అరాళ కుంతలా - అంటే? ఏమో.🌹

అరాళ కుంతలా - అంటే? ఏమో.🌹


🏵️


"నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా


చిన అదినాకు మన్ననయా .. చెల్వగు నీ పదపల్లవంబు మ


త్తనుపులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే


ననియెద .. అల్కమానవుగదా ఇకనైన అరాళకుంతలా !


🏵️🏵️🏵️


ఒక అమ్మాయి పద్యం అర్ధమడిగితే విడమరచి మరీ చెప్పా

భవదీయ - నీ, దాసుని- దాసుడిని, (అయిన) నను - నన్ను, (నీ) మనంబున - మనసులో, నెయ్యపు -స్నేహపు, కినుక+పూని - అలక పూని (స్నేహపు అలక - ప్రణయ కలహం), తాచిన - తన్నిన, అదినాకు - అదినాకు, మన్ననయా - గౌరవమే; (నీ పాదం నన్ను తాకడం వలన) పులకాగ్ర- పులకించి గగుర్పొడిచి, కంటక - ముల్ల, వితానము - సమూహము, పొద (లా ఉన్నటువంటి) మత్తను - నా శరీరం, (ను) చెల్వగు - చెలివి అయినటువంటి, నీ - నీ, పదపల్లవంబు - చిగురులంటి పాదం, తాకిన - తాకిన, నొచ్చునంచు - నొప్పి కలుగును అని, నేననియెద - నేను అంటున్నా;. (కనుక) ఇకనైన - ఇకనైన, అల్కమానవుగదా - (నీ) అలక మానవా? అరాళ కుంతలా --??


అరాళ కుంతలా - అంటే? ఏమో. కానీ అరాళ కుంతల మాత్రం 

నన్ను వదల్లేదు. అ పదాన్ని రకరకాలుగా విడగొట్టి అర్ధం చెప్పడానికి ప్రయత్నిచా. అ రాల కుంతల - రాలని కుంతలు కలది (మరి కుంతల అంటే?), అరా ళ కుంతల? అరాళ కుం తల? అబ్బో ఎన్ని రకాలుగా కుదురుతుందో అన్ని రకాలుగా ముక్కలు చేసా. తెలుగు పండితులు ఆత్మహత్య చేసుకునేలా.


ఆరోజు శ్రీ కృష్ణుడు చూపిన మార్గంలో నేను వెళుతున్నా అని ఎందుకన్నానో తెలీదు కానీ. ఆయన మార్గంలో వెళితే ఉన్న లాభాలు నాకు అరాళ కుంతల అన్న పదానికి అర్ధం తెలిసాక కానీ తెలీలేదు. జగన్నాటక సూత్రధారికి ఆమాత్రం నటించడం రాదా?


నిఘంటువులో అరాళము అన్నపదానికి మదపుటేనుఁగు, వంకరైనది మొదలగు అర్ధాలున్నాయి. 

కుంతలము అన్నపదానికి వెండ్రుక, నాగలి మొదలగు అర్ధాలున్నయి. కనుక మన సందర్భంలొ అరాళ కుంతల అంటే వంకరైన వెంట్రుకలు (curly hair) కలదానా అని చెప్పుకోవాలి. 

అంటే సత్యభామకు curly hair అన్నమాట. దాన్ని అటుదిటు, ఇటుదటుగా చెబితే curly hair కలవాళ్ళందరు సత్యభామలు అనాలా? సరె ఇదంతా ఇప్పుడెందుకు కానీ విషయానికొద్దాం. శ్రీ కృష్ణుడు సత్యభామను బ్రతిమాలుకుంటున్నాడు, కాళ్ళ దగ్గరికొచ్చాడు


కానీ జుట్టు గురించి మాట్లాడుతున్నాడు. చూసారా! 

ఎంత మోసమో, ఎంత కంతిరి తనమో. ముందు పట్టుకున్నది కాళ్ళే అయినా తరువాత పట్టుకునేది జుట్టే అని ముందే అరాళ కుంతలా అని పిలిచి మరీ హెచ్చరించాడు.

పాపం సత్యభామ ఈ నిజం గ్రహించక నమ్మేసి చల్లబడిపోయింది. తులాభారం తరువాత సత్యభామ జుట్టే పట్టుకున్నాడు శ్రీ కృష్ణుడు. ఈ కుయుక్తి శ్రీ కృష్ణుడు సత్యభామమీదే కాదు, భృగు మహర్షి మీద కూడా ప్రయోగించాడు, వేంకటేశావతారానికి ముందు, అవతారం మారినా బుద్దులు మారవు కదా.


పాఠకులందరికి శ్రీ కృష్ణుని మార్గం అర్ధమయ్యిందనుకుంటా,

"ముందు పట్టుకునేది కాళ్ళే అయినా లక్ష్యం మాత్రం జుట్టే". 

అదే మనకు ఆద ర్శం. కుచ్ (జుట్టు) జీత్‌నే కేలియే కుచ్ (కాళ్ళు) హార్‌నా పడ్‌తా హై.


కొస మెరుపులు:

1. ఈ పరిశోధన వళ్ళ నాకు వెండ్రుక అనే అనే పదం తెలిసింది. ఇన్నాళ్లు వెంట్రుక అని మాత్రమే తెలుసు. నిఘంటువులో 'వెండ్రుక'కే అర్ధం ఇవ్వబడింది. వెంట్రుక కోసం వెతికేతే వెండ్రుకని చూడుము అంటుంది.


2. శ్రీ కృష్ణుడికి సత్యభామ కాలు తాకడం కేవలం నంది తిమ్మన గారి కల్పన మాత్రమేనట. ఆ కల్పన ఎందుకు చెయ్యవలసొచ్చిందనడానికి ఒక కత ఎక్కడో చదివినట్టు గుర్తు.

ఒకానొక సందర్భంలో శ్రీ కృష్ణదేవరాయలు వారికి వారి భార్యామణి కాలు తగిలిందని ఆయన భార్యమీద కోపంతో మాట్లాడకుండా ఉన్నాడంట. విషయం తెలిసిన నంది తిమ్మన భార్య కాలు తాకడం తప్పుకాదు అని రాయలవారికి చెప్పడంకోసం ఈ కల్పన చేసాడంట.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

  1. మీరు విశదీకరించిన విధానం వర్ణించడం మా వశమా...

    ReplyDelete
  2. అద్భుతమైన వివరణ. ఆరాల కుంతలా అంటే ఇంత అర్ధం ఉందని మీ వివరణ ద్వారానే తెలుసు కున్నాను. కృష్ణార్జున యుద్ధం నుంచి స్వీకరించబడింది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!