మొక్క నాట రండి మేలు కలుగు!

శుభోదయం !

-

మా అక్క గారి పద్యాలు !

(శ్రీమతి తరణి కంటి /వింజమూరి సూర్య లక్ష్మి

స్వయానా మా అక్కగారు .. వారు వ్రాసిన 

కొన్ని పద్యాలు మీకు అందిస్తున్నాను,)

మొక్క నాట రండి మేలు కలుగు!

రచన .. శ్రీమతి తరణి కంటి (వింజమూరి ) సూర్య లక్ష్మి

.

1. శ్రీలు పొంగు వారు శిరులొలి కేభూమి 

వనములెన్నొ గలిగి వెలుగు భూమి

నాటికైభవంబు నేడు తలచుకుంటు

మొక్క నాట రండి మేలు కలుగు.

.

2. వాన లెట్లు కురియు వనములు లేకుండ (నరకంగ) 

పంట లేల పండు పడక వాన 

ఎట్లు బతుక గలరు పంట లేక జనులు 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

3. అడవి సంపదంత అణగారి పోకుండ 

ముందు తరములకును మేలు గలుగ 

అడవు లవసరంబు అమలుజేయవలయు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

4. మూడు కాళ్ళ ముసలి మొక్కలు నాటంగ 

జనుల కపుడు వింత గాను దోచె 

నాటి మొక్క లన్ని నేడు వృక్షాలయ్యె 

మొక్క నాట రండి మేలు కలుగును.

5. అడవులన్ని పలుచ బడిపోవు చుండగ 

జంతుజాల మంత అంతరించు.

మానవళికలను ముప్పు వాటిల్లదా? 

మొక్క నాట రండి మేలు కలుగును. 

.

6. ప్రకృతి సహజమైన పనులు చేయుమెపుడు 

చదురు మదురు దాన్ని చెయకెపుడు.

సహజ సంపదంత సమతుల్య మై యుండ

మొక్క నాట రండి మేలు కలుగును. 

.

7. వేటలాడవద్దు వనవిహంగంబుల

వేటలాడవద్దు వనమృగములు 

వన్య మృగ విహంబు వనములకు వెలుగు

మొక్క నాట రండి మేలు కలుగును. 

8. వనములెన్నొ పెంచి వనమహోత్సవములు

చక్కగాను మనము జరుపుకొన్న 

వన్య మృగములన్ని వేడుక విహరించు 

మొక్క నాట రండి మేలు కలుగును.

.

9. మానవ మనుగడకు వనములే రక్షణంబు 

వన్యసంపదంత వాడుకొనగ

వనములెన్నొ పెంచి వనరులు కూర్చగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

10.మానవళి బతుకు వనములుంటే సాగు

వన్యరక్షణంబు మనకు రక్ష 

జీవకోటియంత జాగృత మై యుండ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

11. పట్టు కొమ్మలనగ చెట్లు పక్షులకును 

చెట్ల పైన గూళ్ళు కట్టి బతుకు 

పక్షిజాలమునకు పరిరక్షణంబుగ 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

12. చెట్ల పెంపకంబు చేయకున్నాగాని 

చెట్ల విలువ దెలుసుకుంటె చాలు 

ఛెట్లున రుకకంటె చేకూరు ఫలములు

మొక్క నాట రండి మేలు కలుగు.

.

13. ముందుచూపులేని మానవులను జూచి 

వన్యమృగములన్ని వణుకు చుండె

వారసత్వములగు వనములు నరుకంగ 

మొక్క నాటరండి మేలు కలుగు.

.

14. అంతరించు చున్న అడవి బతుకుజూచి

అలమటిస్తు ఏడ్చె అడవి తల్లి 

ఎంత దారుణంబు ఎంత ఘోరంబని 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

15. కామధేనువంచు కల్పతరువుయంచు 

చెట్లు దైవ మంచు చెట్ల గొలచె 

నాడు జనులు, వేడ్క, నాటి విల్వనెరుగ

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

16. బాట పక్క చెట్లు బాగుగా పెంచిన 

నీడ నిచ్చు బాట నడచు వార్కి 

చెట్లు నిలువ దెలుప చెప్పతరము గాదు 

మొక్క నాట రండి మేలు కలుగు.

.

17. ఎండలోన చెట్లు ఎంత హాయి గొలుపు 

ప్రాణ వాయులిచ్చి ఫలము లొసగు 

చెట్లు చేయు మేలు చెప్పతరము గాదు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

18. ముందు చూపు తోడ మొక్కలు నాటంగ 

ముందు తరములకును మేలు కలుగు 

మొక్క విలువ నెరిగి ముందు నడువగలిగాను 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

19. చెట్ల పెంపకంబు చేపట్టినాగాని 

మరొకమూల నుండి నరుక చెట్లు

ఎమి ఫలితముండు ఎన్ని చెట్లను పెంచ 

మొక్క నాట రండి మేలు కలుగు.

20. అడవులెన్నొ పెంచ అగచాట్లు పడుచున్న 

చాటుమాటు నరుకు చుండె చెట్లు 

చెట్లు నరుక కుండ చూసుకుంటు మనము 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

21. జ్ఞానమంత లేక అజ్ఞానమున ముల్గి 

చెట్ల విలువ నెరుగజాలకున్న 

చెట్ల విలువ దెలియజెప్పవలసియుండు

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

22. ఇంట నొక్క మొక్క నాట ప్రతినబూని 

మొక్క నాటి నీరు పోసి పెంచు

ఇంట నొక్క చెట్టు ఇలవేల్పు మనకంటు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

23. నాటి మహా ఋషులకు నెలవులు వనములు 

వన్య రక్షణంబు వారు జేసె 

భీతి లేక తిరిగె జంతువు లలనాడు 

మొక్క నాట రండి మేలు కలుగు. 

.

24. చుట్టు పక్కలన్ని చెట్లు చీమలతోడ 

కంటికింపు గాను కనపడంగ 

ఫరిసరాలు పచ్చ పచ్చగా నుంచగా 

మొక్క నాట రండి మేలు కలుగు.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!