అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ! (పోతనామాత్యుడు.)





అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ!

(పోతనామాత్యుడు.)

.

శ్రీ కృష్ణ జననం తర్వాత వసుదేవుడు శ్రీకృష్ణుని రేపల్లెలో యశోద వద్దకు చేర్చి ఆమె వద్దవున్న యోగమాయను దేవకివద్దకు మార్చిన తరువాత,కావలివారి వలన దేవకి ప్రసవమైన విషయం తెలిసి కంసుడు..

తే.

వెండ్రుకలు వీడఁ బై చీర వ్రేలి యాడ

తాల్మి కీలూడ రోషాగ్ని దర్పమాడ

భూరి వైరంబుతోఁ గూడ పురిటియింటి

జాడఁ జనుదెంచి యా పాపఁ జంపఁ గదియ.

అంత దేవకి యడ్డంబు వచ్చి యిట్లనియె.

ఉ.

అన్న! శమింపు మన్న! తగ దల్లుఁడు గాఁ డిది! మేనగోడ లౌ

మన్నన సేయు మన్న! విను మానినిఁ జంపుట రాచపాడి గా

దన్న! సుకీర్తివై మనఁగ దన్న! మహాత్ములు వోవు త్రోవఁ బో

వన్న! భవత్సహోదరిఁ గదన్న! నినున్ శరణంబు వేఁడెదన్.

క.

కట్టా యార్గురు కొడుకులఁ, బట్టి వధించితివి యాఁడుఁబడు చిది కోడల్

నెట్టన చంపఁగవలెనే, కట్టిఁడివి గ దన్న! యన్న! కరుణింపఁగదే.

అని ప్రార్థిస్తుంది.--అనుప్రాసంటే పోతన గారి కెంతిష్టమో భాగవతంలో అడుగడుగునా దర్శన మిస్తుంటుంది.

ఈ ఘట్టంలోని కొన్ని ఇతర పద్యాలు.. కంసుడు దేవకీ వసుదేవతలతో..

క.

పగతురఁ జెఱిచితి ననియును, బగతురచేఁ జెడితి ననియు బాలుఁడు తలచున్

బగ చెలుములు లే వాత్మకుఁ, బగచెలుములు కీలు కర్మబంధము సుండీ.

అని అంటాడు.ఇదే సందర్భంలో పోతన గారింకా..

ఆ.

యశము సిరియు ధర్మ మాయువు భద్రంబు

నార్యహింస సేయ నణగుఁ గాదె! అనికూడా అంటారు.

.

దేవకి గర్భం నుండి శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేరింపబడినట్లు, కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలు దేరుతాడు. యమునానది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలి పోతుంది. యమునా నది నుండి బయలు దేరి నందనవనం లో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశం లో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువు ను తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆఏడుపు విన్న కావలి వారు నిద్ర లేచి దేవకీ దేవి ఎనిమిదోమారు ప్రసవించింది అని కంసుడు కి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీ దేవి "నీకు పుట్టింది మేనకోడలు,చంపొద్దు" అని వేడుకొంటుంది. కంసుడు ఆమాట వినక, శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది.

దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!