి వ్రాసిందే.

మాకందరికీ గురువు.

నేను దేశమంతా సభల్లో తిరిగినప్పుడు పాడిన పద్యాలే ఇవి.”

అని, ఒక్కొక్క పంక్తినీ ఎంతో ఆవేశంగా వ్రాశారు.

“తాళ్ళూ దారాలూ” అంటే కృష్ణశాస్త్రి గారి పరిభాషలో వ్యాకరణ సూత్రక్రమం అన్నమాట. సూత్రాలను తాళ్ళూ దారాలు అనేవారు.

ఆ పంక్తులను మేమిద్దరమూ చదువుతుండగా – పై పంక్తిలోని మహా మహా పండితుడు లోని “మహా మహా” ల తర్వాత హంసపాదు పెట్టి, మళ్ళీ ఒకసారి “మహా” అని వ్రాసి, దానికి ఒద్దికగా క్రింది గీటు గీశారు.

“అబ్బూరి ‘ఊహాగానము’ అని పేరుపెట్టాడు. విశ్వనాథ అయితే ‘ఊహగానము’ అనాలంటాడు.”

అని వ్రాశారు.

చాలాకాలం తర్వాత ‘ఊహ’ శబ్దం పుంలింగం కనుక ‘ఊహగాన’మే సలక్షణమని, అయితే ‘ఊహాగానము’ సామవేదంలోని ఒక ప్రపాఠమని, ‘ఊహాగానము’ మరింత సార్థకమని – రామకృష్ణరావు గారి మనోగతం నాకు బోధపడింది. ఆ ప్రస్తారవిషయాన్ని తర్వాత నేను వ్యాసంగా వ్రాసి ప్రకటించాను.

రూఢమైన ఆవిష్టమనస్కత నుంచి తేరుకొనే దాకా మౌనవల్మీకస్థులై ఊరుకొని, కృష్ణశాస్త్రిగారు పుస్తకాన్ని గాఢంగా గుండెలకు హత్తుకొన్నారు.

“ఎంత మంచిపని చేశాడు, వరద!” అన్నారు. అన్నారంటే, వ్రాసి చూపారన్నమాట.

చేయి వణకే ఉత్తరవయస్సు నాటికీ తీరు మారని వారి అక్షరాలు – ముద్దులు మూటగట్టే సుప్పాణి ముత్యాలు.

“హైదరాబాదులో ఎవరో సన్మానం చేస్తానంటే ఆ సభలూ, సన్మానాలూ నాకు అక్కర్లేదన్నాను. మరీ మరీ బలవంతం చేశారు.

సభానిర్వహణ విషయమై నా నియమాలు ఇవీ:

1) సభ ఎక్కడ జరిగినా ఫర్వాలేదు.

2) ఎంతమంది వచ్చినా, రాకపోయినా ఫర్వాలేదు.

3) నేను సభాస్థలి ప్రాంగణంలోకి అడుగుపెట్టేసరికి వేదికమీద మా అబ్బూరి, రాయప్రోలు ఆసీనులై ఉండాలి.

5) నేను వేదిక మీదికెక్కి అబ్బూరి కాళ్ళకు మ్రొక్కి, రాయప్రోలుకు పాదాభివందనం చేసి, ఇద్దర్నీ కౌగిలించుకొని, పుష్పమాలలు వేసి, ఆ తర్వాత నేనూ కుర్చీలో కూర్చొనాలి.

6) సభ దరిదాపుల్లో ఎక్కడా మంత్రులూ, పందులూ ఉండటానికి వీల్లేదు – అన్నాను.”

అని, కలకల నవ్వారు.

నవ్వే వేళల్లో వారి కాటుక కళ్ళల్లో కన్నీళ్ళు జాలువారి మిలమిల మెరిసేవి.

కొన్నాళ్ళకు ఆ సంగతులన్నీ ‘కృష్ణశాస్త్రి జ్ఞాపకాలు’ అన్న పేరుతో ఒక వ్యాసం వ్రాస్తే నేను దానిని పుస్తక ప్రకటనార్థం ఫెయిర్ చేసి ఇచ్చాను.

“అందరికీ అటువంటి అదృష్టం ఉండదు. నా పద్యాలూ సంకలనం వెయ్యలేదు. తండ్రి ఋణం అంటూ ఏదైనా ఉంటే, పూర్తిగా తీర్చుకొన్నాడు వరద” అన్నారు.

ఇరవైయవ శతాబ్ది తెలుగు కవిత్వానికి కారయితలు శ్రీ అబ్బూరి రామకృష్ణరావు, శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారలు పార్శ్వగతులై మైత్రీమందస్మితాలను వెలయిస్తుండిన ఛాయాచిత్రాన్ని చూసినప్పుడు ఒకప్పుడు వెల్లివిరిసిన జ్ఞాపకస్రవంతికి అక్షరాంకనం ఇది.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!