తెలుగు నవలా చక్రవర్తి విశ్వనాథ.!

తెలుగు నవలా చక్రవర్తి విశ్వనాథ.!

.

తెలుగునాట నవలలపై విస్తృత చర్చ జరుగుతున్న దరిమిలా 58 నవలలు రాసి విఖ్యాతి చెందిన విశ్వనాథను తలచుకోవడం నవలా రచనలో తెలుగువారి ప్రగాఢ ప్రవేశాన్ని గుర్తు చేసుకోవడమే.

‘నేను మానవ ప్రవృత్తిని ఆమూలాగ్రం పరిశీలించి తెలిసికొని వ్రాశాను. నాకు గ్రంథ రచన అంటే ఏమిటో తెలుసు. సగం నిద్రలో లేపి ఒక నవల డిక్టేటు చేయమంటే చేయగలను’... అంటారు విశ్వనాథ సత్యనారాయణ తన ‘నేను- నా రచనా స్వరూపం’ వ్యాసంలో. విశ్వనాథను కవిసామ్రాట్ అంటారుగానీ ఆ బిరుదు ఆయనకు న్యాయం చేయదు. ఆయన కావ్యాలే కాదు వ్యాసాలు రాశారు. కథలు రాశారు. నవలలు రాశారు. నవలల్లో కూడా ఆ విస్తృతి అసామాన్యమైనది. సాంఘిక నవలలు, చారిత్రక కాల్పనిక నవలలు, మ్యాజికల్ రియలిజం ఛాయలున్న నవలలు, మానసిక విశ్లేషణ కలిగిన నవలలు, డిటెక్టివ్ నవలలు, సైన్స్ ఫిక్షన్‌కు దగ్గరగా ఉండే నవలలు... ఎన్నని. ‘కావ్యరచనలో పూర్వకవులు ఎన్ని పోకడలు పోయారో నేనూ అన్ని పోయాను’ అన్న ఆయన వ్యాఖ్య ఆయన నవలలకు కూడా వర్తిస్తుందనిపిస్తుంది.

.

ఆయన నవలల్లో ‘సముద్రపు దిబ్బ’ గొప్ప ప్రతీకాత్మక వ్యంగ్య రచన. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పాశ్చాత్య ప్రభావిత పథకాల వల్ల దుష్పరిణామాలు కలగనున్నాయని విమర్శిస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ చేసిన అతి గొప్ప రచన ఇది. దేశంలోని అన్ని రంగాలలో ఈనాటి దిగజారుడుతనాన్ని దుస్థితిని ఆనాడే ఆ నవల ఊహించింది. ఈ నవలలో ఓ చోట ‘శాస్త్రముల చదువు వేరు. ఉద్యోగముల కొరకు చదివెడి లౌకికపు చదువు వేరు. లౌకికపు చదువులెంత చదివినను ధనాశ వృద్ధి పొందును. అతి దురాశ వృద్ధి పొందును. మనిషి బుద్ధి సద్వివేకము పొందబోదు’ అని స్పష్టం చేస్తాడాయన. ఈనాడు చదువుకున్నవారి సంఖ్య అధికమవుతున్న కొద్దీ విద్యావంతుల సంఖ్య పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం.

విశ్వనాథ రచనలు ఆరంభించే సమయానికి జాతీయోద్యమం తీవ్రస్థాయిలో ఉంది. ఇదే సమయంలో భారతీయులను భౌతికంగానే కాదు మానసికంగా కూడా బానిసలుగా చేసుకోవాలన్న బ్రిటిష్ వారి ఆలోచనా ఫలితాలు కూడా స్పష్టమవసాగాయి. భారత దేశ చరిత్రను వక్రీకరిస్తూ అనేక వేల యేళ్ల అసలైన చరిత్రను చరిత్ర పుటల్లోంచి తొలగించే ప్రయత్నాలు సఫలమవసాగాయి. విదేశీ చదువులు చదివిన భారతీయులు ఆ ప్రభావంతో మన దేశ ఔన్నత్యాన్ని ప్రాచీనత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రాచీన వాఞ్మయాన్ని చులకన చేస్తూ న్యూనతా భావాన్ని సమాజంలో ప్రచారం చేయసాగారు. ఇలాంటి విచ్ఛిన్నకరమూ ప్రమాదభరితమూ అయిన ప్రచారాన్ని అడ్డుకుని మనవారికి ఆత్మవిశ్వాసం ఇచ్చే సాంస్కృతిక ఉద్యమం విశ్వనాథ రచనల జీవం అయింది.

అందువల్లనే ఆయన తన నవలలు ‘స్వర్గానికి నిచ్చెనలు’, ‘మాబాబు’, ‘విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు’, ‘దేవతల యుద్ధము’, ‘పరీక్ష’, ‘జేబుదొంగలు’, ‘గంగూలీ ప్రేమకథ’, ‘దమయంతీ స్వయంవరం’, ‘కుక్కగొడుగులు’ వంటివాటిలో ఆధునిక సమాజంలో అపోహలకు గురవుతున్న అనేక అంశాలను సర్వ రీతిలో విశ్లేషించి వివరించటం కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఈనాడు కొందరు చిత్రిస్తున్న తీరులో వర్ణవ్యవస్థ ఉండేది కాదనీ కుల, మత, వర్ణాలకు అతీతంగా ధర్మరక్షణ ఉండేదనీ అందుకు తార్కాణంగా ఆ కాలంలోని ఆప్యాయతలు, గౌరవాలు, ఒకరిపై ఒకరు ఆధారపడే తీరు, దానిని గుర్తించి మెలిగే వ్యక్తుల ఔన్నత్యాలను చిత్రిస్తూ ‘ధర్మచక్రము’, ‘కడిమి చెట్టు’, ‘చందవోలు రాణి’, ‘ప్రళయ నాయుడు’, ‘బద్దన్న సేనాని’, ‘వీర వల్లడు’ వంటి నవలలు రాశారు.

మన సంస్కృతికి ప్రాణం వంటి దాంపత్య ధర్మంపై విశ్వనాథ తన కాలంలో జరిగిన దాడులను, ఆకర్షణీయమైన విచ్ఛిన్నకర సిద్ధాంతాలను ఎదిరించాడు. సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వహించే వ్యవస్థను నిలబెట్టే దాంపత్య ధర్మాన్ని సమర్థించాడు. తెలుగు నవలల్లో, విశ్వనాథ నవలల్లో ‘ఏకవీర’ను మించి స్త్రీ పురుష మనస్తత్వాలను విశ్లేషించే నవల లేదనడం అతిశయోక్తి కాదు. ఈనాటికీ ఎవరెన్ని రకాల ప్రణయ గాథలు రాసినా వాటన్నింటిలో ఏకవీర ప్రతిధ్వనిస్తుంటుంది. విశ్వనాథ ద్రష్టత్వానికి ఇది తిరుగులేని ఉదాహరణ. విశ్వనాథ ప్రదర్శించిన వివాహ వ్యవస్థలో పురుషాధిపత్య భావన కనపడదు. సృష్టి పూర్ణానుసారమైతే స్త్రీ పురుషులు చెరి అర్ధభాగాలనీ ఒకరు లేక మరొకరు సంపూర్ణం కాదన్న సమానత్వ భావన చూపిస్తాడు.

‘ధర్మచక్రం’ నవలలో తన జన్మదోషం వల్ల రాణి తనను తక్కువగా చూస్తోందని రాజు కుములుతాడు. ‘చెలియలి కట్ట’లో రత్నావళి పాత్ర తన శరీరాన్ని వాంఛించే పురుషుల అజ్ఞానాన్ని తర్కంతో నిరూపిస్తుంది. ‘వేయి పడగలు’లో అరుంధతీ ధర్మారావుల దాంపత్యాన్ని వివరిస్తూ ‘ఈ ధర్మము పరస్పరమైనది. కాని పురుషుని ఆధిక్యత కలది కాదు’ అంటారు విశ్వనాథ. ఈ నవలలోని కిరీటి, శశిరేఖల ప్రణయగాథ ఏ ఆధునిక ప్రేమగాథకూ తీసిపోదు. ఇందులోని గిరిక ప్రణయం ఆధ్యాత్మిక ప్రణయం. అలాగే కుమారస్వామి, శ్యామలల వివాహం వర్ణాంతర వివాహం. ఇదంతా చూస్తే విశ్వనాథ ఛాందసుడనీ ఆధునిక భావ వ్యతిరేకి అని అనేవారికి విశ్వనాథను చదవడం రాదనుకోవాలి. లేదా వారు చదవకుండానే వ్యాఖ్యానిస్తున్నారని అనుకోవాలి. ‘ఏకవీర’లో ఛాయామాత్రంగా ప్రదర్శించిన ‘స్పర్శ సిద్ధాంత’ విరాట్ స్వరూపం ‘తెఱచిరాజు’లో చూడవచ్చు. ఇక ‘పులుల సత్యాగ్రహం’ ఆధునిక రాజకీయ విన్యాసాలపై వ్యంగ్య విమర్శ.

.

(రచన...- కస్తూరి మురళీకృష్ణ.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!