🙏 🙏🙏 హాలాహల భక్షణ!🙏🙏 🙏

🙏 🙏🙏 హాలాహల భక్షణ!🙏🙏 🙏


👉పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి,


కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా


పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి, నేర్చుకోవాలి. )


🤲🤲🤲🤲🤲🤲🤲🤲


తనను స్తుతిస్తున్న బ్రహ్మాది దేవతలను చూసి, 

సర్వప్రాణులనూ సమానంగా ఆదరించే పరమ విభుడు, 

శంకరుడు తన అనుంగు భార్యతో ఇలా అన్నాడు....


🏵️


క.


కంటే జగముల దుఃఖము; 

వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై

యుంటకు నార్తుల యాపద

గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!


భావము:

“ఓ లేడి కన్నుల సుందరీ! సతీదేవీ! చూడు లోకాలు ఎంత దుఃఖంలో ఉన్నాయో. ఎంత తీవ్ర ప్రభావంతో ఉందో నీళ్ళలో పుట్టిన ఆ హాలాహల విషం. శక్తిసామర్థ్యాలుగల ప్రభువు ప్రజల కష్టాన్ని తొలగించాలి. దానివలన కీర్తి వస్తుంది.


🏵️🏵️


క.


ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన 

ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం

బ్రాణుల కిత్తురు సాధులు 

బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా!


భావము:

ఓ మగువా! పార్వతీ దేవి! ప్రాణభయంతో ఆశ్రయించిన జీవులను కాపాడటం ప్రభువుల కర్తవ్యం. ప్రాణాలు నిమిషంలో నశించి పోయేవి. అందువలననే ఉత్తములు ప్రాణులకు తమ ప్రాణాలను అర్పించుటకు సైతం వెనుకాడరు.


🏵️🏵️🏵️


క.


పరహితము జేయు నెవ్వఁడు

పరమ హితుం డగును భూత పంచకమునకుం

బరహితమె పరమ ధర్మము

పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!


భావము:

ఓ సౌందర్యరాశీ! పార్వతీదేవీ! ఇతరులకు సాయం చేసేవాడు, పంచభూతాలకూ పరమాప్తుడు అయి ఉంటాడు. పరోపకారమే పరమోత్తమ ధర్మం. పరోకారికి ఎక్కడా తిరుగు లేదు.


🏵️🏵️.🏵️🏵️


క.


హరి మది నానందించిన

హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్

హరియును జగములు మెచ్చఁగ

గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ!


భావము:

ఓ మృగాక్షీ! ఉమాదేవీ! ఓ పద్మాక్షి! విష్ణుమూర్తిని తృప్తిపరిస్తే, లోకాలు అన్నీ తృప్తి చెందుతాయి. ఆ విష్ణుమూర్తీ, లోకాలూ సంతోషించేలా హాలాహల విషాన్ని అదుపు చేయడం మంచిపని.


🏵️🏵️🏵️


క.


శిక్షింతు హాలహలమును

భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతుఁ బ్రాణి కోట్లను

వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!


భావము:

వికసించిన పద్మం వంటి మోము గల సతీదేవీ! హాలాహలాన్ని దండిస్తాను. చాలా చిన్న తియ్యని పండు రసంవలె హాలాహలాన్ని మింగుతాను. ఇవాళ ఈ జీవలోకం సమస్తాన్ని కాపాడతాను. నువ్వు చూస్తూ ఉండు.”


ఇలా హాలాహలం మింగుతా అంటున్న తన భర్త అయిన భవునితో, ప్రియభార్య భవానీదేవి ఇలా అంటోంది. “స్వామీ! మీ మనస్సుకు తగినట్లు చేయండి.”


🏵️🏵️


క.


మ్రింగెడి వాఁడు విభుం డని 

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


భావము:

ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది. 

(ఇది అసామాన్య శబ్దార్థసౌందర్యభరితమైన పద్యం. శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఈ పద్యం. మ్రింగ్ మ్రింగ్ అంటూ ఎలా ధ్వనిస్తోందో. (పూర్ణానుస్వరపూర్వక గకార ప్రాస) అటుపక్క ఆ గరళానికి, మంగళ మంగళ అంటూ సమాధానాలను వేసిన తీరు పద్యానికి ఎంత అందాన్నిచ్చిందో. మరల మరల ప్రయోగించిన గ’, ళ’ లు, మింగటంలో గళం లోనే ఆపేసాడు అని, శక్తి స్వరూపిణి స్త్రీతో పాలుపంచుకంటుంటే ఎంతటి కాలకూటవిషం ఎదురొచ్చినా మంగళానికి లోటు ఉండదు అని స్పురిస్తోంది.)


దేవతలు మహాదేవుని చుట్టూ చేరి “జయ జయ” ధ్వానాలు చేశారు. పరమ శివుడు మేఘ గంభీర కంఠస్వరంతో “ఓహో! లోకద్రోహీ! పారిపోకు రా! రా!” అని, సర్వనాశనము చేసే ఆ హాలహాల మహావిషాన్ని తన చేయి చాచి పట్టుకుని, ముద్ద చేసి, నేరేడు పండునోట్లో వేసుకున్నంత సుళువుగా, విలాసంగా భుజించాడు.


🏵️🏵️🏵️

పరమ శివుడు అలా అతి భీకరమైన మహా విషాగ్నిని మ్రింగే సమయంలో. . . .


-మ.


కదలం బాఱవు పాఁప పేరు; లొడలన్ ఘర్మాంబుజాలంబు పు

ట్టదు; నేత్రంబులు నెఱ్ఱ గావు; నిజజూటా చంద్రుఁడుం గందఁడున్; 

వదనాంభోజము వాడ; దా విషము నాహ్వానించుచో డాయుచోఁ

బదిలుండై కడి జేయుచోఁ దిగుచుచో భక్షించుచో మ్రింగుచోన్.


భావము:

మహాదేవుడు ప్రచండమైన ఆ హాలాహలాగ్నిని ఆహ్వానిస్తున్నప్పుడు కానీ, దానిని సమిపించే టప్పుడు కానీ, పదిలంగా పట్టుకుని ముద్దచేసే టప్పుడు కానీ, నోట్లో ఉంచుకునే టప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, మ్రింగే టప్పుడు కానీ, ఆయన కంఠాన హారాలుగా ఉన్న సర్పాలు కదలలేదు; చెమటలు గ్రమ్మ లేదు; కన్నులు ఎఱ్ఱబార లేదు; సిగలోని చంద్రుడు కందిపోలేదు; ఆయన ముఖ పద్మం వడల లేదు.


🏵️🏵️🏵️

-క.


ఉదరము లోకంబులకును

సదనం బగు టెఱిఁగి శివుఁడు చటుల విషాగ్నిం

గుదురుకొనఁ గంఠబిలమున

బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.


భావము:

పరమేశ్వరుడి ఉదరం సమస్త లోకాలకూ నివాసం కనుక. ఆయన ఆ భీకరమైన విషాగ్నిని ఉందరంలోనికి పోనివ్వకుండా, ఏదో చిన్న పండ్ల రసాన్ని ఉంచుకున్నట్లుగా, తన కంఠ బిలంలో కుదురుగా ఉండేలా జాగ్రత్తగా నిలుపుకున్నాడు.


🏵️🏵️🏵️


-క.


మెచ్చిన మచ్చిక గలిగిన

నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం

జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె

చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.


భావము:

మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ; ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?


🏵️🏵️🏵️


ఆ.


హరుఁడు గళమునందు హాలహలము బెట్టఁ

గప్పుఁ గలిగి తొడవు కరణి నొప్పె; 

సాధురక్షణంబు సజ్జనులకు నెన్న

భూషణంబు గాదె భూవరేంద్ర!


భావము:

ఓ రాజోత్తమా! హరుడు హాలాహలాన్ని కడుపులోకి మ్రింగకుండా కుత్తుకలో నిలుపుకోవడం వలన ఆయన కంఠంమీద నల్లమచ్చ ఏర్పడి ఒక ఆభరణంగా నప్పింది. ఆలోచించి చూస్తే ఉత్తములకు సాధు సంరక్షణ అలంకారమే కదా.


🏵️🏵️🏵️


క.


మెచ్చిన మచ్చిక గలిగిన

నిచ్చిన నీవచ్చుఁ గాక యిచ్చ నొరులకుం

జిచ్చుఁ గడిగొనఁగ వచ్చునె

చిచ్చఱరూ పచ్చుపడిన శివునకుఁ దక్కన్.


భావము:

మెచ్చినప్పుడూ, నచ్చినప్పుడూ ఇచ్చవచ్చినంత ఎవరికైనా ఇవ్వవచ్చు. కానీ; ఇతరుల కోసం భగభగ మండే చిచ్చును కోరి కబళంచేసి మింగటం అన్నది, ఆ చిచ్చర కన్ను గల పరమ శివుడైన హరునికి తప్పించి ఎవరికి సాధ్యం అవుతుంది?


.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!